రాణెమ్మ కథలు 22. రైతు రాణి.--ఈ టైటిల్ టైటిల్ కాదు నా ఆత్మ. 100 ఎకరాలకు పైగా వ్యవసాయం కల కుటుంబం పెద్దల హయ్యాములో . కొంచెం కొంచెం గా హరించుకు పోయి మా చిన్నప్పుటికి అది పన్నెండు ఎకరాల్లో ఆగింది.నాన్న చిన్న చిన్న కాంట్రాక్టులు చేసినా ,నేను రెండవతరగతికి వచ్చేసరికి అనారోగ్య కారణాల వల్ల మంచం మీదనే ఉండి పోయారు . ఇక ఇంతమంది పిల్లలు ,పెళ్లిళ్లు,పురుళ్ళు సంసారం నడవటానికి పొలమే ఆధారం. నరసరావుపేటనుంచి తొమ్మిది కిలోమీటర్లు మావూరు రూపెనగుంట్ల ,మాఇంటి పేరుకూడా అదే, అక్కడ మన “యూనివర్సిటీ” అదే మాపొలం.యూనివర్సిటీ అని ఎందుకన్నానంటే పైకి పొలం జీవనాధారం, ఫలసాయం నాకు మాత్రం గొప్ప అధ్యయనకేంద్రం.మూడు, నాలుగు తరగతుల్లో పొలం గురించి పెద్దగా నాకేమీ తెలీదు.ఎప్పుడైనా పొలం చేసేవాళ్ళు వడ్ల బళ్ళో ,గడ్డి బళ్ళో తొలుకొస్తే వాళ్లకి అన్నం వడ్డించటంలో అమ్మకి సాయం చెయ్యటం తప్ప.వాళ్ళు గొడ్లని విడిచిన బండ్లు ఎక్కి ఆడుకునే దాన్ని అంతే.అయితే కుటుంబం తిండికి ఇబ్బంది లేకుండా ఎప్పుడు వచ్చీపోయేవాళ్ళతో ఇంత సమృద్ధిగా ఉండటానికి కారణం పాడి,పంట అని మాత్రం తెలుసు.5వతరగతి కి వచ్చేసరికి అమ్మమ్మ పెద్దతనం వల్ల ఒక్కతీ పొలం వెళ్ల లేక పోయేది.ఆమెకి తోడుగా నన్ను తీసుకు వెళ్ళేది.అలా మొదలు అయ్యింది పొలంతో నా పరిచయం. మొదట మా ఊరికి rtc బస్సులు లేవు ప్రైవేటు బస్సులు ఉండేవి. మా ఇంటి ముందు రోడ్ నుంచే మావూరు పోవాలి.అమ్మమ్మ ,నేను బస్ కోసం నిలబడటంతో మా పొలం పని మొదలు అయ్యేది. టికెట్ ఒక్కరూపాయి నాకు అరవై పైసలు ఆఫ్ టికెట్ .టికెట్ తీసుకునేటప్పుడే పొలానికో,ఊరికో చెప్పేదాన్ని. ఎందుకంటే ఊరు ముందు వస్తుంది. పొలం ఊరినుంచి దేచవరం అనే మరో ఊరు వెళ్ళేదోవలో,పొలం వెళ్లాలనుకున్నప్పుడు బస్సు లో మనం ఊరు వచ్చినా కూర్చునే ఉంటే కండక్టర్ బామ్మగారి మనవరాల్ రూపేనగుంట్ల అని అరిచేవాడు. అలా అరవకుండా ఉండాలని ముందు చెప్పేదాన్ని అయినా నన్ను ఆట పట్టించటానికి అరుస్తుండే వాడు.కొన్ని రోజులకి అతను అలా అరవక పోతే బాగుండనట్లు ఉండేది . మా బాలయ్య నగర్ పలకరింతలకన్నా ఘోరం అక్కడ.మన దోవన మనం ఎవ్వరికేసి చూడకుండా పోతున్నా సరే ఓ మడిసో ! అని పిలిచి మరీ ఏఊరు ? అని అడుగుతారు కొత్త వారిని. నన్నయితే అమ్మమ్మ పక్కన ఉండే దాన్ని కనుక మనవరాలా అని ఆడిగేవాళ్ళు. మొదట్లో అమ్మమ్మ పక్కన వెళ్ళటం ఆమె మాట్లాడుతుంటే చూడటం, పొలం వెళ్లాల్సి వచ్చినప్పుడు పొలామంతా ఆమెతో పాటు తిరగటం ఇదే తెలుసు.ఒక యేడాది మొత్తము పొలం వ్యవసాయ సంవత్సరం (ఎడ్యుకేషన్ ఇయర్ లాగా) గమనించే సరికి . మరుసటి సంవత్సరం అదే టైముకు ఏమి చెయ్యాలి, ఏమి రాబోతుంది అర్ధం అవ్వసాగింది.ఏడవతరగతిలో ఉండగా కోతలు ,కుప్పనూర్చటం ముఖ్యమైన ఘట్టాలు కూలీలను లెక్కపెట్టుకోవటం,పని జరుగుతుందా లేదా చూడటం.మధ్యలో వాళ్ళు భోజనాలు చేసుకుంటూనో, కాసేపు కూర్చున్నప్పుడో చెప్పుకునే కబుర్లను బట్టి వాళ్ళ కుటుంబ విషయాలు కష్ట సుఖాలు అర్థం అవుతుండేవి.12 ఎకరాల పొలం పంటమీద ఉన్నప్పుడు ఒక్కసారి ఆపొలం చుట్టూ తిరగటం మామూలు విషయం కాదు .అమ్మమ్మ ఒక్కోసారి నడవలేక పోయేది.ఆమెని ఒచెట్టు చెట్టునీడన కూర్చో పెట్టి .నేను చూసి వస్తా అని వెళ్ళేదాన్ని.ఆ చూడటం కాస్తా చూచి రమ్మంటే కాల్చి వచ్చినట్లుగా .చిన్నగా అమ్మమ్మ అవసరం లేనంతగా విషయాలు వంట పట్టేసాయి.రైతు ఇంట్లో ఆవిడని కూర్చో పెట్టి పొలం నేను చూసి వచ్చేదాన్ని.ఎనిమిదో తరగతిలో ఉండగా, 12 ఎకరాల పొలంలో 4 ఎకరాలు ఒక కుప్ప ఒక రోజే కొట్టారు.ఎక్కువ మొత్తం అవ్వటంతో సాయంత్రానికి కొట్టటం మాత్రమే అయ్యింది .తూర్పార పెట్టటం,బస్తాల్లోకి ఎక్కించటం మిగిలి ఉంది . కుప్పకొట్టిన గడ్డివామి లో ఆ రాత్రి నిద్రపోవడం . నా జీవితాన మరువలేని అనుభూతి. ఆ తరువాత నించి పొలంతో నాకు ఎంత అనుబంధం అంటే .వెళ్ళాల్సినంత పని లేకపోయినా పని కల్పించుకుని వెళ్లి చేని గట్టున కూర్చుని కనుచూపు మేరా కనపడే పొలాన్ని ఆప్యాయంగా చూపులతోనే తడుముకునేదాన్ని.అయితే చేను చేసే రైతులకు ,మాకు కూడా అదే ఆధారం కావటంతో ,ఇద్దరికి ఒకళ్ళకి ఒకళ్ళం కావాలి , మళ్ళీ ఒకళ్ళమీద ఒకళ్ళకి ఒకతెలియని పోటీ లేదా అనుమానం లేదా కోపం ఉండేవి. ఆ స్తితిని మామూలు చెయ్యటానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది.చిన్న వయస్సులో తలకి మించిన భారంలా కాక ఒక ఛాలెంజ్ లా ఉండేది నాకు ఆపొలం.-వసుధారాణి .


కామెంట్‌లు