తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి

తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగ బోడు
విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి
దాన ధర్మము లేక దాచి దాచి


తుదకు దొంగలకిత్తురో దొరలకవునో
తేనె జుంటీయదా తెరువరులకు
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర!!


నరసిమ్హ శతకం (1)


పుడుతూనే ఎవ్వరూ ధనం తీసుకురారు. అలాగే శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు, అప్పటివరకు మనం అనుభవించిన భోగ భాగ్యాలు- పదవులు ఏవీ వెంట వెళ్ళవు.
ఎంత డబ్బు సంపాదించినా మనిషి అన్న పానాలే భుజిస్తాడు కానీ- తను సంపాదించిన వెండి బంగారాలని ఆహారంగా తినడు.


ఇంత సంపాదించాను-అంత సంపాదించాను అన్న అతిశయమే కానీ, సంపాదించినదంతా ఎప్పుడూ అనుభవించలేరు. జీవితకాలమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము దాన-ధర్మాల ప్రసక్తి లేకుండా, ఇతరులకి తెలియకుండా అక్కడ దాచి, ఇక్కడ దాచి చివరికి దొంగలకి
అప్పచెబుతారు. అది ఎలా ఉంటుందంటే తేనెటీగ పువ్వు-పువ్వు దగ్గరకెళ్ళి ఎంతో కష్టపడి తేనె సంపాదిస్తుంది. ఆ తేనెని తానెప్పుడూ అనుభవించదు. తెలివైన మనిషి ఆ తుట్టెని కాల్చి ఈగలని చంపి అందులో తేనెటీగ దాచిన కష్టాన్ని తాను అనుభవించినట్టే, మనిషి జీవితకాల సంపాదనని ఎవరో వచ్చి దోచుకెళతారు అని కవి భావన.


ఆ భావాన్ని ఇంకా విపులంగా తెలియచేసే కధ ఇప్పుడు తెలుసుకుందామా!


*********


పరమేశ్వర రావు గారికి మామిడి పళ్ళంటే మహా ప్రీతి.
మామిడి పండ్ల మీద ఎవరికుండదు కనక కోరిక, చెప్పండి!


నూజివీడు నించి ఎవరో వస్తున్నారని రెండు బుట్టలు తెప్పించారు.
'మీ ఒళ్ళేమో ఓ షుగర్ ఫాక్టరీ! రీడింగ్స్ చూస్తే అన్నం తిన్నాక 400, తినకముందు 180.... అదేదో యావరేజ్ (Hba1c) 11-12 'అని భార్య కనకం ఒకటే మొత్తుకోవటం!


అబ్బే మన చుట్టు పక్కల నలుగురికీ ఇద్దామని తెప్పించాను కానీ, అన్నీ నేనే తింటానా ఏమిటి? అని ఓ అమాయకపు చూపు!


అంటుందే కానీ, పాపం భర్త జిహ్వ చాపల్యానికి - అతనికున్న ఆరోగ్య సమస్యలకి మధ్య ఉన్న అసమతుల్యానికి బాధపడుతూ ఉంటుంది.


పెళ్ళయిన కొత్తలో అన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నట్లే బరువు బాధ్యతలు.... తినగలిగే ఆరోగ్యం ఉన్నా .......కోరుకున్నవన్నీ కొనుక్కుని తినలేని ఆర్ధిక క్రమశిక్షణ.... ఇవన్నీ చూస్తూ కనకం, భర్తతో 'పోనీ లెండి.... కోరుకున్నవన్నీ తినలేకపోయినా.... నోటికి నాలుగు వేళ్ళూ వెళుతున్నాయి


".........................................
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగబోడు '


అన్ని పెద్దలన్నట్లు, ఈ జానెడు పొట్టకి ఎంత తింటే సరిపోదు?
మరు పూటకి మళ్ళీ వెతుక్కోవలసిందే కదా!
ఒక్క రవ్వ చేతులు కట్టేసుకోవలసి వచ్చినా, మీ తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వర్తించి....వారిని తృప్తిపరిచారు.!
అనుభవించలేని దాని గురించి అసంతృప్తి పడే కంటే గొప్ప స్థితిపరుడైనా తినేది ఆ అన్నమే కదా అని ఆలోచిస్తే సరిపోతుంది 'అని సర్దిచెప్పేది.


*******


పరమేశ్వర రావు స్నేహితుడు హరికృష్ణ తన తండ్రికి ఒక్కడే కొడుకు.
బోలెడు ఆస్తి....ఏభై ఎకరాల పొలం! పైగా తండ్రి వడ్డీ వ్యాపారం మీద బాగా సంపాదిస్తున్నాడు.
ఇంకా ఇంకా ఆస్తులు పోగేస్తున్నాడే కానీ....తను తినడు , ఇంట్లో వారిని సుఖపడనివ్వడు.
ఎంగిలి చేత్తో కాకిని తోలడు. ఇక దాన ధర్మాల ప్రసక్తెక్కడ!


హరికృష్ణ కూడా చిన్న చితకా వ్యాపారాలు చేసి కాస్తో కూస్తో సంపాదిస్తున్నాడు.
కానీ భార్య .....తమ పెళ్ళి రోజనో, పుట్టిన రోజనో పేరు చెప్పి ఒక నగ కొంటే ఇక ఇంట్లో యుద్ధమే!


'డబ్బంతా తగలేస్తున్నావనీ, మానాన్న చచ్చీ చెడి వడ్డీ వ్యాపారం చేసి సంపాదిస్తుంటే నువ్విలా ఒళ్ళూ పోయి తెలియకుండా ఖర్చు చేస్తావా 'అని చిందులేస్తాడు.
'ఓ నగ కొనుక్కోవటానికి లేదు! ఓ పట్టు చీర కొనుక్కోవటానికి లేదు' అని భార్య సింధు చిరాకు పడేది.


'డబ్బు సంపాదించేది....మనం అనుభవించటానికేనండి. కొంత మనం అనుభవించాలి, కొంత దానం చెయ్యాలి, మరి కొంత రేపన్న రోజుకి దాచుకోవాలి.పోతూ పోతూ మూటకట్టుకుపోము.' అని మా అమ్మ చెప్పేది.
'మనిషన్నాక జాగ్రత్త ఉండచ్చు, తప్పులేదు. కానీ పిసినారితనం పనికి రాదు.
ఏ అనుభవమూ లేని దానికి ఈ సంపాదనలెందుకు?' అని రోజు వారిద్దరి మధ్య వాగ్యుద్ధమే!


'మీ పెదనాన్న గారు చూడండి..... ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా వేంటనే తన ఇంటి నించి ధాన్యం, డబ్బు పంపి వెంటనే వారికి తనున్నాననే భరోసా ఇచ్చేవారు.'


'మొన్న తుఫాను వస్తే పది రోజుల పాటు ఊరందరికీ భోజనాలు తనింటి నించే పంపించి ఆదుకున్నారు.'
డబ్బుకి విలువ అలాంటి పనుల వల్లే పెరుగుతుంది.


ఆయన కాలం చేసినప్పుడు, ఊరు ఊరంతా ఒక్కటై వచ్చి ఆ పది రోజులు ఆయన ఇంట్లోవారికి ఎంతో పని సహాయం చేశారు! మీ అన్నయ్య ఎక్కడో దూరంగా అమెరికాలో ఉంటే, మీ పెద్దమ్మకి ఇప్పటికీ ఎంతో అండ దండలుగా ఉంటున్నారు!


""తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
............................
............................
విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి
దాన ధర్మము లేక దాచి దాచి


తుదకు దొంగలకిత్తురో దొరలకవునో
తేనె జుంటీయదా తెరువరులకు
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర!!


'అని శతక కారుడు చెప్పినట్లు, మీరు బ్రతికున్నంతకాలం కూడ బెట్టిన సొమ్ము మీ తరువాత ఏమవుతుందో మీకు తెలుసా?'


'తేనెటీగ తన జీవితమంతా పోగేసిన తేనె, ఆ తుట్టెని కాల్చి ఈగలని చంపటం ద్వారా మనం అనుభవిస్తున్నట్లే, మీ తదనంతరం మీ ఆస్తి-డబ్బు ఇంకెవరో వచ్చి అప్పనంగా అనుభవిస్తారు.'


"తన్ను మాలిన ధర్మం చెయ్యమని" ఎవ్వరూ చెప్పరు.


'మీరు సంపాదించిన దానిలో కొంత లేనివారికి దానం చేస్తే, వారి జీవితాంతం మీ పేరు చెప్పుకుంటారు. మీకు పుణ్యం.' అని సింధు చెప్పగా చెప్పగా కొంతకాలానికి హరికృష్ణ ఆ ఊళ్ళో ఒక తుఫాను పునరావాస కేంద్రం, ఒక అనాధ శరణాలయం కట్టించే ఏర్పాట్లు చెయ్యటానికి సిద్ధపడ్డాడు.



కామెంట్‌లు