నేనూ చదివాను!! ------------------------- ఇటీవల ఓ పత్రికలో పోటీపరీక్షలకు సంబంధించి ఇచ్చిన ప్రశ్నాపత్రంలో భారతీయ తర్కశాస్త్ర పితామహుడు ఎవరు అనేదానికి దిజ్ఞాగుడు అనే సమాధానం చదివాను. అప్పుడు దిజ్ఞాగుడు గురించి చదువుదామని అంతర్జాలంలో వెతుకుతుండగా బులుసు అప్పన్న శాస్త్రి గారి గురించి కొన్ని విషయాలు తెలిశాయి. ఆయన 1893 సెప్టెంబరు 23వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని భాట్నవిల్లి గ్రామంలో జన్మించారని, విశ్వనాథ సోమయాజులు వద్ద తర్కశాస్త్రం, చామర్తి విశ్వనాథశాస్త్రి వద్ద నిరుక్తం, దెందుకూరి నరసింహశాస్త్రులు వద్ద వేదాంతశాస్త్రాన్ని అభ్యసించారని తెలిసింది. 1916 నుండి తర్క వేదాంత శాస్త్రాలకు ఆయన ఆచార్యపీఠంగా ఉండి వందలాది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. 1931 నుండి 1947 వరకు గద్వాల, ఆత్మకూరు సంస్థానాల పండిత పరిషత్తులో ఆయన ధర్మాధికారిగా ఉన్నారు. 1935 నుండి 1942 వరకు సనాతన మత ప్రచారిణి అను మాసపత్రికను నిర్వహించిన అప్పన్న శాస్త్రి గారి గురించి ఒకటి రెండు ముక్కలు తెలుసుకోగలిగాను కానీ దిజ్ఞాగుడు గురించి భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడు అనేది తప్ప మరేదీ తెలీలేదు. దాంతో ఆ విషయాన్ని పక్కన పెట్టి నా తర్కశాస్త్ర చదువు సంధ్యల గురించి ఒక్క విషయం జ్ఞాపకమొచ్చింది. స్కూల్ ఫైనల్ వరకూ తెలుగు మాధ్యమంలో చదివిన నేను వివేకానంద కాలేజీ (మైలాపూర్, మద్రాసు) లో 1971 - 72లో పీయుసి చదివాను. అప్పట్లో స్కూల్ ఫైనల్ తర్వాత పీయుసి చదివిన తర్వాతే డిగ్రీలోకి ప్రవేశించాలి. నేనట్లా పీయుసిలో చేరాను. ఎస్ ఎస్ ఎల్ సీ వరకూ ఒక్క ఇంగ్లీష్ తప్ప మిగిలిన పాఠ్యాంశాలన్నీ తెలుగులో చదివిన నేను పీయుసిలో ఇంగ్లీష్ మీడియంలో చేరాను. బొత్తిగా ఇంగ్లీష్ రాదు అని చెప్పుకోవడం "అతి" అవుతుంది. నాకు ఇంగ్లీష్ వర్ణమాలలోని ఇరవై ఆరు అక్షరాలు చదవడం, రాయడంతో పాటు తప్పో ఒప్పో ఇంగ్లీష్ మాటలు చదవడం వచ్చు. ఇంగ్లీష్ వ్యాకరణమైతే పూజ్యం.. దాంతో కాలేజీలో ఇంగ్లీషుతో తంటాలే. ఎప్పుడు క్లాసులైపోయి ఇంటికొచ్చెస్తానా అనే ఆలోచన తప్ప మరొకటుండేది కాదు. ఈ వైఖరి వల్ల నా కాలేజీ చదువు ఓ అవస్థగానే సాగింది. అయినా ఎలాగోలా పీయుసి, డిగ్రీ ప్యాసయ్యాను. పీయుసిలో నేను తెలుగు, ఇంగ్లీష్ తో పాటు కామర్స్, హిస్టరీ, లాజిక్ (తర్కశాస్త్రం) చదివాను. తర్కశాస్త్రానికి లెక్చరర్ పి. బాలసుబ్రమణ్యన్ అనే గుర్తు వచ్చేవారు. అరటి పండు వొలిచి నోట్లో పెట్టినంత చక్కగా పాఠాలు చెప్పినా నా మట్టిబుర్రకెక్కేది కాదు. కారణం, ఇంగ్లీషుని ఓ భూతంలా ఓ రాక్షసిలా ఊహించేసుకుని భయపడుతుండేవాడిని. దాంతో ఎవరెంత తేలిక మాటలతో చెప్పినా అర్థమయ్యేదికాదు. కానీ ఎట్టాగో లాజిక్కుతో పాటు మిగిలిన సబ్జెక్టులూ ప్యాసయ్యాను. లాజిక్ లో నాకు ముప్పై ఆరు మార్కులు వచ్చాయి. (ప్యాసవడానికి కావలసింది 35. అంటే నేను ఓ మార్కు ఎక్కువే తెచ్చుకున్నానుగా). ఈ మార్కులు చూసి మా పెద్దన్నయ్య శ్యామల్రావు చెప్పిన మాట ఎప్పటికీ మరచిపోను. ఎందుకంటే అన్నయ్య ఇచ్చిన డబ్బులతో నాలుగు రకాల లాజిక్ పుస్తకాలు కొనుక్కున్నాను. వాటిలో ఒకటి text book అయితే మిగిలిన మూడూ " గైడ్లు ". ఈ నాలుగు లాజిక్ పుస్తకాలు చదివి ఒక్కో పుస్తకానికి సగటున తొమ్మిది మార్కుల చొప్పున మొత్తం ముప్పై ఆరు మార్కులు తెచ్చుకున్నావు. మరో ఆరు పుస్తకాలు కొనిచ్చుంటే తొంభై మార్కులు వచ్చావేమో అని. అప్పుడు మూతి ముడుచుకున్నా తర్వాత స్థిమితంగా ఆలోచిస్తే నవ్వొచ్చింది. అన్నయ్య చెప్పిందీ ఓ లాజిక్కేగా. నాలుగు కాకుండా మొత్తం పది పుస్తకాలు చదివుంటే మొత్తం తొంబై మార్కులు తెచ్చుకునే వాడినేమో. అయినా ఇప్పుడు తర్కశాస్త్రానికి సంబంధించి ఒక్క ముక్కా గుర్తు లేదు. పిల్లల మాసపత్రికల్లో గురువుగారూ - శిష్యులూ అంటూ చదివిన తర్కశాస్త్ర కథలు చదవడం తప్ప మరొక్క ముక్క గుర్తుంటే ఒట్టు. అందుకే అన్నా ఈ జ్ఞాపక రచన శీర్షికలో " నేనూ చదివాను..." తర్కశాస్త్రాన్నీ అని. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు