రాణెమ్మ కథలు 14 . డిటెక్టివ్ రాణి.:-మాసావిత్రి అక్కయ్యా వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోక ముందు మావూరిలోని రామిరెడ్డిపేటలో చాలా అద్దె ఇళ్లలో ఉన్నారు.ఒక్కో ఇల్లు మారినపుడల్లా మా చిన్నారి ,కిషోర్ ,మనకి ఓ కొత్త ప్లే గ్రౌండ్ ,కొత్త సావాసాలు, కొత్త శత్రువులు కూడా దొరుకుతుండే వారు.మేము బాగా చిన్న పిల్లలప్పుడు ప్రిన్సిపాల్ గారింట్లోనే అద్దెకి వుండే వాళ్ళు అక్కయ్యా వాళ్ళు .అక్కడ మామూలు పిల్లలానే సాధారణ ఆటలు ఆడుకున్నాం. పైగా ప్రిన్సిపాల్ గారి పిల్లలు మాకన్నా పెద్దవాళ్ళు బాగా కనుక మమ్మల్ని ఆడించే వాళ్ళు. తరవాత కోటిరెడ్డి గారు అనే మావూరి లోని కమ్యూనిస్టు పార్టీ లీడర్ వాళ్ళయింటికి మారారు.అక్కడా వాళ్ళ పిల్లలు మాకన్నా చాలా పెద్ద. బాగా ముద్దు చేసేవాళ్ళు మమ్మల్ని,మా అల్లరిని వాళ్ళుకూడా ఎంజాయ్ చేసేవాళ్ళు.మా చిన్నారి నోరు తిరగక ఆయన్ని కోతిరెడ్డిగారు అనేది. అమ్మమ్మా కోతిరెడ్డిగారు ఉన్నారా ? అని ఆయన భార్యని అడిగేది.పొలిటీషియన్ కదా ఆయన కోసం వచ్చిన వాళ్ళందరూ ఆయన్ని అడగటం విని ఉంటుంది.తర్వాత బ్యాంక్ కాలనీ అక్కడ కొంచెం కొత్తరకం అల్లరి మొదలు పెట్టాం అప్పుడప్పుడే.ఆబ్యాంక్ కాలనీ చుట్టూ తాటి చెట్లు ఉండేవి .ఎండి రాలిన తాటిమట్టలపై ఒకళ్ళు కూర్చుంటే ఇంకొకళ్ళు లాగటం.రెండు తాటికాయల మధ్య కర్రగుచ్చి బండిలా చేసి ఆడుకోవడం.తాటి గింజలు నాటి తేగలు అయ్యాయా లేదా అని రోజూ పీకి చూసుకోవడం ఇలా. ఈ ఇల్లు కాలేజీకి కొంచెం దూరం అవ్వటంతో సమితి ఆఫీసుదగ్గర రమణారెడ్డి గారి ఇల్లు అనే పిల్లల స్వర్గధామమంలోకి అడుగు పెట్టాం తర్వాత. అది ఇల్లు అంటే ఇల్లు కాదు ఓ పెద్ద తోటలో ఉన్నట్లు ఉండేది. లేని చెట్టు లేదు ఆయింట్లో.అరటి,జామ,సపోటా, ,మామిడి,కొబ్బరి, నారింజ,కమలా, నిమ్మ,కుంకుడు కాయ చెట్టుతో సహా.జాజి,విరాజాజి,సంపెంగ,దేవగన్నేరు, నందివర్ధనం,మల్లె, రాధామాధవ తీగతో సహా పూల చెట్లు. రెండు పోర్షన్ల పెద్ద ఇల్లు.పక్క పోర్షన్ ఖాళీ.ఇంక అసలే కోతులం ఇంత వనం .బడి నుంచి రోజూ నాకాళ్ళు అటువైపు నడిచేవి వాటంతట అవే.సాయంత్రం 4 నుంచి 6 వరకు ఆడుకుని అప్పుడు మాఇంటికి వచ్చేదాన్ని.ఒక్కోసారి అక్కడే పడుకోవడం తెల్లారి ఆటునుంచే బడికి పోవటం. మునిసిపల్ ట్యాప్ మామిడి చెట్టుకింద ఉండేది.దానిచుట్టూ కొంచెం ఎత్తు గట్టు కట్టి ఉండేది.ఇంకేముంది నీళ్లు పోయే తూముకి రాయి అడ్డం పెట్టి టాప్ నీటిని నింపి నీటిలో నేలాబారు ఈతలు.బావి పైకి వచ్చిన యెర్రని పండు నారింజలు కోయటానికి ఒక పక్క బావి ఒకపక్క బాత్రూమ్, ఓపెన్ బాత్రూం గోడ ఎక్కి ,సాగరసంగమం కమల్ హాసన్ల బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళం. మేడపైకి వెళ్లే మెట్ల పక్క పెద్ద మామిడి చెట్టు మెట్లు ఎక్కుతూ కాయలు కోసుకోవచ్చు ఎంచక్కా అలా ఉండేది ఆచెట్టు. మా బడులు త్వరగా వదిలేస్తారు కదా మా అక్కయ్య కాలేజీ నుంచి వచ్చేలోపు మాఇష్టా రాజ్యం గా ఉండేది.మా బంగారు బాల్యానికి మరీ బంగారు రోజులు ఆయింట్లో గడిపినవి . అయితే పైన బగమంతుడు ఉన్నాడే ఆయన అప్పుడప్పుడు మనం హ్యాపీగా ఉంటే ఓర్చుకోలేడు. పక్క పోర్షన్ లోకి మా శత్రువుల రూపం లో కొందరిని పంపించాడు. ఆయింట్లో ఒక డాక్టర్ గారు ఆయన ఇద్దరు పెద్ద మొద్దు పిల్లలతో,ఒక భార్యతో ఆయింట్లో దిగారు.ఇంక మాకు ఆంక్షలు స్టార్ట్ అయ్యాయి.ఒప్పందం ఏమిటంటే వాళ్ళ వైపు చెట్ల జోలీ మేము వెళ్లకూడదు వాళ్ళు మా వైపు రాకూడదు. మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఈడీల్ లో ఎందుకంటే పండ్ల చెట్లన్నీ మావైపు ఉన్నాయి దాదాపుగా .వాళ్ళకి పూల మొక్కలు.కోతులకి పూలచెట్లు ఎందుకు. మేము హ్యాపీ.వాళ్ళుకూడా హ్యాపీగా నే ఉన్నారు ఎండా కాలం వరకూ.ఎండాకాలం మామిడికాయలు వచ్చాక మొదలయ్యింది.మెట్లు ,మామిడి చెట్టు మావైపు .ఇంక చూసుకోండి .వాళ్ళ సంగతి ఎలా ఉన్నా మాకు మామిడి కాయలు లెక్క వేసుకోవడం అవి ఉన్నాయా లేదా లెక్క సరి చూసుకోవడం ఇదే సరిపోతోంది.లెక్క తగ్గింది అనిపించింది ఒకరోజు.ఒరే కిషోరూ రాత్రి పూట వాళ్ళు కాయలు కోసుకుంటున్నారేమో రా? మెట్లెక్కి ,మనం .అవును మెట్ల మీద పరుగెత్తిన శబ్దం విన్నా పిన్నీ! మా చిన్నారి. ఎలా వాళ్ళని కని పెట్టటం. మాచిట్టి బుర్రలకి ఎంతకీ తట్టలా.మా అక్కయ్య కాలేజీ నుంచి వచ్చింది .అక్కయ్య వెనకాల అటెండర్ జానీ బియ్యంపిండి క్యాన్ తో.అంతే మళ్లీ మనవి,కిషోర్ వి కళ్ళు మెరిసాయి.మాచిన్నారి తల్లి కి మాత్రం అర్ధం కాలేదు. మర్నాడు బియ్యప్పిండి మొత్తం పై మెట్టునుంచి కింద మెట్టుదాకా పోసి చక్కగా నెరిపి లెవల్ చేసాం. అంటే మెట్టు పైన అడుగు వేస్తే పాదముద్ర అదే ఫుట్ ప్రింట్ పడుతుంది కదా .వాళ్లు చీకటిలో చూసుకో కుండా ఎక్కితే పాదముద్రలతో వాళ్ళని పట్టుకోవచ్చని.ఈసారి చిన్నారికి కాదు మాఇద్దరికే తిట్లు పడ్డాయి రెందుకేజీల పిండి మెట్ల పాలు చేసినందుకు. ట్విస్ట్ ఏమిటంటే .పిండిపోసినందుకు వాళ్ళు దొరకలేదు కానీ .మాదృష్టి మామిడి కాయల మీదనుంచి మెట్ల మీదకి పోయింది.ఎందుకంటే మర్చిపోయి మేమే మెట్లు ఎక్కి ఒరేయ్ మన పాదముద్రలు రా అని. చెరుపు కోవటం తో సరిపోయింది ఆ ఎండాకాలం అంతా.-- వసుధారాణి.


కామెంట్‌లు