నేను 1996 జూలై 1వతేదీన ఎఫ్ ఏ సి తీసుకోవడం జరిగిందని ఇంతకు ముందే చెప్పాను. నేను ఎఫ్ ఏ సి తీసుకున్న కొద్ది రోజుల్లోనే గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబునాయుడుగారు మొదటి జన్మభూమి 1996-97 విద్యాసంవత్సరంలో ఆగస్టు లేక సెప్టెంబర్ నెలలో ప్రారంభించినట్లు నాకు జ్ఞాపకం. జప్.పి.సి.ఇ.ఓ గారినుండి, డి.ఇ.వో గారి నుండి జన్మభూమి కార్యక్రమంలో చేయవలసిన పనుల లిస్ట్ తెలియజేసారు. నేను ముందుగా ఈకార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలనే ఆలోచనలో పడ్డాను. కొన్ని ఆలోచనలు నా మెదడుకు తట్టాయి. మరుసటి దినం స్టాఫ్ మీటింగ్ పెట్టి మొదటి జన్మ భూమి ప్రభుత్వ ఉత్తర్వులపై స్టాఫ్ తో చర్చించాను. ఎవరిసలహాలు వారు ఇచ్చారు. రెండు మూడు నెలల కాలంలోనే పాఠశాల పరిస్థితులు చాలామటుకు మారిపోయాయి. మొదటిలో నా పరిపాలన అష్టకష్టాలతో కూడుకున్నది అనుకున్నవారంతా నా మార్గంలో పడి నాకు సహకరించడం మొదలు పెట్టారు. మనసు విప్పి మాట్లాడుతూ సలహాలివ్వ డంలో ముందుకు వచ్చారు. ముందు తరగతి గదులు పరిశుభ్రత, పాఠశాల పరిశుభ్రత చేద్దామనుకున్నాం. కొన్ని పరికరాలు అంటే చీపుర్లు, డస్ట్ బిన్ లు, ప్లాస్టిక్ చెంబులులాంటివి పిల్లలకు సమకూర్చాం. పిల్లలు ఎవరి తరగతి గదులు వారు పరి శుభ్రంగా తుడుచుకొని, నీటితో గదులను కడిగి డెకరేషన్లు చేసారు. ఆ మరుచటి దినం నా ఆఫీస్ రూంకి, స్టాఫ్ రూంకి, నాన్- టీచింగ్ రూంకి రంగుల సున్నాలు వేస్తే అట్రాక్టీవ్ గా ఉంటుంది అనే ఆలోచన నాలో వచ్చింది. ఆ విషయం స్టాఫ్ ముందు ఉంచాను. అందరూ అంగీకరించారు. కానీ డబ్బు ఎలా సమకూర్చుతాం అన్నదే సమస్య. నేను ముందుగా 500/- డొనేషన్ గా ఇచ్చాను. మిగిలిన స్టాఫ్ కూడా వారికి తోచిన డొనేషన్స్ వారు ఇచ్చారు. రసీదుపుస్తకాలు ప్రింట్ చేయించాను. అందుకు ఒక కమిటీ వేసాను. ఆ కమిటీ చేసే పనులను పర్యవేక్షించేటందుకు స్టాఫ్ అంతా మీటింగ్ పెట్టుకుని చర్చించుకొనేవాళ్ళం . ముందుగా అనుకున్న విధంగానే రంగుల సున్నం వేసే కార్యక్రమం పూర్తి అయింది. స్కూలుకు వచ్చేపోయే వారికి, రోడ్డు మీద నుండి వచ్చే పోయేవారికి ఆ గదులను చూసేసరికి అందంగా కనిపించేవి. నేను హెడ్మాష్టరుగా వచ్చిన తరువాత స్కూలులో ఒక మార్పు వచ్చిందని ప్రజలు భావించారు. మా స్కూలులోనే మధ్యాహ్నం వేళ జూనియర్ కాలేజీ నడుపబడేది. ఈ పరిస్థితి చూసిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మాకు రెండు బస్తాల సిమెంటు, 50౦/-రూపాయలు నగదు ఇచ్చారు. వీటన్నిం టినీ ఆకమిటీ ఆధ్వర్యంలోనే ఉంచేవాడను. నా స్వంత సొమ్ము మినహా పాఠశాలకు ఖర్చులకు సంబంధించిన సొమ్మును నాదగ్గర ఉంచే వాడనుకాదు. నా సర్వీసుమొత్తం పై ఇదే పద్ధతి కొనసాగించే వాడను. స్పెషల్ ఫీ ఫండ్స్ గానీ, ఇంకే ఫండ్స్ గానీ నా చేతికి వచ్చినా స్టాఫ్ మీటింగ్ పెట్టి స్టాఫ్ తో చర్చించి ఏమేం కొనాలో చెప్పి ముగ్గురు, నలుగురు సభ్యులతో కమిటీ వేసి డబ్బిచ్చి వాళ్ళచే కొనిపించేవాడను. ఇదీ మొదటి నుండి చివరి వరకూ ఇదే పద్ధతి అనుసరిం చాను. బలిజిపేట హైస్కూల్ రమారమీ 1957 సంవత్సరంలో నిర్మింపబడ్డది. చాలా పురాతనమైనది. దీని నిర్మాణం చాలా బలమైనదే. అయినా దీనిని సురక్షితంగా పర్యవేక్షించే నాథుడు ఉండేవాడు కాదు. స్కూలు ప్రక్కనే రెండు సినీమాహాళ్ళు ఉండేవి. ఆ కారణంగా సినిమా హాళ్ళకు వచ్చే ప్రేక్షకులు జరపబోయే అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా ఈపాఠశాలను మార్చుకున్నారు. అడిగే వాడు లేడు. పాఠశాలకు గల అన్ని కిటికీ తలుపులు ఊడబరి కేసారు. పాఠశాలను ఏర్పాటు చేసిన తొలినాళ్ళలోమంచి ఖరీదైన ఫర్నీచర్ ను ప్రభుత్వం అందజేసింది. నేడు పాఠశాల ఏ భాగాన్ని చూసినా మరమ్మత్తులనే కోరుతుంది. టేకు ఫర్నిచర్ పాఠశాలకు ప్రభుత్వం సరఫరా చేసింది. కానీ చివరకు ఈ ఫర్నిచర్ అంతా ఏమయిందో ఎవరికీతెలియదు. కూర్చోడానికి సరైన కుర్చీలు లేవు. 12 తరగతి గదులు, స్టాఫ్ రూమ్, సైన్స్ లేబ్ కు ,లైబ్రరీకి సరిపడ టేబుల్స్ లేవు. లైబ్రరీ పుస్తకాలు,.మేప్ లు ఛార్ట్స్, చాలా మటుకు చెద పట్టేసాయి. మేప్ లు, ఛార్ట్స్ మూడు, నాలుగు వందల మధ్య ఉండేవి. 95% పైబడి చెదపట్టేశాయి. వాటిని చూస్తే ప్రాణం ఊసురుమనేది. స్కూలు కు గోడగడియారంలేదు. తరగతి గదులకు వైట్-వాష్, తలుపులకు‌,కిటికీలకు రంగులు వేసి ఎన్నాళ్ళయిందో ? ఇవన్నీ చేయడానికి ప్రజల సహకారం లభిస్తుందా ? జెండా. వందనం చేయడానికి ' ప్లాట్ ఫామ్ ' ఫ్లాగ్ పోల్ ' కనీసం లేవు. ఇవన్నీ నా ఆధ్వర్యంలోనే చేయగలనా ? అనే ఆలోచనలు నన్ను రాత్రి పగలు వెంటాడుతూనే ఉండేవి.ఇవన్నీ నాకాలంలో ప్రజల సహకారంతోనే పూర్తిచేయాలి అనుకున్నాను. (సశేషం) శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.


కామెంట్‌లు