పోక్సో చట్టంతో బాల్యానికి భరోసా : -- పునశ్చరణలో నల్లాని రాజేశ్వరి వెల్లడి కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టంలో తగిన మార్పులు తేవడంతో బాల్యానికి మరింత భరోసా దక్కిందని కేంద్ర ప్రభుత్వ "రాజ్యమహిళా సమ్మాన్ " అవార్డు గ్రహీత, బాలల సంక్షేమ సమితి (సిడబ్ల్యూసి) ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి అన్నారు. బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు తక్షణమే ప్రభుత్వం, పౌరసంస్థలు సమిష్టిగా స్పందిస్తున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వ బాలల సంక్షేమం, సంస్కరణ సేవలు, వీధిబాలల సంక్షేమ శాఖ సహకారంతో ఆన్ లైన్ శిక్షణ, పునశ్చరణ తరగతులను బుధవారం సాయంత్రం నిర్వహించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన బచ్ పన్ బచావో ఆందోళన్ (బిబిఏ) సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా పోక్సో చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా నుంచి సిడబ్ల్యూసి ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి, డిసిపిఓ డా.దాసరి సుబ్రమణ్యం, తదితరులు ఆన్ లైన్ ద్వారా హాజరై పలు అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను లేవనెత్తారు. బిబిఏ శిక్షణ, అడ్వకసీ సంచాలకులు జ్యోతిమాథుర్ పోక్సో చట్టంలోని కీలక అంశాలను సుదీర్ఘంగా వివరించారు. బిబిఏ కార్యక్రమ సమన్వయకర్త వరుణ్ , ఏపీ ప్రభుత్వ బాలల సంరక్షణ విభాగ సమన్వయకర్త జి. తిరుపతిరావులు చక్కటి అనుసంధానం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సఖి కేంద్రం బాధ్యులు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ, లింగసమానత్వం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. పిల్లలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. బాలల హక్కుల పరిరక్షణ సామాజిక బాధ్యత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన, సవరణ, సంస్కరణల ద్వారా బాలలకు భరోసా కల్పిస్తున్నాయన్నారు. చట్టాలను సక్రమంగా సత్వరమే అమలుచేస్తేనే బాధితులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. 12 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని సవరించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిన్నారుల స్నేహపూర్వక న్యాయస్థానాలు కూడా ఏర్పాటయ్యాయని వివరించారు. బాలల భద్రత కోసం ప్రభుత్వంతో పాటు పౌరసంస్థలు, సామాజిక కార్యకర్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా పాటుపడాలని నల్లాని రాజేశ్వరి పిలుపునిచ్చారు.


కామెంట్‌లు