నక్క తెలివి --------------- అదొక పెద్జ కీకారణ్యం. అందులో అనేక జంతువులు ఉన్నాయి. ఆకలితో ఉన్న ఓ సింహం వేటకు బయలుదేరింది.కానీ ఆ రోజు సింహానికి ఒక్క జంతువూ కంటపడలేదు. అలసిన సింహం నీరసంగా వస్తుంటే ఓ మూల ఓ గుహ కనిపించింది. ఆ గుహలోకి ప్రవేశించిన సింహం అక్కడే దాక్కుని బయటకు వెళ్ళిన జంతువేదైనా ఇక్కడికొస్తే చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది. చడిచప్పుడు చేయకుండా సింహం గుహలోపల కూర్చుంది. ఆ గుహలో నివాసముంటున్న ఓ నక్క ఉదయం బయటకు వెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చింది. అయితే గుహ ప్రవేప ద్వారం దగ్గర సింహం పాదముద్రలు కనిపించడంతో నక్క లోపలికి వెళ్ళడానికి ఆలోచనలో పడింది. గుహ లోపల సింహం ఉండి ఉంటే తన కథ ముగిసినట్లే కనుక ఓ మెరుపులాంటి ఆలోచన మెరిసింది. సింహం లోపల ఉందో లేదో తెలుసుకోవడానికి ఓ యుక్తి పన్నింది. "గుహా! ఓ గుహా! రోజూ నేనిక్కడికి రావడంతోనే ఏదో ఒకటి మాట్లాడుతావు. ఇవాళెందుకు మౌనంగా ఉన్నావు? ఏదైనా చెప్పు" అంది నక్క. కానీ గుహ మౌనంగానే ఉంది. దాంతో నక్క "గుహా! ఏమైంది? నా మీద కోపమా?.నీతో ఈరోజసలు గొడవపడలేదు కదా. కబుర్లు చెప్పు. వింటాను" అంది నక్క. ఇలా మరో రెండుసార్లు నక్క మాట్లాడిన తర్వాత ఈ మాటలన్నీ విన్న సింహం మనసులో అనుకుంది. మౌనంగా ఉంటే లాభం లేదనుకుని గుహ మాట్లాడుతున్నట్దుగా నటించింది... "నీమీద నాకెందుకు కోపం. రా లోపలికి. ఎందుకాగిపోయావు బయటే. నువ్వెప్పుడొస్తావాని చాలా సేపటి నుంచి ఎదురుచూస్తున్నాను. ఏదో పరధ్యాన్నంలో ఉండి నీ మాటలు ఆలస్యంగా విన్నాను. దా లోపలికి" అంది సింహం. దీంతో నక్క ఇట్టే పసికట్టింది. లోపల సింహం ఉందన్న సంగతి గ్రహించి "అమ్మయ్య ఈరోజెలాగో తప్పించుకున్నా సింహం కంటపడకుండా" అనుకుని అక్కడి నుంచి పారిపోయింది నక్క. నక్క పారిపోయిన విషయం చాలాసేపు తర్వాతగానీ సింహం గుర్తించలేకపోయింది. "ఛ .... అనవసరంగా మాట్లాడి తప్పు చేసాను" అనుకుని సింహం నిరాశతో నిద్రలోకి జారుకుంది. నీతి : ఏదైనా పని చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు