ముల్లా 13 రాజు గారి విలువ ----------------------- ఓమారు ముల్లా ఓ దేశపు రాజుతో పర్యటి స్తున్నాడు. "ముల్లా! నిన్నందరూ తెలివైనవాడివి. నీలో చతురత ఎక్కువ. హాస్యమెక్కువ. నువ్వొక మేధావి. ..ఇలా నలుగురూ నాలుగు విధాలుగా అంటుంటారు. ఏదీ నా విలువెంతో చెప్పు చూద్దాం...." అన్నాడు రాజు మీసం తిప్పుతూ. "రాజా! మీ విలువ వెయ్యి బంగారు కాసులు" అన్నాడు ముల్లా. రాజుకు కోపం వచ్చింది. "ఏమిటీ నా విలువ వొట్టి వెయ్యి బంగారు కాసులేనా? నేను వేసుకున్న హారం విలువెంతో తెలుసా, వెయ్యి కాసులు. నీకామాత్రం తెలీదా? ఇలాంటి ఆభరణాలే అనేకమున్నాయి..." చెప్పాడు రాజు. "రాజా! నా మాట మీరు అర్థం చేసుకోలేదు. మీరు ఆ ముత్యాల హారం వేసుకోవడంవల్లే దానికంత విలువ అని నా అభిప్రాయం" అని ఓ చిన్న నవ్వు నవ్వాడు ముల్లా. ఆ నవ్వుతో శృతి కలిపాడు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు