చంద్రుని శాపం -డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212

 పిల్లలూ... నీటిలో ఏనుగునైనా చంపగల మొసలి... బైటికి వస్తే కుక్కకు గూడా భయపడుతుంది. మరి దాని బలం భూమ్మీద ఎందుకు తగ్గిపోతుందో తెలుసుకోవాలనివుందా... ఐతే... ఈ కథ వినండి.
ఇది చాలాచాలా కాలం కిందటి సంగతి. అప్పట్లో మొసళ్ళు నీళ్ళలోనే కాదు నేలపైనా తిరుగుతా వుండేవంట! ఒక అడవిలో ఒక మొసలి వుండేది. దానికి పెద్దపెద్ద పళ్ళు, బలమైన ఒళ్ళు, పొడవైన తోక వుండేవి. దాన్ని చూస్తానే జంతువులన్నీ భయంతో గజగజా వణికిపోయేవి. దానికి చిక్కితే ఆ రోజుతో వాటికి భూమి మీద నూకలు చెల్లినట్లే. దానితో గొడవ పడితే రంపంలాంటి కోరపళ్ళతో ఛటుక్కున పట్టేసేది. అది ఏనుగయినా, పులయినా, సింహమయినా, ఎలుగుబంటయినా... ఏదీ దాన్నుంచి తప్పించుకోలేక పోయేది. పెద్ద పెద్ద జంతువులే భయపడి చస్తా వుంటే ఇంక చిన్నచిన్న జంతువుల సంగతి చెప్పేదేముంది. అది అంత దూరంలో కనబడడం ఆలస్యం పరుగులు పెట్టేవి. మొసలికి నేలమీదా, నీటిలోనా ఎదురే లేకుండా పోయింది. మకుటం లేని మహారాజులా విర్రవీగసాగింది. దాంతో దానికి బాగా పొగరు పట్టింది. నన్ను మించినోళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరనుకొంది. అందరూ తనమాటే వినాలనుకొంది.
ఆ అడవి మధ్యలో ఒక చెరువు వుంది. అది నిండుగా, స్వచ్ఛమైన నీటితో రంగు రంగుల చేపలతో, చుట్టూరా పచ్చని చెట్లతో చాలా అందంగా వుంది.
ఒకరోజు ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తా తిరుగుతా వుంటే ఈ అడవి కనిపించింది. అడవి మధ్యలో చెరువు చూడముచ్చటగా అనిపించింది. 'ఆహా... ఎంత చక్కగా మహానంది కోనేట్లా స్వచ్ఛంగా వుంది'' అనుకుంటా ఆ అర్ధరాత్రి ఆకాశం నుంచి నెమ్మదిగా కిందకి దిగి వచ్చాడు. ఆ చెరువులో దిగి హాయిగా స్నానం చేయసాగాడు.
చెరువు పక్కనే ఒక పొదలో పడుకోనున్న మొసలి ఆ చప్పుడుకి నిద్రలేచింది. ''ఈ అర్ధరాత్రి ఎవరబ్బా'' అనుకుంటా సరసరసర చెరువు దగ్గరకొచ్చి ''ఏయ్‌... ఎవరునువ్‌.... లే... లేసి వెంటనే వెళ్ళిపో ఈన్నించి'' అంది కోపంగా.చంద్రుడు ఆశ్చర్యంగా ''ఎందుకు'' అన్నాడు.
''ఈ చెరువు నాది. ఈ అడవి నాది. ఇందులో వున్న అణువణువూ నాది. ఇక్కడ ఎవరు ఏమి చేయాలన్నా నన్ను అడిగే చేయాలి'' అంది మొసలి పొగరుగా.
చందమామ చల్లగా నవ్వాడు.
''చూడు మొసలీ! అడవైనా, చెరువైనా, ఆకాశమైనా, అంతరిక్షమైనా... అవి ఎవరివీ కాదు. అందరివీ'' అన్నాడు.
''అనవసరమైన మాటలతో నన్ను రెచ్చగొట్టొద్దు. ముందు ఇక్కన్నుంచి వెంటనే వెళ్ళిపో'' అంది మొసలి తోక తొక్కిన తాచులా కోపంతో వూగిపోతూ...
చంద్రుడు అలాగే చూస్తా ''ఆకాశం మాదని పక్షులెప్పుడైనా అన్నాయా, నీళ్ళు మావని చేపలెప్పుడయినా అన్నాయా, రంగులన్నీ మావని పూవులెప్పుడైనా అన్నాయా... నువ్వెందుకే అలా గర్వంతో మిడిసిపడతా వున్నావు'' అన్నాడు.
ఆ మాటలకు మొసలి మరింత మండిపడతా ''నీకు మాటలతో చెబితే అర్థం కాదనుకుంటా... చూడు నా తడాఖా'' అంటూ సర్రున నీళ్ళలోకి దిగి చంద్రున్ని పట్టుకోబోయింది.
చంద్రుడు వేగంగా నీళ్ళలోంచి పైకి వచ్చాడు. చల్లని చంద్రుడు కాస్తా ఎర్రగా మారిపోయాడు. కోపంతో కుతకుతలాడి పోయాడు. ''ఏమో... అనుకుంటి గానీ ఎంత పొగరే నీకు. కన్నూమిన్నూ గానక లోకానికి చల్లని వెన్నెల కురిపించే నన్నే పట్టుకోవడానికి వస్తావా... ఈరోజు నుంచీ నీ బలమంతా నీళ్ళలోనే. బైటకు వచ్చినావో ఏ జంతువయినా సరే నిన్ను చంపగలదు. జాగ్రత్త. ఇదే నా శాపం'' అంటూ వెళ్ళిపోయాడు.
అంతే... ఆరోజు నుంచీ చంద్రుని శాపం వల్ల మొసళ్ళబలం నీటికే పరిమితం అయిపోయింది. నీటిలో ఏనుగునైనా చంపగల మొసలిని బైటికి వస్తే కుక్కగూడా తరిమికొడతా వుంది. దాంతో మొసలి పరిస్థితి ఇంట్లో పులి, వీధిలో పిల్లిలాగా తయారైంది.
***********

కామెంట్‌లు