హరియాణా స్కూళ్లలో తెలుగు పదాలు నేర్చుకుంటున్న విద్యార్థులు: హరియాణా రాష్ట్రంలోని రోహ్‌తక్ జిల్లా సాంప్లా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రతి రోజూ తెలుగు వర్ణమాల చదవడంతో తరగతులు ప్రారంభమవుతాయి. హరియాణాలోని స్కూళ్లలో తెలుగు చదవడం ఏంటని ఆశ్చర్యంగా అనిపిస్తోందా? నిజమే. ఇప్పుడు ఈ రాష్ట్రంలోని వందల పాఠశాలల్లో తెలుగు భాషను బోధిస్తున్నారు.ఒకటి, రెండు, మూడు, నాలుగు, అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య... ఇలా అనేక పదాలను ఇస్మాలియా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చక్కగా చెబుతున్నారు.హరియాణాలోని ప్రతి జిల్లాలో 10 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం తెలుగు బోధిస్తున్నారు."తెలుగు భాష, తెలంగాణ సంస్కృతి, అక్కడి ప్రముఖ ప్రదేశాల గురించి దేశంలో అందరికీ అవగాహన కల్పించేందుకు హరియాణా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది" అని రోహ్‌తక్ జిల్లా విద్యాశాఖ ప్రాజెక్ట్ సమన్వయకర్త జితేందర్ సంగ్వాన్ చెప్పారు."తెలుగు బోధన కార్యక్రమం జనవరిలో ప్రారంభమైంది. జూన్ ఆఖరి వరకూ కొనసాగుతుంది. ఆ తరువాత కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర సందర్శనకు పంపిస్తాం" అని సంగ్వాన్ తెలిపారు.'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో భాగంగా తమ విద్యార్థులు తెలుగులో ప్రాథమిక వాక్యాలను నేర్చుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం గురించి, ఆ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకుంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సందీప్ నైన్ బీబీసీకి వివరించారు.ఈ పాఠశాలలో విద్యార్థులకు తెలుగు నేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు గీతా కౌశిక్‌కు అప్పగించారు."రోజూ ఉదయాన్నే ప్రార్థన సమయంలో, మోనా అగర్వాల్‌కు ప్రిన్సిపల్ సందీప్ నైన్ ఫోన్ చేస్తారు. ఆమె తెలుగు పదాలు చెబుతుంటే ఫోన్‌ను మైకు దగ్గర ఉంచి అందరికీ వినిపిస్తారు. మైదానంలో కూర్చుని విద్యార్థులు ఆమె మాటలు వింటారు. ఆ పదాలను ఎలా పలకాలో నేర్చుకుని రిహార్సల్ చేస్తారు" అని గీత వివరించారు.తెలుగు నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని 9వ తరగతి విద్యార్థి, ప్రతిరోజూ తెలుగు భాష క్లాసుకు హాజరయ్యే దినేష్ కుమార్ అంటున్నాడు."నేను ఇంటికి వెళ్లిన తర్వాత మా అమ్మానాన్నలతోనూ తెలుగు భాష గురించి చెబుతుంటాను. అయితే, వారికి ఆ భాష అర్థం కాదు. కానీ, నేను కొత్త భాష నేర్చుకుంటున్నందుకు వారు సంతోషంగా ఉన్నారు" అని ఆ బాలుడు చెప్పాడు.జూన్ చివరిలో తెలుగు బోధన కార్యక్రమం ముగుస్తుంది. అప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్ష పెడతారు. అందులో పాసైన వారికి తెలంగాణ రాష్ట్ర సందర్శనకు వెళ్లే అవకాశం కల్పిస్తామని ఉపాధ్యాయులు చెప్పారు. దాంతో, విద్యార్థులంతా ఉత్సాహంగా తెలుగు నేర్చుకుంటున్నారు.1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఎంపిక చేసిన పాఠశాలల్లో తెలుగు భాష నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.(బి.బి. సి. సౌజన్యంతో)


కామెంట్‌లు