ఇది నాయనగారు సందర్శించిన ఇల్లు!--ఇక్కడ ఫోటోలో ఉన్న ఇంటిని "నాయన"గారు సందర్శించారు. ఇంతకూ "నాయన" గారంటే ఎవరో తెలియకపోవచ్చు. రమణ మహర్షి గారికి "భగవాన్" అని మొట్టమొదటగా పిలిచిన వారు కావ్యకంఠ గణపతి మునిగారు. గణపతి మునిగారిని "నాయన" అని సంబోధించన వారు రమణమహర్షిగారు. తపశ్శీలి నాయనగారు సందర్శించిన ఈ ఇంటి వయస్సు నూటయాభై ఏళ్ళపైనే ఉంటుందని నా అంచనా. ఈ ఇల్లు మా నాన్నగారి పూర్వీకులది. మా తాతగారైన లక్ష్మీనరసింహంగారి నివసించిన ఇల్లు. మా నాన్నగారు పుట్టిపెరిగిన ఇల్లు. విజయనగరంలో సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ చదువుతున్న రోజుల్లో మా నాన్నగారు వీలున్నప్పుడల్లా హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణ దాసుగారింటికి వెళ్తుండేవారు. ఓరోజు ఉదయం మా నాన్నగారు వెళ్ళి నప్పుడు నారాయణదాసు గారి దగ్గర అప్పటికే ఒకరున్నారు. ఊహకందని వర్చస్సు. గడ్డం. సన్నని మీసం. పెద్ద అంగీ. ఖద్దరు పంచ.... ఇద్దరికీ నమస్కరించి ఓ పక్కన కూర్చున్నారు నాన్నగారు. దాసుగారు ఆయనకు మా నాన్నను చూపిస్తూ "గణపతీ! వీడు బుద్ధిమంతుడూ. కవి. ఇక్కడ సంస్కృత కాలేజీలో చదువుకుంటున్నాడు. నా దగ్గర ఏవేవో ప్రశ్నలు వేసి శాస్త్ర విషయాలు, గాన, కవితా విశేషాలు తెలుసుకుంటూ ఉంటాడు. వీడి ఊరు శివరామపురః. ఇంటి పేరు యామిజాలవారు" అనేసరికి "మీ నాయనగారు లక్ష్మీనరసింహముగారా?" అని అడిగారు గణపతిమునిగారు.ఔనన్నారు నాన్నగారు."నీకెలా తెలుసు వీడి నాయన" అని దాసుగారి ప్రశ్న.అప్పుడు గణపతిమునిగారు " చిన్నప్పుడు కొంతకాలం సాలూరు సంస్కృత పాఠశాలలో చదువుకుంటూ శివరామపురం వచ్చి వీరింట భోజనం చేయడం, కబుర్లు చెప్పడం" వంటి విషయాలు గుర్తు చేశారు. అంతట దాసుగారు "బలే బలే సంబంధమే మనది" అంటూ దాసుగారు "ఒరే యీ మహానుభావుడు కావ్యకంఠ గణపతి" అన్నారు. అనంతరం మా నాన్నగారితో ఒక పద్యం చెప్పించారు గణపతిముని.శివానందల హరిలోని ఒక శ్లోకాన్ని ఆయన చదవగా మా నాన్నగారు ఆ శ్లోకానికి భావప్రధానంగా వెంటనే ఓ పద్యం చెప్పారు. అది దాసుగారు గణపతిమునిగారితో మా నాన్నగారిని పరీక్షించిన ఘటన. తర్వాతి రోజుల్లో మా నాన్నగారు మంత్ర శాస్త్రానికి సంబంధించి గణపతి మునిగారి నుంచి అనేక విషయాలు తెలుసుకుని గురువుగా భావించి "నాయన" అనే పుస్తకంకూడా రాశారు.ఇదిలా ఉంటే, విజయనగరం జిల్లాలోని సాలూరు మండలంలో శివరాంపురం అనే అగ్రహారం ఉంది. ఆ ఊళ్ళోని ఇల్లే ఈ ఇల్లు. మా ఇంట మా అన్నదమ్ముల్లో అన్నయ్యలు ముగ్గురూ ఈ ఇంంటిని చూశారు. అక్కడ ఉన్నారు. కానీ నేనూ, తమ్ముడు గణపతి ఈ ఇంటిని ఇప్పటివరకూ చూడలేదు. మా సమీప ఆత్మీయ బంధువులు రాంజీగారు, సన్యాసిరావుగారు తదితరులు కలిసి 2015లో మా నాన్నగారి శతజయంతి ఉత్సవాలు నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించారు. అయితే అనివార్య కారణాలతో వెళ్ళలేకపోయాం. నాటి కార్యక్రమంలో యామిజాల రామనరసింహంగారిని సత్కరించారు. ఈ రామనరసింహంగారితో ఫోన్లో మాట్లాడి మా నాన్నగారు పుట్టి పెరిగిన ఇంటి (శివరామపురం) ఫోటో ఉంటే పంపమని కోరగా ఆయన నిన్న పంపించారు. నిజానికి పెద్ద ఇల్లే ఇది. కానీ వెనుక భాగమంతా కూలిపోయి ఫోటోలో కనిపిస్తున్న ఈ భాగమే మిగిలి ఉంది. మా నాన్నగారి తమ్ముడి మనవడైన రామనరసింహంగారి పర్యవేక్షణలోనే ఉందీ ఇల్లు. శివరామపురం గురించి మా అమ్మానాన్నలు ఇంట్లో చెప్పగా వినడమే తప్ప ఆ అగ్రహారాన్ని ఇప్పటివరకూ సందర్శించలేదు. నేనూ తమ్ముడూ పుట్టింది మద్రాసులోనే. అయితే ఇప్పుడు ఆ ఇంటి ఫోటోనైనా చూడగలిగినందుకు ఆనందంగా ఉంది. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు