నా దస్తూరీ ---------- నాకు అక్షరాభ్యాసం ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలీదు. కానీ అ, ఆ లు నేర్పించింది, రాయించింది అమ్మ! ఒకటో క్లాసులో చేరేలోపే అక్షరాలు రాయించడమే కాకుండా చిన్న చిన్న మాటలూ చెప్పించిందీ అమ్మే! అమ్మ పలక మీద అ, ఆలు రాసిచ్చి వాటి మీద దిద్దమనేది. కానీ నేను ఆ పని చేయకుండా అవి చూసి వాటి కింద రాసే వాడిని. అది అమ్మకు కోపం తెప్పించేది. తను రాసిన అక్షరాలపై దిద్దమనేది. అప్పుడు నాన్నగారు కల్పించుకుని "వాడు అక్షరాలు రాసి చూపిస్తున్నాడుగా. నువ్వు రాసిన అక్షరాలమీద రాయకుంటేనేం. అసలు రాయనంటేగా కష్టం. ఏదో ఒకటి రాస్తున్నాడుగా" అని సర్ది చెప్పేవారట. ఈ విషయం అమ్మే చెప్పేది. ఇక ఏడో క్లాసో ఎనిమిదో క్లాసో గుర్తుకు రావడం లేదు కానీ మీనాక్షిసుందరం అనే ఓ తమిళ టీచర్ ఇంగ్లీష్ కాపీ రైటింగ్ క్లాసు కొచ్చేవారు. ఫోర్ రూల్డ్ నోట్ బుక్కులో ఇంగ్లీష్ కాపీ రైటింగ్ రాయాల్సి వచ్చేది. అక్షరాలు సరిగ్గా రాయలేక ఆయనతో వేళ్ళ మీద దెబ్బలు తినేవాడిని. దాంతో ఇంగ్లీష్ కాపీ రైటింగ్ క్లాసన్నానూ మీనాక్షి సుందరంగారన్నానూ చచ్చేంత హడల్. నిజానికి నా దస్తూరీ మరీ అంత దారుణంగా ఉండేది కాదు. పరీక్షలలో కుదురుగా స్పష్టంగా రాస్తే హ్యాండ్ రైటింగ్ కి కొన్ని మార్కులు ఇస్తారనే ఆశతో అర్థమయ్యేటట్లే రాసేవాడిని. కానీ మీరెవరైనా పని చేస్తున్న రోజుల్లో కాపీ రైటింగ్ రాసారో లేదో తెలీదు కానీ నేను ఓ మ్యాగజైన్ ఆఫీసులో కాపీ రైటింగ్ రాయాల్సి వచ్చింది. కోడంబాక్కం రైల్వే స్టేషన్ సమీపంలోని పద్మనాభ పిళ్ళయ్ అనే వీధిలో బాలానందం అనే పిల్లల మాసపత్రిక ఉండేది. ఒకప్పుడు చందమామలో అకౌంట్స్ చూసిన రంగారావుగారిదే ఈ బాలానందం. బాలానందం సంచిక తయారవగానే ఏజెంట్లకు పోస్ట్ కార్డులు రాయడం నాకప్పగించిన పని. కనీసం రెండు వందలు పోస్టు కార్డులు రాయవలసి వచ్చేది. మొదట ఓ పది పదిహేను కార్డుల వరకూ చేతిరాత బాగానే ఉండేది. పోను పోను దస్తూరీ బాగుండేది కాదు. అక్షరాలు వంకర టింకరగా ఉండేవి. దాంతో రంగారావుగారికి కోపం వచ్చి తెలుగు కాపీ రైటింగ్ బుక్ తెప్పించి రాయమన్నారు. ఎంతైనా యజమాని చెప్పిన మాటగా. కాపీ రైటింగ్ మొదలు పెట్టి రెండు పేజీలు రాసానో లేదో ఎడిటర్ వడ్డాది బుచ్చికూర్మనాధం గారు జోక్యం చేసుకుని ఆ పనిష్మెంట్ నుంచి తప్పించారు. ఓ పావు గంట ఆలస్యమైనా పరవాలేదు ఏజెంట్లకు రాసే పోస్ట్ కార్డులు బాగానే రాయమని సలహా ఇచ్చారు. కాలక్రమేణా కంప్యూటర్ల ప్రవేశంతో టైపింగ్ అలవర్చుకోవడంతో చేతిరాత దెబ్బతింది. అప్పటికీ రోజూ రెండు మూడు పేజీలు రాస్తూనే ఉన్నప్పటికీ దస్తూరీ పోయింది. అయినా ఇప్పుడు ఎవరికోసం రాయాలి నేను. అంతా టైపింగేగా.....- యామిజాల జగదీశ్


కామెంట్‌లు