ముల్లా కథలు - 12 న్యాయం లేని వాటా -------------------------- ముల్లా, అతని మిత్రుడు కలిసి ఓ కొబ్బరి మొక్కను కొనుగోలు చేసి పెంచనారంభించారు. ఇద్దరి మధ్య ఈ కొబ్బరి చెట్టుకు సంబంధించి ఓ ఒప్పందంకూడా కుదిరింది. కొంత కాలానికి కొబ్బరి చెట్టులో కాయలొచ్చాయి. "మన మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మొదటి సగం వాటా తీసుకునే హక్కు నాకుంది. మిగిలిన సగం వాటా నీది" అన్నాడు మిత్రుడు. "అవును. అలాగే" అన్నాడు ముల్లా. "చెట్టు సగభాగం నుంచి ఆకులూ కాయలూ వరకూ నా వాటా. మిగిలిన సగం నుంచి భూమిలో పాతుకుపోయిన వేరు వరకూ నీ వాటా. అర్థమైందిగా. కనుక కాయలకోసం గొడవపడకు" అన్నాడు మిత్రుడు. మిత్రుడి మాటలన్నీ విన్న ముల్లా మౌనందాల్చాడు. కాయలు విరగ్గాసాయి. ఆ కాయలు కోయడం కోసం మిత్రుడు చెట్టెక్కాడు. కాస్సేపటికి గొడ్డలితో వచ్చిన ముల్లా ఆ చెట్టుని నరకడం మొదలుపెట్టాడు. చెట్టుపైకి చేరిన మిత్రుడు "ముల్లా! నీకేమన్నా పిచ్చా? ఎందుకని చెట్టు కింది భాగాన్ని నరుకుతున్నావు?" అడిగాడు చెట్టుపై నుంచి. "అవును. చెట్టు కింది భాగం నాదేగా. నా ఇష్టం వచ్చినట్దు నేను చేసుకుంటాను. అది అడ్డుకోవడానికి నీకే హక్కూ లేదు" అన్నాడు ముల్లా పెద్దపెద్దగా అరుస్తూ. అప్పటికి గానీ మిత్రుడి తీరులో మార్పు రాలేదు. సరే. కాచిన కాయల్లో ఇద్దరం చెరిసగం తీసుకుందాం అని రాజీకొచ్చాడు మిత్రుడు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు