-జీవనం;-పద్మ పొడిచేటి
కుసుమ ధర్మన్న కళాపీఠం 
======================
చింతలు లేని బాల్యం భవ్యం
ఆటల,పాటలనాడు వసంతం
అమ్మా,నాన్నల ఒడే సర్వస్వం
తిరిగి రానిదా సుందర దృశ్యం 
ఆరోజులన్ని అమృత తుల్యం

యవ్వనాన పతి చేరిన తరుణం
ముసుగు తీసింది సిగ్గుల పర్వం
కౌగిలింట కళ్యాణ జీవనం
దిద్దుకుంది సింధూర శోభనం
అందింది రసమయ జీవితం

కన్నియగా అందమె ఆనందం
గృహిణిగ తనకానందమె అందం
సతి పతులను వేరనుట అసత్యం
ఒకరికి ఒకరుగ సాగుట నిత్యం
అదేకదా వైవాహిక గమనం

అహంకారం అధోగతి మార్గం
చిందిస్తుంది కాలకూట విషం
ఆత్మాభిమానం ఇచ్చును గౌరవం
పరువు,మర్యాద నిలిపునీ సూత్రం
చేయును భవితకు మార్గదర్శనం

ధనంతోటి నిలువదు ఏ బంధం
ఆప్యాయతలే ప్రేమకు గమ్యం
మనసులు కలిసిన మంగళసూత్రం 
శృతి,లయల సప్తపదుల సంగమం
అదే కూర్చు జీవన సాఫల్యం

కామెంట్‌లు