మానేరు ముచ్చట్లు---సరిగ్గా అరవై ఏళ్ల క్రితం అంటే 1960 ప్రాంతం.అప్పటికి నాకు ఏడేళ్లు ఊహ తెలిసి ఊళ్లో తిరిగే వయసు.చిన్న చిన్న పనులకు బజారుకు వెళ్లి రావడం, అవసరార్థం కాపువాడకో,వడ్లోండ్ల వాడకో కుమ్మరివాడకో,కమ్మరివాడకో,గానుగ దగ్గరికో,గిర్నీ దగ్గరికో ,మేదరి వాడకో,మేరోండ్లింటికే పోవటం ఊరంతా తిరగటం అలవాటయింది.అప్పటి దృశ్యాలన్నీ నా మనోచిత్రకళాశాలలో గీయని చిత్రాలై నిలిచి ఉన్నాయి.బడికి పోవటం బస్టాండుకు పోవటం,తోట దగ్గరికి,పొలం దగ్గరికి పోయి రావటం, మంచినీళ్లకోసం వాగుకో,వాక్కాలువకో పోయిరావటం,అప్పడప్పడు అత్యవసర పరిస్థితుల్లో భట్టోని బాయికో,గచ్చునూతి బాయికో కదాపి జాఫర్ఖాన్ బావికో పోవటంతో ఊరి దారులన్నీ ఊహల్లో రేఖా చిత్రాలుగా ఉన్నాయి.చిన్నబడి, అంగట్లబడి,ఆడోల్లబడి,పెద్దబడి ఏది ఎక్కడ ఉందో చక్కగా గుర్తుంది.శివుని గుడి,రాములవారి గుడి,హనుమాండ్ల గుడి,ఔసులోల్ల గుడి,పెద్ద మసీదు, చిన్న మసీదు అన్నింటి జాడలు మనో ఫలకం మీద అచ్చు పడి ఉన్నాయి.మత్తం మల్లయ్య సారిల్లు,మాలీపటేలిల్లు, కర్నాలిల్లు,దొరగారిల్లు,తిర్మలయ్యగారిల్లు, నిమ్మల రాజయ్య సారిల్లు ఇలా ఎవరింటికంటే వారింటికి హనుమంతు నిలా పరుగెట్టి వచ్చిన బాల్యం నన్ను ఇంకా ఆనాటి రాంబాపు(బు)గా కొనసాగిస్తున్నది.తొడుపునూరి వీరయ్య దుకాణం,కాచమోల్ల దుకాణం, పెద్దిసాం బయ్య దుకాణం,బుక్క రాయ మల్లు దుకా ణం, కరీమొద్దీన్ దుకాణం, బుక్కశంకర య్య గాజుల దుకాణం,మేర బుచ్చయ్య ఇల్లుఔసుల బాషయ్య ఇల్లు స్మృతి పథంలో పదిలంగా ఉన్నాయి.మీదివాడ, కిందివాడ,చాకలివాడ ,బెస్తవాడ,కర్నాలగడ్డ, కల్లం బండ ఇవన్నీ ఒక్కొక్క దానికీ ఎక్కే సందర్భం ముడిపడి దృశ్యాల తోరణం మనోప్రాంగణంలో వేలాడుతున్నది. సిమెంటు అడుగు పెట్టని ఊరు, కరెంటు కాలుమోపని గ్రామం,సర్కారు ఎరువులు ఎరుగని పొలాలు,ఏ ఒకచోట రెండో తప్ప మట్టిగోడల,గూనపెంకల ఇండ్లే.తాటికమ్మల,ఈతకమ్మల గుడిసెలే తెల్లారి లేస్తే చిక్కటి పెండనీళ్లు చల్లిన పచ్చటి ప్రకృతి సుగంధపు వాకిళ్లే.నీ ముగ్గు బాగుందా,నా ముగ్గు బాగుందా అని వాకిళ్లలో లంగా ఓణీల అమాయిక బాలికల చూపుల పోటీలే.ఊరంతా మట్టి గోడల సందులు గొందులే. తొవ్వల న్నీ వానాకాలపు వరదకాలువలు గనుక దిగబడే ఇసుక పరుపులు పరచినవే. మిమ్మల్ని ఊరించడం కాదు.ఆనాటి పల్లెటూరు స్వర్గసీమకు మారు పేరు. మళ్లీ జన్మించదు మాఊరు.దేవుడు ప్రత్యక్షమైతే అయితే ఏం కోరుకుంటావు నువ్వు అని అడుగుతారు.నేను అరవై ఏళ్ల కిందటి నా ఊరు నా బాల్యం కోరు కుంటాను.అందుకే సిపాయి చిన్నయ్యలో పాటంటే చాలా ఇష్టం. నా జన్మభూమి ఎంతో అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. చెప్పలేని వారుండొచ్చు.కానీ చాలా మందికి ఇలాంటి భావమే ఉంటుందని పిస్తుంది. పదవ తరగతి పిల్లలకు చెప్పిన Elaine V. Emans రాసిన poem Unwritten Registry గుర్తుకొస్తూంది. అవును అందరివి పేర్లు ప్రదేశాలు వేరు కావచ్చు ,వయసులు తేడా కావచ్చు కానీ అనుభవాలు సారూప్యాలే.అనుభూతుల పారవశ్యాలు సమానాలే.మీ కనిపించ వచ్చు నేను కొంచెం ఉద్విగ్నతకు లోన వుతున్నానని.కాని నేనంటాను అది ఈతరానికి కావాలని,తెలియ జెప్పాలనే నా ఉద్దేశం. అమ్మంటే బాపంటే ఆరాధన గొడ్డంటే,గోదంటే లాలన.సారంటే భయమూ భక్తీ గౌరవం ఇలా చాలా చెప్పాలి.ఎలాగూ సారు ప్రసక్తి వచ్చింది గనుక మా ఊరందరికీ ఆ రోజుల్లో సారంటే మత్తం మల్లయ్య సారే.ఊరిని అక్షరలోకానికి మరలించిన మహాను భావుడు,మా బాపుకు నాకు కూడా చదువు చెప్పిన ఒజ్జ,ఆయన కంటే ఆయన బెత్తమే ఎక్కువ చదువు చెప్పింది.అలాగని అది ఏనాడూ ఏ వీపునూ అంటలేదు. అంటుతుందే మోనన్న భయం మాత్రమే బుద్దిగా పలక మీద అఆఇఈలు,ఒంట్లు,ఎక్కాలు నేర్పించింది.అరేయ్ అన్న అదిలింపు చాలు మనసు కట్టడికి.ఆ గంభీర స్వరం ఇప్పుడు తలచుకుంటే దాని నిండా ఎంత వాత్సల్యం నిండి ఉండేదని. ఎప్పుడూ ఆయన ఇల్లు చదువు నేర్చుకునే పిల్లలతో కళకళలాడుతు ఉండేది.వానాకాలం వాగు దాటి వచ్చిన పిల్లలకు వాగు దాటనివ్వకపోతే ఆశ్రయం ఆయన ఇల్లు. పంచెకట్టు,కమీజు, నల్ల కోటు,తలపై నల్లటి మరాఠీ టోపీ,చేతిలో బెత్తం ఇదీ ఆయన రూపం.ఆయన మా ఊరును వెలిగించిన దీపం.అప్పుడు తెలియదు పాదాలకు నమస్కరించాలని ఇప్పుడు తెలిసినా ఆయన పాదముద్రలే తప్ప పాదాలు లేవు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గరుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మైః శ్రీ గురవే నమః - రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు