శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.ల- టి. వి. యెల్. గాయత్రి. పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి పద్యములు.
-------------------------
71.
వడలి పోతిని వయసది నుడిగిపోయె
కూల బడితిని వార్ధక్య కూపమందు
దిక్కుతోచక పిలిచితి దేవదేవ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
72.
గట్టి తనమింక చెల్లదు గరుడగమన!
వట్టి మాటలు వినినిన్ను వదలనయ్య !
భక్తవత్సలా!వీడుమా!పట్టుదలను!
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
73.
నిముసమైనను గాంచగా నీదురూపు
వేచి యుంటిని జూపవే వేడ్కమీర
బలుతెఱంగుల వేడితి బలుకరావ!
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
74.
పసిమి వర్ణపు ఛాయలో పరిఢవిల్లి
మెఱుపు చందాన వెల్గెడి మేటినీవు
కనుల కింపగు నీరూపు గాంచగోరు
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
75.
సిరిని హృదయర్ద్ర సీమల   మురియుచుండి
నిలిపివెల్గెడి  నీ చెంత నిలిచియుండి 
పూజలెన్నియో సల్పితి ముక్తి నిడుచు 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు