మా బర్రె ….బతుకైంది...బంధమైంది!! …………………………………............ అది 1980 ల ముచ్చట. ఒక రోజు పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ ఇచ్చి పోయాడు. ఇప్పి చూస్తే ఆశ్చర్యం .అది మెదక్ జిల్లా జహీరాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ నుండి వచ్చింది. అందులో సీట్ కోసం ఇంటర్వ్యూకు రమ్మనమని. ఇల్లంతా సంతోషం. ఉద్యోగమే దొరికినంత ఆనందం. అప్పుడు పాలిటెక్నిక్ చదివితే వెంటనే ఉద్యోగాలు వస్తాయని అందరూ అంటుండే వారు. అందుకే అంత సంతోషం. సాయంత్రం పని నుండి మా బాపు ఇంటికి రాగానే, లెటర్ వచ్చిన విషయాన్ని చెప్పితే చాలా సంతోషపడ్డాడు. ఊరిలో 10వ తరగతిలో మొదటి శ్రేణిలో నేను పాసయ్యానని అందరూ పొగిడిన ఆనందం ఇంకా అతనిలో మాసి పోలేదు. కాలేజీలో చేరడానికి ఇంకా వారం రోజుల సమయముంది అందులో. బాపు నాతో "అరే ఇంద్రా...కాలేజీలో షరీకు అవడానికి ఫీజు ఏమైనా కట్టాల్నారా" " మొత్తం 450 రూపాయలు కట్టాల్నే" "ఏమైనా తక్కువ లేదటనారా" " లేదు" "మల్ల మంచిగా చూడు. ఒకేసారి కట్టల్నా, అప్పుడప్పుడు కొన్ని కొన్ని కడితే సరిపోతుందా" " దీనిలో మాత్రం ఒకేసారి కట్టమని ఉంది బాపు" ఇక అప్పటి నుండి రోజు డబ్బుల కోసం తిరగడమే. ఎంత మందిని అడిగినా ఆ సమయానికి ఎందుకో అసలు అప్పే పుట్టలేదు. సమయం దగ్గర పడుతుంది. కట్టలేక పోతే సీట్ పోతుంది. అప్పు అడిగినపుడు, లేదని చెప్పడంతో పాటు అనేక సలహాలు ఇచ్చేవారు మొదలయ్యారు. మనకు లేనప్పుడు అంత ఫీజు కట్టి, ఆ చదువు కోసం ఎందుకు పంపాలని కొందరు, అప్పు చేసి చదువుకునే బదులు , కనీసం పొలం కొనుక్కున్న పంట వస్తుందని ఇంకొందరు, వ్యవసాయం చేసుకొని ఎంత మంది బతకడం లేదని మరికొందరు అనేక సలహాలు ఇచ్చారు. తను పనిచేస్తున్న చోట, రోజు వారి తిండికి తప్ప, దాచిపెట్టుకొని ఖర్చు పెట్టే స్థాయి బాపుకు లేదు. కాలేజీ నుండి వచ్చిన లెటర్ ను ఒకటికి రెండు సార్లు పట్టుకొని మళ్లీ మళ్లీ నాతో చదివిస్తూ, " ఫీజు ఏమైనా తక్కువ లేదా " అని అడగడం, అప్పుల కోసం తిరగడం….దొరకలేదని రావడం. అది ఒక రకమైన విషాదం. అన్నీ పెట్టి పుట్టిన వారికి ఆ మాత్రం డబ్బులు లెఖ్ఖ కాక పోవచ్చు. కానీ రోజు వారి జీవితానికే ఖరీదు కట్టుకొని….ఖాళీ కంచాల్లో వెన్నెల బొంచేసే వారికి అనుక్షణం జీవితం యుద్ధమే!! అట్లా మా ఇల్లు నిరంతర యుద్ధ క్షేత్రమే!? కలిసిరాని కాలంలో భవిష్యత్తు ఎప్పుడూ అగమ్య గోచరమే. ఎన్ని రోజులు తిరిగినా సరి పోయె డబ్బులు రాలేదు.కాలేజీలో చేరాల్సిన సమయం రానే వచ్చింది. పోవడమా?….ఆగడమా??. పోతే చదువు...ఆగితే ఏమవుతామో తెలియదు. భవిష్యత్తు అడుగులకు కీలక సమయంలో తీసుకొనే నిర్ణయమే పునాది అవుతుంది. కొన్ని ప్రశ్నలు కుటుంబం ముందు ఎదురైనపుడు, దానికి జవాబులు అప్పటి వరకు దొరికి ఉండొచ్చు…..కొత్తగా రాయాల్సి రావొచ్చు. ఏం రాసావన్నదాని బట్టే భవిష్యత్తు జీవితానికి దారులు పడుతాయి. ఆ రోజు మా బాపు రాసిన జవాబే నేను ఈ రోజు మీ ముందు ఈ స్థాయిలో నిలబడేలాగా చేసింది. కూడ బెట్టిన ఆస్తి లేదు...వెనక నుండి మేమున్నామని ఆర్థికంగా ఆదుకొనే వారూ లేరు….మాకున్నది ఒక చిన్న పూరిల్లు….అడుగడుగునా ఇంటికంతా ఆదెరువైన పాలిచ్చే బర్రె. ఇంతే మా ఆస్తి. పూరిల్లు ….పాలిచ్చే బర్రె!! పూరిల్లు ….పాలిచ్చే బర్రె!!! ఇల్లును అమ్మలేము...బర్రెనమ్మి బతకలేము. అది అప్పటి వరకు పాలిచ్చిన బర్రె….పానం నిలిపిన బర్రె…..పాలతో బతుకెళ్ళ దీసిన చరిత్ర మాది….చరిత్రకు జీవం పోసిన జీవితం దానిది. అది ఇంటిలో భాగం…..సాగే కుటుంబానికి….జరిగే జీవితానికి అదే అప్పటి వరకు ఆదెరువు. బర్రెను ఆ సమయంలో అమ్మడం అంటే శరీరంలో...కుటుంబంలో ఒక భాగాన్ని అమ్మడం...ఒక ఆశను అమ్మడం….ఒక బతుకు దెరువును అమ్మడం.అది సూడి బర్రె. వారం రోజుల్లో ఈనుతుంది. పాలకు కరువు లేదు….రోజు ఖర్చులకూ కరువు లేదు. ఒకసారి అమ్మినాక ఇంట్లో ఇబ్బందులు తెలుసు….జీవితం కుంటుబడే పరిస్థితులు తెలుసు...అయినా భవిష్యత్తు స్వప్నాలను నా చదువులో చూసుకున్నారు. ధైర్యంగా అమ్మకానికి సిద్ధపడ్డారు. అమ్మటానికి నాతో పాటు ఎడెల్లి లింగయ్య నిచ్చి మా దగ్గరున్న తొర్రూరు అంగడికి పంపించాడు బాపు. 14 కిలోమీటర్లు నడుచుకుంటూ అంగడికి చేరుకున్నాము. అక్కడ పెద్దగా బేరం చేయకుండానే, బర్రెను చూడగానే 600 రూపాయలకు కొనుక్కున్నారు. మేతేసి...కుడితి పెట్టి…. రోజూ ఇంట్లో భాగమైన బర్రె , కొనుక్కున్న మనిషి తీసుకెళుతుంటే, కొద్ది దూరం పోయి ఒక్కసారి తిరిగి చూసినప్పుడు అన్నేళ్ళ అనుబంధం దుఃఖమై పొంగుకొచ్చింది. అది మామూలు జంతువే…. ఇంట్లో మనిషిలా మెదిలింది...మమతలూ పంచింది. ఆర్థిక సంబంధాలు అర్థం కాని వయసు...కానీ జీవిత సంబంధాలు తెలుసు కదా!! తొర్రూరు నుండి ఇంటికి వస్తున్నంతసేపు అది గుర్తు కొస్తూనే ఉంది. బాపు" బర్రె ఎంతకు అమ్ముడు పోయింది రా" " 600 కు పోయింది బాపు" " చాలా మంది బేరం చేశారా….లేకపోతే చూడగానే కొన్నార్రా?" " ఒక్కతను చూడగానే కొనుక్కొని పోయిం డే" " మన బర్రెకు వంక ఎవడు పెడుతర్రా. రామ సక్కదనాల బర్రె... ఎవ్వరి ఇంట్ల ఉన్నా వారికి అదృష్టమేరా... కుండెడు పాలిస్తుంది. ఇంట్లో పిల్లల కడుపు నింపుతుంది. రాగానే నావైపే చూసేది. ఇప్పుడెక్కడుందో " అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంట్లో అందరూ తలుచుకొని బోరుమన్నారు. అమ్మితే వచ్చిన డబ్బులతో, మా బావ వెంకట్ రెడ్డి నన్ను జహిరాబాద్ తీసుకొని పోయి కాలేజీలో చేర్పించాడు. చదువు….ఆ తర్వాత ఉద్యోగం. అదంతా జరిగిపోయి 40ఏళ్లు అయింది. ప్రస్తుతం ఈ స్థితిలో ఆనాటి బాల్యం గుర్తుకొస్తే …..బంధాలు గుర్తుకొస్తే ….బర్రె గుర్తుకొస్తే….బతుకంతా ఒక్కసారి ఎదురుగా నిలబడుతుంది. ఒక మనిషిగా నన్నింతవాన్ని చేసిన ఆమ్మా బాపుల శ్రమ కళ్ళముందు కదలాడుతుంది. 90 ఏళ్ళ వయసులో బాపు, 80 ఏళ్ల వయసులో అమ్మ, ఇంట్లో అందరి మధ్య తిరుగుతుంటే జీవిత పుస్తకాన్ని రోజూ చదువు తున్నట్లు…..సందుకలో చరిత్రను దాచిపెట్టు కున్నట్లు …..నిక్షిప్త భండాగారమంతా మన వెంటనే ఉన్నట్లనిపిస్తుంది. స్కూల్ నుండి రాగానే, ఆశగా నా వైపు చూసే బర్రె….కుడితి పోస్తుంటే కొమ్ములను శరీరానికి రాకిన బర్రె….గడ్డి మోపును ఎదురుగా వేస్తుంటే చేతులను నోటితో తాకిన బర్రె , జ్ఞాపకాలు గుర్తుకొస్తే మనసంతా ఏదోలా అయిపోతుంది. నా చదువులకు ఆలంబనై... భవిష్యత్తు అడుగులో మొదటి మెట్టై…. అక్షరాల వెలుగుకు చిరు దీపమై…. గుండె గొంతుకలో కొట్లాడే ఆశల స్వప్నమైన మా బర్రె, అంగట్లో, కొత్తగా కొన్న వారితో వెళ్ళిపోతూ వెనకకు తిరిగి చూసిన చూపులు, 40ఏళ్లవుతున్నా ఇప్పటికీ నన్ను వెన్నాడుతూనే ఉ...న్నా...యి!! ….స్ఫూర్తి


కామెంట్‌లు