కొత్త తరం కథలు -01 అనగనగా ఒక రాజు.ఆ రాజుకి ఏడుగురు కొడుకులు.ఏడుగురు కొడుకులు వేటకి వెళ్ళి ఏడు చేపలు తెచ్చి వాటిని ఎండ బెట్టారు. అదేంటో మన కథ కి విరుద్ధంగా అన్ని చేపలు ఎండిపోయాయి.అదేంటి..ఎప్పుడూ ఒక చేప ఎండదు కదా.ఈసారి ఎలా ఎండిందని రాకుమారులకి అనుమానం వచ్చింది. అసలు విషయం ఏంటో కనుక్కుందామనుకుంటారు.రాజు వద్దని వారించినా వినకుండా వాళ్ళు చేపదగ్గరికెళ్ళి " చేప చేప! నువ్వు ఎందుకు ఎండిపోయావే?"అని అడిగారు. "మాకు ఈసారి గడ్డి మోపు అడ్డం రాలేదు.అందుకే ఎండిపోయాం" అని చెప్తుంది. సరేలే అని గడ్డి మోపు దగ్గరకి వెళ్ళి"గడ్డి మోపు,గడ్డి మోపూ, నువ్ ఎందుకు అడ్డం రాలేదు అని అడుగుతారు." నన్ను ఆవు మేసింది" గంభీరంగా చెప్పింది గడ్డిమోపు.వాళ్ళు మళ్లీ ఆవు దగ్గరకు వెళ్ళి " నువ్వు ఎందుకు గడ్డి మేసావ్" అని అడుగుతారు. అప్పుడే నిద్రలోంచి లేచిన ఆవు "పాలేరు పాలు పితికాడు,నాకు ఆకలి అయింది. తినేశా అని" అని టకటకా జవాబిచ్చి మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది.చేసేదేం లేక పాలేరుని వెతుక్కుంటూ రాకుమారులు వెళ్తారు." పాలేరు, పాలేరూ! నువ్వు ఆవు పాలెందుకు పితికావు "అని కాస్త గట్టిగానే అడుగుతారు.దానికి ఆ పాలేరు భయపడిపోయి "మా అవ్వ నాకు బువ్వ పెట్టిందంది,కడుపు నిండింది.ఇగ పని చేయాలి కదండీ.అందుకే పాలు పితికాను" అని భయం భయంగా సమాధానం చెపుతాడు.వాళ్ళు అవ్వ గుడిస దగ్గరికి వెళ్తారు.అక్కడ పిల్లాడిని ఆడిస్తున్న అవ్వని చూసి." ఏమ్మా ఈ సారి ఈ పిల్లోడు ఎడవలేదా?"అని అడుగుతారు." అదేంటో అయ్యా! వీడు ఆ పుట్టలో వేలు పెట్టినా ఆ చీమ ఎందుకో ఈసారి వీడిని కుట్టనేలేదు!". అని ఆశ్చర్యంగా చెప్పింది బామ్మ. అదెలా సాద్యమబ్బా అని ఆలోచిస్తూ ఆ రాకుమారు లంతా పుట్టదగ్గరికి వెళ్తారు.అక్కడ, ముక్కుకి చేతులకి ఆకులతో చేసిన మాస్క్,గ్లోవ్స్ వేసుకొని పుట్టనంతా కడుగుతూ శుభ్రం చేస్తున్న చీమ కనిపిస్తుంది.దాన్ని చూసిన రాకుమారులులకి ఏమీ అర్ధం కాక, గబగబా చీమ దగ్గరికెళ్ళి " నీ పుట్టలో వేలు పెట్టినా నువ్వు ఎందుకు కుట్టలేదు?"అని టకటకా అడుగుతారు. అంతమంది ఒకేసారి గుంపుగా దాని దగ్గరకొచ్చేసరికి చీమ ఉల్లిక్కిపడి వాళ్ళకి మీటరు దూరం జరిగి, " అస్సలే బయట అంటువ్యాధులు ప్రబలుతుంటే,మీరు కొంచెం కూడా సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు కదా.మీకు కొంచెం అయిన ఆలోచన ఉందా? మీ మనుషుల పుణ్యమా అని మాక్కూడా కొత్త కొత్త రోగాలోస్తున్నాయి.అస్సలే వాడు నా పుట్టని ముట్టుకున్నాడని నేను భయపడిచస్తూ నా పుట్టని శుభ్రం చేసుకుంటుంటే,మీరు కొంచెం కూడా బాధ్యత లేకుండా మాస్కులు వేసుకోకుండా నా పుట్ట దగ్గరికి రావడమే కాకుండా బయట గుంపులుగా తిరుగుతారా?. మొన్నటిదాకా ఆ చేప ఎండలేదని బాధ,ఇప్పుడు ఎండినా బాధేన??అక్కడ ప్రాణాలు ఫణం గా పెట్టి రాజ భటులు,వైద్యులు,పారిశుధ్య కార్మికులు అందరూ మనకోసం పనిచేస్తు, అత్యవసరం అయితే తప్ప బయట తిరగొద్దు అని చెప్తుంటే,మీరేమో చేప ఎండింది, చీమ కుట్టింది అని బయట తిరగడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి.?! ముందు మీరు ఇంటికి వెళ్ళండి,దయచేసి ఈ వ్యాధి పోయేవరకు ఇలా గుంపులుగా తిరగకండి.కాస్త శుభ్రత, ఇంకాస్త జాగ్రత్త ఉంటే అందరం బావుంటాం. ఆలోచించండి." అని చెప్పి మళ్ళీ తన పుట్టని క్లీన్ చెయ్యడంలో మునిగిపోయింది. - రక్షిత సుమ 28-04-2020


కామెంట్‌లు