తాత్వికత ;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
అనుకుంటాం గానీ 
అన్నీ లొంగవు చేతివాటానికి 
కొన్ని చేతికే చిక్కవు ఊసుపోక 
మనమే గాలిగాలి 
అది నాది ఇది నాదను తలపు
 కళ చెదిరిపోని కల 

ప్రయత్నం చెయ్ తప్పక 
మానవధర్మం మంచిదేగా
ఐతే 
ప్రతి సందర్భం సమయమూ ఒకేలా
ఉంటే 
అది బతుకెందుకౌతుంది మిత్రమా

ఎన్నో కలలు కలతలూ సాలీడు 
అల్లిన కళాకాంతి పాఠమైంది అడుగడగులో
అనితర సాధ్యమైన 
గెలుపు అంచులు చుట్టే లయ నాడిగుండె అణువణువునా
అన్నివేళలా తపించే పని జీవపదార్థమే 

చేసే ప్రతి పనిలో నీదైన ద్విగుణీకృత ముద్ర ఉంటేనే
అదో నిగూఢ నిర్మల గాఢ సముద్ర గీతం

పనిరాక్షసం నేర్పిన విద్య లక్షితమైన
విజయం 
చేకూరే దాక విశ్రమించొద్దు 
ఇక పనిలో ఆనందం అమితం అమేయం తొవ్వుకో తోడుకో 
బతుకంతా నింపుకో స్వేచ్ఛగా

శ్రామిక కరచాలనం ఓ ధీమా  
బతుకు పొరల్లో 
పని తాత్వికత మట్టిలో అరుదైన మానవీయత 


కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
వండర్ఫుల్. Work is🌹 worship. కర్మయోగ తాత్వికతను కవీశ్వరులు చక్కగా వివరించారు.కంగ్రాట్స్