కృష్ణశాస్త్రిగారితో అనుబంధం ________________________ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు (1897 నవంబర్ 1 – 1980 ఫిబ్రవరి 24) - నాన్నగారు మధ్య ఓ ఆరు పదుల అనుబంధం ఉండేది. మా నాన్నగారు వారింటికి వెళ్ళడం, ఆయన మా ఇంటికి రావడం నాకు జ్ఞాపకమే. నేనూ కొన్నిసార్లు నాన్నగారితోపాటు దేవులపల్లి గారింటికి (జగదాంబాల్ స్ట్రీట్, టీ నగర్) వెళ్ళిన సందర్భాలున్నాయి. నాన్నగారి పద్దెనిమిదో ఏట నాటి ముచ్చటిది. విజయనగరం మహారాజా కళాశాలలో ఇంటర్ కాలేజీ విద్యార్థుల వ్యాసరచన పోటీలు. అప్పుడు దేవులపల్లివారు, తల్లావజ్జల శివశంకరశాస్త్రి గారు 'తన్ను మాలిన ధర్మం తగునా?" అనే విషయాన్నిచ్చి రాయమన్నారు. ఆ పోటీలో పాల్గొన్న నాన్నగారు "విషయం ప్రశ్నార్థకంగా ఉంది" అని తన వాదనను వారి ముందుంచారు. దేవులపల్లివారు నాన్నగారి సమాచారం అడిగి తెలుసుకుని "చెళ్ళపిళ్ళవారి శిష్యుడు కనుక అంత ధైర్యంగా అడిగాడు" అని నచ్చచెప్పారట. అలనాటి పోటీలో నాన్నగారికి ప్రథమ బహుమతి వచ్చింది. సాయంకాలం జరిగిన సభలో దేవులపల్లివారు చదిని పద్యాలలోని పదబంధ సౌందర్యానికి నాన్నగారు ముగ్ధులయ్యారట. 1933 లో నాన్నగారికి ఆయనతో ఏర్పడిన తొలి పరిచయం అదే. నాన్నగారు తాను పని చేసిన శారదా విద్యాలయంలో ఓరోజు దేవులపల్లివారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. అప్పుడాయన "స్త్రీ - ప్రకృతి - పురుషుడు" అనే అంశంమీద ప్రసంగించారు. సౌందర్య లహరి ఆధారంగా దేవులపల్లివారు మాట్లాడారట. ఓమారు అవీ ఇవీ మాట్లాడుతూ "మీ కంఠానికి చికిత్స ఏమిటిన?" అని నాన్నగారు అడగ్గా దేవులపల్లివారు ఓ పద్యం రాసిచ్చారట. ఆ పద్యం ఇదే.... "ఇంచుమించుగ ఏబది యేండ్ల పాటు / కూసియున్నను సభలలో కోకిలవలె / అలసిపోయితినిక కూయనంచు తాను / మూగవోయెను వయసుతో నా గళంబు /" ఈ పద్యం గురించి మా నాన్నగారొక చోట రాస్తూ పద్యమంతా ఒక ఎత్తయితే "అలసిపోయితిని" అనే క్రియాపదం ఒక ఎత్తు అని పేర్కొన్నారు. కృష్ణశాస్త్రిగారి రచనాతీరు సంప్రదాయ కవనానికి నన్నయ్య, గేయకవితకు రెండో జయదేవుడు అని మా నాన్నగారి అభిప్రాయం. దేవులపల్లివారి రచనలు తెలుగు భావకవితా రంగంలో ప్రముఖ అధ్యాయాన్ని సంతరించుకున్నాయి. అనేక లలితగీతాలు, నాటికలు, సినిమా పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. రవీంద్రనాథ్ టాగూరుని కలిసిన తర్వాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1918లో విజయనగరంలో డిగ్రీ పూర్తి చేసిన దేవులపల్లివారు పెద్దాపురం మిషన్ హైస్కూలులో కొంతకాలం ఉపాధ్యాయులుగా పని చేశారు. వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళ్తుండగా ప్రకృతి నుంచి లభించిన ప్రేరణతో ఆయన "కృష్ణపక్షం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యను కోల్పోయిన తర్వాత ఆయన రచనలలో విషాదంపాలు ఎక్కువైందని అంటుంటారు. ఓవైపు సంఘసంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు "ఊర్వశి" అనే కావ్యం రాశారు. బి. నాగిరెడ్డి ప్రోత్సాహంతో (మల్లీశ్వరి) చిత్రరంగంలో అడుగుపెట్టిన ఆయన ఆణిముత్యాల్లాంటి పాటలు రాశారు. గొప్ప వక్తగా, రచయితగా, భావకవితా ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. అయినా ఆయన రచనా పరంపర కొనసాగింది. అనేక సన్మానాలు, ప్రశంసలు పొందిన దేవులపల్లివారు ఓమారు మా నాన్నగారికి పుస్తకాలను సంతకం చేసివ్వడం, ఓ పుస్తకంలో ఆయన పండుకోతి అనో ముసలికోతి అనో (గుర్తు రావడం లేదు) రాసుకోవడం, టీ.నగర్లోని వాణీమహల్లో జెవీ రమణమూర్తిగారు గిరీశం పాత్రలో ప్రదర్శించిన కన్యాశుల్కం నాటకాన్ని దేవులపల్లివారు ముందువరసలో కూర్చుని తిలకించడం నాకిప్పటికీ గుర్తే. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆయన కవితా ఖండిక "ఆకులో ఆకునై..." అనేది మాకొక పాఠ్యాంశంగా ఉండేది. ఇటీవల వార్త దినపత్రికలో కామిక్స్ పై ఓ వ్యాసం రాసినప్పుడు అది చూసి వారి అబ్బాయి బుజ్జాయిగారు నాతో ఫోన్ చేసి మాట్లాడి కొన్ని పుస్తకాలు పంపడం మరచిపోలేనిది. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు