ఇక్కడ తాజా చేపలు అమ్మబడును -డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

 ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉండేటోడు. వాడు ఎవరు ఏమి చెప్పినా మారు మాట్లాడకుండా గమ్మున వినేటోడు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు, కొంచెంకూడా బుర్రకు పదును పెట్టకుండా చేసేటోడు. నెమ్మదిగా వానికి పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి చేసుకుందామంటే 'ఏ సంపాదనా లేనివాడికి ఎవరూ పిల్లనివ్వరు కదా... దాంతో ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి' అనుకున్నాడు.
వాళ్ల వీధి దగ్గరే ఒక బజారు వుంది. అందులో రకరకాల అంగళ్లు వున్నాయి. పోయి ఆ చివర నుండి ఈ చివర వరకు, ఈ చివర నుండి ఆ చివర వరకు పదిసార్లు అటూ ఇటూ తిరిగుతూ జాగ్రత్తగా గమనించినాడు. బట్టల అంగళ్లు, గాజుల అంగళ్లు, పుస్తకాల అంగళ్లు, సరుకుల అంగళ్లు, కూరగాయల అంగళ్లు, పళ్ళ అంగళ్లు, పూల అంగళ్లు ఇట్లా అనేకం కనబడుతా వున్నాయి గానీ చేపల అంగడి ఎక్కడా కనబడలేదు. జనాలు చానా దూరం తుంగభద్రా నది దగ్గరికి పోయి చేపలు తెచ్చుకోవాలి. దాంతో "అక్కడ చేపల అంగడి గనుక పెడితే బ్రహ్మాండంగా జరుగుతుంది... పదికి పది లాభం వస్తుంది" అనుకున్నాడు.
వెంటనే చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి పోయి... చేపలు రోజూ పట్టి తెచ్చి ఇచ్చేటట్లు బేరం మాట్లాడుకున్నాడు. బజారులో ఒకచోట అంగడి దొరికింది. అంగడిపైన ఎర్రని లావు లావు అక్షరాలతో "ఇక్కడ తాజా చేపలు అమ్మబడును" అని పేరు రాయించినాడు.
తర్వాతరోజు చేపలు కొనడానికి వచ్చిన ఒక గురువు పైన రాయించిన ఆ అంగడి పేరును చూసి కోపంగా "ఎవడయ్యా పేరు ఇలా రాయించింది. ఇక్కడ తాజా చేపలు అమ్మబడును ఏంది? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ అమ్ముతారు. బజారు బయటనా లేక మీ ఇంటి పక్కనా... కొంచెం గూడా తెలుగు రాదు. తెలివి లేదు. నిన్ను కాదు నీకు 'అ ఆ'లు నేర్పించిన ఆ గురువును అంటారు ఇది చూస్తే. వెంటనే పై వాక్యంలో 'ఇక్కడ' తీసేయ్" అన్నాడు.
ఆ అమాయకుడు మారుమాట్లాడకుండా 'అలాగే' అని తర్వాతరోజు 'ఇచ్చట' అనే పదం తీసేసి "తాజా చేపలు అమ్మబడును" అని తిరిగి రాయించినాడు. తర్వాతరోజు చేపలు కొనడానికి వచ్చిన ఒక ముసలాయన ఆ పేరును చూసి నోటికి చేయి అడ్డం పెట్టుకుని పకపక నవ్వసాగినాడు. అది చూసి ఆ అమాయకుడు "ఏంది తాతా... అట్లా పగలబడి నవ్వుతా వున్నావు. ఏమైంది" అన్నాడు తల గోక్కుంటా.
ఆ ముసలాయన నవ్వు ఆపుకుంటా "ఎవరైనా తాజా చేపలు అని రాయిస్తారా పైన. ఈ బజారులో తాజావి కాకపోతే కుళ్ళిపోయినవి, కంపుకొట్టేవి అమ్ముతారా? నువ్వు 'తాజా' అనే మాట రాపించినావు కదా... అది చూసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అమ్ముతున్నవి నిజంగా తాజావేనా, కొంపదీసి నిన్నటివి కూడా అమ్ముతున్నారా అని అనవసరంగా అనుమానం కలుగుతుంది. ఆపైన నీ అంగడికి రావడానికి కూడా భయపడతారు" అని చెప్పినాడు. ఆ అమాయకునికి ఆ మాటలు నిజమే అనిపించినాయి. వెంటనే 'తాజా' అనే పదం తీసేసి 'చేపలు అమ్మబడును' అని మరలా రాయించినాడు.
ఆ తర్వాతరోజు చేపలు కొనడానికి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చినారు. వాళ్లలో ఒకడు పైన వున్న పేరును చూసి పక్కవానికి చూపిస్తూ గుసగుసగా ఏదో చెప్తా నవ్వసాగినాడు. అది చూసిన అమాయకుడు "ఏందన్నా అంగడి పేరు చూయించి అట్లా నవ్వుతున్నావు. ఏమైంది అంతా బాగానే వుంది కదా" అన్నాడు. దానికి అతను "ఏం లేదు... ఈ బజారులో ఎవరు ఏ అంగడి పెట్టినా అమ్మడానికే గానీ తినడానికో, కొనడానికో, పారేయడానికో, ఉచితంగా పంచడానికో కాదు కదా... అలాంటప్పుడు చేపల పక్కన అమ్మబడును అని అనవసరంగా వ్రాయించడం ఎందుకు" అన్నాడు. ఆ అమాయకుడు ఆలోచించినాడు. "నిజమే కదా... నేనిక్కడ అమ్ముతానే గానీ కొంటానా ఏంటి?" అనుకొని ఆ మాట కూడా తీసేసి కేవలం 'చేపలు' అని రాయించినాడు.   
తర్వాతరోజు ఒకాయన వచ్చి పైన రాసిన పేరును చూసి పకపక నవ్వుతా "ఒరేయ్ పిచ్చి సన్నాసీ... నువ్వు అమ్ముతున్నది చేపలు కాకపోతే కోళ్లు, మేకలు, కప్పలు, పాములు కాదు కదా. కళ్ళ ముందు అందరికీ చేపలు కనపడతా వుంటే మరలా ఇంత లావు లావు అక్షరాలతో చేపలు అని రాయించడమేంటి. నీ అంగడికి వచ్చేటోళ్లు ఏమైనా తెలివి తక్కువ యదవలు గానీ, కళ్ళులేని కబోదులు గానీ అనుకుంటా వున్నావా... ఏంది" అన్నాడు.  ఆ మాటలకు ఆ అమాయకుడు "ఇతను చెప్పేది కూడా నిజమే... కళ్ళముందు చేపలు కనపడతా వుంటే మరలా పైన చేపలు అని రాయించడమేంటి. చూస్తే నవ్వుతారు" అనుకుంటా అది కూడా తీయించేసినాడు. దాంతో పైన ఎటువంటి పేరు లేక ఖాళీగా తయారైంది.
ఆ తర్వాతరోజు ఒక యువకుడు చేపల కోసం అంగడికి వచ్చినాడు. పైన ఖాళీగా బోసిపోయి వున్న స్థలాన్ని చూస్తా లోలోపల నవ్వుకుంటా వున్నాడు. అది చూసి ఏమీ అర్థంగాక ఆ అమాయకుడు "అన్నా... ఎందుకిలా మాటిమాటికి పైకి చూస్తా నవ్వుకుంటా వున్నావు" అని అడిగినాడు తలగోక్కుంటా.
"ఏమీ లేదు. బజారులో నీ అంగడి కోసం వెతికేటోళ్ళకు టకీమని కనపడేటట్లు అంగడిపైన 'ఇక్కడ తాజా చేపలు అమ్మబడును' అని అందంగాఎర్రని అక్షరాలతో  పెద్ద పెద్దగా రాయించక అలా ఖాళీగా వుంచావే... కొంచెమైనా తెలివి వుందా. బుర్ర తలలో గాక మోకాల్లో ఉన్నట్టుందే నీకు. అది తలుచుకొని నవ్వుకుంటా వున్నా" అన్నాడు. ఆ మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక ఆ అమాయకుడు నోరు వెళ్ళబెట్టినాడు.
ఆ విషయం తెలిసి వాళ్ళ నాయన "రేయ్ బుర్ర తక్కువ వెధవా... ఎవరైనా ఏదైనా చెబితే వినాలగానీ తొందరపడి టకీమని నిర్ణయం తీసుకోకూడదు. వినేటోడు దొరకాలే గానీ ఈ లోకంలో పైసకు పనికిరాని ప్రతి ఎదవ ఎగబడి సలహాలు ఇస్తా వుంటాడు. వాటన్నిటిని నమ్మితే అంతే. పదిమందిని అడగాల... విలువైన సలహాను ఎన్నుకోవాల... లాభం నష్టం బెరీజు వేసుకొని సొంతంగా నిర్ణయం తీసుకోవాల... అంతేగానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రతి ఒక్కరి మాట పట్టించుకోకూడదు" అని చెప్పినాడు.
*********
కామెంట్‌లు