సుప్రభాత కవిత ; -బృంద
మాటలెన్నో దాచుకున్న
మౌనంతో ఎదురు చూస్తున్న
అవనికెంత సంబరమో
ఆదిత్యుని రాక!

నీరసంగా తిరుగుతూ
తోచనట్టు దిగులుగా వీస్తున్న 
చిరుగాలికెంత  ఉత్సాహమో
మార్తాండుని రాక!

కిరణాల స్పర్శతో
నునువెచ్చగ మారే
బండరాయిదెంత నిరీక్షణో
భాస్కరుని రాక!

మెరుస్తున్న జలరేఖల
అతిశయంగా చుట్టుకున్న
జలదాలకెంత సంతోషమో
సూర్యుని రాక!

పరవశించి తేలుతూ
పులకరించి పాడుతున్న
పుష్ప సుగంధానికెంత ఆత్రమో
ఆప్తమిత్రుని రాకకై!

వెతలను తీర్చే వరమేదో
రాతలను మార్చే మలుపేదో
దశలు తిరిగే అద్భుతమేదో
తెస్తుందని ఆశగ చూసే మనసుకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు