సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-491
గో మహిష్యాది న్యాయము
****
గో అంటే ఆవు,భూమి, వాక్కు,సరస్వతి,తల్లి, దిక్కు,ఎద్దు,కిరణము స్వర్గము,చంద్రుడు,వజ్రాయుధము,కన్ను అనే అర్థాలు ఉన్నాయి. మహిషి అనగా గేదె , బఱ్ఱె,ఎనుము, పట్టపు రాణి అనే అర్థాలు కలవు.ఆది అనగా మొదటి , ప్రధానమైన మొదలైన అనే అర్థాలు ఉన్నాయి.
ఆవులూ పాలిచ్చును.బఱ్ఱెలూ, గొఱ్ఱెలూ పాలిచ్చును అని ఈ న్యాయము యొక్క అర్థము.
పై వాక్యాలు చదువుతుంటే ఆవులు, గేదెలు, మేకలు,గొర్రెలేం ఖర్మ గాడిదలు,దుప్పులు, ఒంటెలు ,ఏనుగుల్లాంటి క్షీరదాలు అన్నీ పాలిస్తాయి కదా! అనిపిస్తుంది ఎవరికైనా.
కాకపోతే మనం ఆవు, బఱ్ఱె ,మేక పాలు తాగుతాం. ఆస్త్మా వంటి రోగ నివారణకు గాడిద పాలు మంచి ఔషధమని తాగడం, తాగించడం చూస్తున్నాం.
 ఆవు అమ్మ వంటిదని ఆవు పాలు పసిపిల్లలకు  మంచిదని ,తల్లి దగ్గర సరిపడా పాలు దొరకనప్పుడు మన పెద్దవాళ్ళ సూచనల ప్రకారం ఆవు పాలు పట్టడం మనందరికీ తెలిసిందే.
అయితే మన దేశంలో ఎక్కువగా బఱ్ఱె పాలే ఉపయోగిస్తారు. బఱ్ఱె పాలల్లో పోషక విలువలు, ప్రోటీన్లు చాలా ఉన్నాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు. పెరుగు  నెయ్యి కూడా బాగుంటుంది.
 మేకలు చాలా తక్కువ పాలను ఇస్తాయి.వీటిని జనులు ఎక్కువగా తాగేవారు కాదు కానీ వాటిని కాసే కాపరుల కుటుంబాలు కొన్ని తాము పెంచుకునే మేకల పాలు తాగడం సహజంగా జరిగేది.మేక పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివని అంటారు. గాంధీజీ కూడా మేకపాలు తాగే వారట. గొఱ్ఱెలు పాలను చాలా తక్కువగా ఉత్పత్తి చేస్తాయి. వాటిని కూడా కొందరు ఆహారంలో ఉపయోగిస్తారు.
ఇక ఎడారులలో ప్రయాణం చేసే వర్తకులు ఎడారి ఓడ అయిన ఒంటె  పాలు తాగుతారట. ఒంటెనే కాకుండా  కొన్ని దేశాల్లో దుప్పి పాలు తాగుతారట.
ఏనుగు పాలల్లో ఆల్కాహాల్ ఎక్కువగా ఉంటుందని అవి మనుషులకు హాని చేస్తాయని, అవి  తాగడానికి పనికి రావని అంటారు.
ఇలా మానవులు క్షీరదాలైన కొన్ని జంతువులను  మచ్చిక చేసుకొని వాటి పాలను ఆహారంగా ఉపయోగించడం అనాదిగా జరుగుతోంది.
 మరి ఈ "గో మహిష్యాది న్యాయము"ను  మన పెద్దలు ఎందుకు చెప్పారో కూడా చూద్దాం.
  మనం ఇప్పటి వరకూ కొన్ని పెంపుడు జంతువుల పాల గురించి చెప్పుకున్నాం కదా! అయితే 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్న చందంగా ఇప్పుడు చెప్పుకున్న జంతువుల్లో  ఉత్తమమైన జంతువుల పాలనే అంటే  పోషక విలువలు కలిగి ఆరోగ్యానికి మేలు చేసే పాలను ఉపయోగించాలని చెప్పేందుకే మన పెద్దలు ఈ  న్యాయమును సృష్టించారని వేరే చెప్పక్కర్లేదు.
అవండీ  పాలిచ్చే  జంతువుల పాల కథనాలు."ఆవులూ పాలిస్తాయి, బఱ్ఱెలు,గొఱ్ఱెలు, గాడిదలు మొదలైనవి పాలిస్తాయి " మరి  వాటిలో మంచి పాలను, వాటి  పాల పదార్థాలను ఎంచుకుని నిత్యం ఆహారంలో ఉపయోగిద్దాం.మంచి ఆరోగ్యాన్ని  మన స్వంతం చేసుకుందాం.మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు