సునంద భాషితం;-వురిమళ్ల సునంద, న్యూజెర్సీ, అమెరికా

 న్యాయాలు -519
జల తాడన న్యాయము
*****
జల అంటే నీరు, ఉదకము. తాడన అంటే కొట్టుట. 
నీళ్ళను కర్రతో కొట్టినా మరింకే దానితో కొట్టినా దానికి దెబ్బ తగలదు,లొట్ట పడదు,సొట్టుపోదు అని అర్థము.
 నీళ్ళను కొట్టడం అంటే మనల్ని మనం కొట్టుకోవడమే.అలాంటి జలమే లేక పోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేం.
 మరి అలాంటి నీళ్ళ గురించి ఎన్నో విషయాలు తెలిసినవే అయినా మరోసారి గుర్తు చేసుకుందాం.
 ఈ ప్రపంచంలో సమస్త జీవులకు అత్యవసరమైనవి నీళ్ళు. ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన కానుక ఈ నీళ్ళు. పంచభూతాల్లో ఒకటైన నీరు ఈ భూమ్మీద నివసించే వృక్షాలు, జంతువులు,పక్షులు మానవులు ఇలా ఒకటేమిటి జీవజాతి మనుగడకు ప్రాణాధారం.
 ఒక్క సారి జీవి పుట్టుక గురించి చరిత్ర తిరగేస్తే, పరిశోధకుల అధ్యయనాలు చదివితే మొట్టమొదట జీవి పుట్టుక నీటిలోనే జరిగిందని తెలుస్తుంది.
మరి ఈ నీరు భూమ్మీద 70శాతం పైగా వుంది. మన దేహంలో కూడా 70 శాతం నీరే ఉంటుందని మనందరికీ తెలిసిందే.ఈ నీరు మూడు రకాల రూపాల్లో ఉంది.ఒకటి ఘన రూపంలో అనగా మంచుగానూ;రెండవది వాయు రూపంలో అనగా ఆవిరి,మేఘాలుగానూ;ఇక మూడోది ద్రవ రూపంలో అనగా నదులు, సముద్రాలు చెరువులు మొదలైన రూపంలనూ వుంటుంది. ఈ నీటిలో తాగే నీరు అనగా మంచి నీరు. మరొకటి సముద్రపు నీరు అని మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది.
 మరి అలాంటి నీటిని ఏ రూపంలో ఉన్నా కొట్టలేం. ఘన రూపంలో ఉన్నప్పుడు కొట్టొచ్చు. ముక్కలు ముక్కలుగా చేయొచ్చు అయితే చేయితో  కష్టం కదా! రాయిలా ఉండి చెయ్యి చల్లగా అయిపోయి రక్తం గడ్డకట్టే ప్రమాదం వుంది.అదే  నీరు మరో రూపంలో కనుక తిరిగి కొడితే మనం వెళ్ళేది ఇక అనంత లోకాలకే.ఎలా అంటే భారీ వర్షాల సమయంలో ముంచెత్తే వరద నీరు మనుషుల్నే కాదు ఇల్లూ వాకిలిని ఎలా ముంచెత్తుతుందో ఆ సమయంలో ఎంత మంది ప్రాణాలను కోల్పోయేలా చేస్తుందో తెలుసు. ఈత రాకుండా నీళ్ళతో చెలగాటం ఆడితే ఏమవుతుందో తెలుసు,అందులోంచి ఉత్పన్నమయ్యే విద్యుత్తు ఎంత ఉపకారో అంత ప్రమాదకరమైనదని మనందరికీ  విదితమే.
 నీరు లేనిదే బతకలేని మనం నీటిని ఏం చేస్తున్నామో ప్రస్తుతం కలుషితమై పోయిన నీరే చెబుతుంది. మానవుడు అనేక కార్యకలాపాల వల్ల నీటిని కలుషితం చేస్తున్నాడు. కర్మాగారాల నుండి వచ్చే కాలుష్యాన్ని, మురుగు నీటిని తాగునీటి వనరుల్లో సముద్ర జలాల్లో కలుపుతున్నాడు.తద్వారా నీరు కాలుష్యమవుతోంది. నీటి కాలుష్యము వలన మనుషులే కాదు పశు పక్ష్యాదులు, వృక్షాలు సైతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
జీవనాధార నీటిని కలుషితం కాకుండా కాపాడు కోవాలి. నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి.
ఈ సందర్భంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు  నీటి గురించి చెప్పిన శ్లోకాన్ని చూద్దాం..."అన్నాద్భవన్తి భూతాని,పర్జన్యాదన్న సమ్భవః/యజ్ఞాద్భవతి పర్జన్యో, యజ్ఞః(ఖ్)కర్మ సముద్భవః!"
అనగా "ప్రాణులన్నియు అన్నము లేదా ఆహారము నుండి జన్మించును.అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును.విహిత కర్మలు యజ్ఞములకు మూలములు"అంటారు యజ్ఞం అంటే ఇక్కడ మనం అన్వయించుకోవలసింది వృక్ష యజ్ఞం. మొక్కలు, వృక్షాలు వుంటేనే  వర్షాలు కురుస్తున్నాయని మనకు తెలుసు.
 నీటి గురించి తేటగీతిలో నన్నయ్య రాసిన పద్యాన్ని చూద్దామా...
"సకల భూత సంఘంబు పర్జన్యు పక్షి/సమితి బహు ఫల వృక్షంబు నమరులింద్రు/ననిశమును నుపజీవించునట్లు బంధు/ జనులు నిన్నుపజీవింప మనుము పేర్మి"
అనగా ప్రాణులకు నీరు కావాలి.నీరే ప్రాణాధారం అందుకే మేఘున్ని ఆశ్రయిస్తారు.పక్షులు ఆహారం కోసం పండ్లున్న వృక్షాలను ఆశ్రయిస్తాయి.దేవతలు ఇంద్రుని ఆశ్రయించి సురక్షితులుగా ఉండాలని కోరుకుంటారు.రాజు కూడా ప్రజలను రక్షించడానికి నీరులా ప్రాణాధారం కావాలి అని అర్థము.
ఇక్కడ రాజు అంటే  ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వమే నీటి సంరక్షణా బాధ్యత చేపట్టాలి.మన బాధ్యతగా మనం నీటిని నిర్వర్తించాలి.
 మరి ఈ "జల తాడన న్యాయము" కేవలం నీటి గురించే చెప్పబడిందా? ఇందులో వున్నది ఏమిటని  ఆలోచిస్తే "వ్యక్తుల్లో కొందరు నీటిలా వుంటారు.అందరికీ ఉపయోగపడతారు. ప్రాణాధారం అవుతారు.అలాంటి వారిని చులకనగా చూడటమో, ఇబ్బంది పెట్టాలనో, దెబ్బ కొట్టాలనో ప్రయత్నిస్తే...ప్రయత్నించిన వారే తీవ్రంగా నష్టపోతారు అనే అంతరార్థం ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థమని మనకు అవగతం అవుతుంది.
 మంచి నీటి వంటి వారి సేవలు మనమూ వినియోగించుకుని వారిని ఆదర్శంగా తీసుకుందాం. మనమూ జలంలా ఉపయోగపడదాం.

కామెంట్‌లు