సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు-527
జామాతృ శుద్ధి న్యాయము
   *****
జామాతృ అనగా అల్లుడు, స్వామి,ప్రొద్దు తిరుగుడు చెట్టు. శుద్ధి అనగా పరిశుద్ధము చేయుట, నిర్ధిష్టత, కాంతి అనే అర్థాలు ఉన్నాయి.
అల్లుడు చేసిన పుస్తక పరిష్కారము విధముగా...
ఈ న్యాయమునకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సరదా కథను చూద్దామా...
పూర్వం ఒకానొక రాజు తన కుమార్తెకు తగిన వరుణ్ణి  వెతికి తెమ్మని తనకు బాగా తెలిసిన వ్యక్తితో చెబుతాడు. అయితే ఆ వ్యక్తికి రాజకూమార్తె అంటే  అస్సలు పడదు. ఆమెపై పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చింది అనుకుని ఓ బఱ్ఱెలను మేపుకొని బతికే మూర్ఖుని తీసుకుని వచ్చి రాకుమారికి ఇతడు తగిన వరుడు, మీకు తగిన అల్లుడు అని రాజు గారికి చెబుతాడు.
అయితే అనుమానం వచ్చిన రాకుమార్తె ఆ బఱ్ఱెల కాసేవాని తెలివితేటలను పరీక్షించేందుకు సభను ఏర్పాటు చేయిస్తుంది. ఆ సభలోని పండితులు కొందరు తమచే కొత్తగా రచింపబడిన పుస్తకం అతడి చేతికిచ్చి అందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దమని చెబుతారు.అంతకు ముందే ఆ వ్యక్తి చెప్పి వున్నాడు కనుక నోరు మెదపకుండా ఊరికే పుస్తకమును తిరగేస్తూ ఇంకా తోచక తన బొడ్డులో దోపుకున్న గోళ్ళు తీసుకునే కత్తితో  అక్షరాలనూ,గీతలనూ,తలకట్లనూ గీకడం మొదలు పెడతాడు.దానిని చూసిన రాజ కుమార్తెకు అతడు ఓ చదువురాని మూర్ఖుడు అని,అతని యొక్క చేష్టలే మూర్ఖత్వాన్ని తెలియజేస్తున్నాయని గ్రహిస్తుంది.అంటే ఆ కాపరి చేష్టల ద్వారా తన తండ్రి చెప్పిన వ్యక్తి చేసిన మోసం బయటపడింది.
అల్లుడుగా వచ్చిన వాడు  ఇంత విద్యాహీనుడు, మూర్ఖుడా! అని రాజు గారు నివ్వెర పోతాడు."జామాతా దశమ గ్రహః" అంటారు కానీ ఇదేమిటి? ఎంతో నమ్మకంతో  బాధ్యత అప్పగిస్తే ఇలాంటి వాడిని పట్టుకొచ్చాడు? అని విషయం తెలిసిన రాజు  ఆ తెచ్చిన వ్యక్తి మీద ఆగ్రహిస్తాడు. ఆ తర్వాత రాజు తలుచుకుంటే ఏమౌతుందో మనందరికీ తెలిసిందే.
 ఎలాగూ జామాతా/ అల్లుడి విషయం వచ్చింది కాబట్టి "జామాతా దశమ గ్రహః" అని ఎందుకు అంటారో చూద్దాం.
 గ్రహాలు తొమ్మిదేనని అవి సూర్యుని చుట్టూ తిరుగుతూ వుంటాయని, వాటన్నింటినీ కలిపి సూర్య కుటుంబం లేదా సౌర కుటుంబం అంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే  గ్రహాల గురించి మన వాళ్ళలో  కొందరికి కొన్ని నమ్మకాలు ఉన్నాయి.ఇక ఆ గ్రహాలు,వాటి సంచారం చేత ఆయా సమయాలలో మనుషుల్ని పీడిస్తూ ఉంటాయని,వాటి పట్ల నమ్మకం ఉన్న వారు గ్రహశాంతులు చేయించుకోవడం  కూడా మన చుట్టూ ఉన్న వారిలో కొంతమందిని చూస్తుంటాం.
మరి పదో/ దశమ గ్రహంగా అల్లుడిని ఎందుకు అంటారంటే ఇతడి పీడన ఆ తొమ్మిది గ్రహాల పీడన కంటే మరీ ఎక్కువగా ఉంటుందన్న మాట.కట్నం చాలలేదనో,మరింకేదో కావాలనో... ఇలా రకరకాల కారణాల చేత పిల్లనిచ్చిన మామ గారికి కంటికి కునుకు లేకుండా చేస్తాడు. ఏమైనా గట్టిగా అందామా దాని ప్రభావం ఎక్కడ కూతురు మీద పడుతుందేమోనని భయం. ఇతరులతో గట్టిగా వాదించ గల దిట్ట అయినా,పులి లాంటి వాడైనా అల్లుడు విషయానికి వచ్చేసరికి పిల్లికూన అయిపోతాడు. గ్రహాల పీడ శాంతి చేయించుకుంటే పోతుంది కానీ ఈ దశమగ్రహపు పీడ జీవితాంతం వీడదు అందుకే "జామాతా దశమ గ్రహః" అంటారు.
 అయ్యో! అల్లుళ్ళు అందరూ అలా వుండరు లెండి. ఎవరైతే అలా ప్రవర్తిస్తారో  అలాంటి వారిని ఉద్దేశించి చెప్పినది మాత్రమే సుమా.
 ఇక అసలు విషయానికి వద్దాం. రాకుమారి తెలివి తేటలు, యోచన వల్ల ఆ బఱ్ఱెల కాసేవాని మూర్ఖత్వం బయట పడింది. ఎంత వ్యక్తిగత పగ ఉన్నా అలా  ఆ వ్యక్తి ఓ అమ్మాయి నిండు నూరేళ్ళ భవిష్యత్తును అలా చేయడం తగదు కదా!
అలా కొంత మందిని ఎంతగానో నమ్ముతాం. అలాంటి వారిలో కొందరు ఇలా మోసం చేసే వాళ్ళు ఉంటారు.అందుకే పెద్దలు తరచూ ఓ మాట అంటుంటారు "మంటికైనా ఇంటి వాడే పోవాలనీ" అంటే ఇల్లు కట్టించడానికో , మరే అవసరానికో తెప్పించుకునేది మట్టే అయినా ఇతరులను నమ్మి చెబితే సరిగా తేకపోవచ్చు.
అలాంటిది జీవిత కాలపు నిర్ణయం అది. కాబట్టి ఎవరి మీద ఎంత నమ్మకం ఉన్నా  తుది నిర్ణయం తీసుకునే సమయంలో పూర్వాపరాలు బాగా తెలుసుకోవాలనేది ఈ "జామాతృ శుద్ధి న్యాయము"ద్వారా మనం గ్రహించగలిగాం.

కామెంట్‌లు