చెరపకురా చెడేవు (కథ) సరికొండ శ్రీనివాసరాజు‌: . విద్యాపురి పాఠశాలలో సహస్ర, తుషారలు 9వ తరగతి చదువుతున్నారు. ప్రతి పరీక్షలో మొదటి ర్యాంకు ఇద్దరిలో ఎవరు వస్తారో చెప్పడం కష్టం ఇద్దరూ పోటాపోటీగా చదవడమే కాదు, ప్రాణ స్నేహితులు కూడా. ఎప్పుడూ ఇద్దరూ కలిసి చదువుతూ, ఒకరి సందేహాలను మరొకరు నివృతి చేసుకుంటారు. కలసి ఆడతారు, పాడుతారు. కలసి భోంచేస్తారు. ఎవరి మధ్యనైనా వైరం వస్తే వాళ్ళిద్దరినీ కలిపేవారు. వారిద్దరి స్నేహం ప్రతి ఒక్క ఉపాధ్యాయునికీ ముచ్చట గొలిపేది. ఇదిలా ఉండగా ఆ తరగతిలోకి మాలిని అనే మరో అమ్మాయి కొత్తగా ప్రవేశించింది. తెలివైన అమ్మాయే కానీ, సహస్ర, తుషారల అంతా కాదు. అందుకే వారిద్దరి పైన మాలిని ఈర్ష్య పెంచుకుంది. వారిద్దరి చదువే కాదు, వారి స్నేహమూ మాలినిలో అసూయను పెంచింది. ఎలాగైనా వారిద్దరి మధ్య శత్రుత్వం పెంచాలని అనుకుంది. ఇద్దరితో ఎంతో తీయగా మాట్లాడటం ప్రారంభించింది. ఇంతమంచి స్నేహితురాలు ఎక్కడా దొరకదనేలా నమ్మించింది. క్రమంగా సహస్రపై తుషారకు, తుషారపై సహస్రకు చెడుగా చెప్పడం ప్రారంభించింది. ఇద్దరూ ఒకరినొకరు ఓర్వలేక ఒకరిపై మరొకరు దుష్ప్రచారం చేస్తున్నారట. ఇలా ఒకరిపై మరొకరికి చెబుతుంది. అయితే ఇద్దరూ నమ్మలేదు. పైగా మాలినిని చివాట్లు పెట్టారు. ఇలాంటి పిచ్చి పనులతో సమయం వృథా చేసుకోకుండా బుద్ధిగా చదువుకోమని హితబోధ చేశారు. వీళ్ళిద్దరిపై కోపం వచ్చింది మాలినికి. కొన్నాళ్ళు బాగానే ఉంది. ఈసారి పరీక్షలలో మొత్తం మార్కులు చూసుకుంటే ఇద్దరికీ సమానంగా వచ్చి, ఇద్దరూ ఆ తరగతి లీడర్స్ అయ్యారు. ఈసారి మార్కుల శాతం బాగా పెరిగింది. మాలిని సహస్ర వద్దకు వెళ్ళి "ఆ తుషార సంగతి తెలిసిందా! తనతో పాటు నీవు ఫస్ట్ రావడం ఓర్వలేకపోతుంది. తన జవాబు పత్రాలలోనే నువ్వు కాపీ కొట్టి, ఫస్ట్ వచ్చావని అందరికీ చెడు ప్రచారం చేస్తుంది. తాను చూపించకపోతే నీకు పాస్ మార్కులు కూడా రావట." అన్నది ‌. అప్పుడు సహస్ర ఇలా అంది. "దాని మొహం! నాతో కలసి కంబైన్డ్ స్టడీ చేయకపోతే దానికి అన్నీ సున్నా మార్కులే" అని. ఈ మాటలు తుషారకు చెబుతుంది మాలిని. ఇంకేం! ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి, కొట్టుకునే దాకా వచ్చింది. టీచర్లు వచ్చి ఇద్దరినీ తిట్టి గొడవ ఆపినారు. ఆ రోజు నుంచి తుషారకు, సహస్రకు మాటలు లేవు. టీచర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. తుషార మాలినిని పిలిచి, "నువ్వు సహస్ర వెంటనే ఉండు. ఆమె నా గురించి ఎక్కడెక్కడ ఏమేమి చెడు ప్రచారం చేస్తుందో గమనించి, నాకు చెప్పు‌" అన్నది. సహస్ర మాలినిని పిలిచి, తుషార వెన్నంటి ఉంటూ తుషార తన గురించి చేసే దుష్ప్రచారాన్ని చెప్పమన్నది. నిజంగానే సహస్ర, తుషారలు ఒకరి గురించి మరొకరు దుష్ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకేం! మాలినికి పండగే! ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ మోసుకుని వెళ్ళి చెప్పడమే సరిపోయింది. తరచూ తుషార, సహస్రల మధ్య గొడవలు రావడం టీచర్లు వచ్చి ఆపడం సరిపోతుంది. క్లాస్ టీచరుకి విసుగు వచ్చి, ఇద్దరినీ పక్కన పెట్టి, నైశిత అనే అమ్మాయికి లీడర్ బాధ్యతలు అప్పజెప్పారు. ఇద్దరికీ ఎన్ని గొడవలు వచ్చినా సహస్ర, తుషారల చదువులో ఏ మాత్రం మార్పు లేదు. మరింత బాగా చదువుతున్నారు. అనవసరమైన విషయాలలో తలదూర్చి, సమయాన్ని వృథా చేస్తున్న మాలిని చదువు పూర్తిగా తగ్గిపోయింది. వార్షిక పరీక్షలలో మాలిని ఫెయిల్ అయింది. లాస్ట్ వర్కింగ్ డే రోజు ప్రధానోపాధ్యాయులు గారు మాలిని తల్లిదండ్రులను పిలిపించారు. "మీ అమ్మాయిని తీసుకెళ్ళి వేరే పాఠశాలలో చేర్పించండి. చదువు రాని వారిని బాగుపరచవచ్చు. కానీ వచ్చిన చదువును పూర్తిగా చెడగొట్టుకునే వారిని భరించడం చాలా కష్టం. అసలే వచ్చే సంవత్సరం 10వ తరగతి. మీ అమ్మాయిని మా పాఠశాలలో ఉంటే మా రిజల్ట్ తగ్గుతుంది." అన్నాడు. అంత మంచి పాఠశాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేదు. మాలిని తల్లిదండ్రులు ఎంతో బ్రతిమాలారు. అయినా ప్రిన్సిపాల్ ససేమిరా అన్నాడు. టీ.సీ. రాసి ఇచ్చాడు. మాలిని తన తల్లిదండ్రులతో బయటకు వెళ్తుండగా సహస్ర, తుషారలు జోక్స్ వేసుకుంటూ నవ్వుకోవడం కనిపించింది. అప్పుడు మాలిని తోక తొక్కిన త్రాచు అయింది ‌. "ఆహా! నిన్ను పిచ్చిదాన్ని చేసి, మళ్ళీ ఇద్దరు శత్రువులు మిత్రులు అయినారు." అని మిథున అనే అమ్మాయితో అంది. అప్పుడు మిథున ఇలా అంది. "నీకు మాలిని అని కాదు మంథర అని పేరు పెట్టాల్సింది. అయినా వాళ్ళిద్దరూ శత్రువులు ఎప్పుడు అయ్యారు? ఇద్దరూ కలిసి నిన్ను పిచ్చిదాన్ని చేశారు. నువ్వు వచ్చిన కొత్తలో వాళ్ళను ఓర్వలేక ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. వాళ్ళు నిన్నే మంచిదారిలో పెట్టాలని చూశారు.మారవచ్చు కదా! కొన్నాళ్ళు బాగానే ఉన్నావు‌‌ . మళ్ళీ కుక్క తోక వంకర అన్ని చందంలా మళ్ళీ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూశావు. ఈసారి వాళ్ళు నాటకం ఆడి నీతో ఆడుకున్నారు.నీ వంకర బుద్ధికి తగిన శాస్తి జరిగింది." అని. ఇది విని మాలిని తల్లిదండ్రులు మాలినిని తీవ్రంగా మందలించారు. "ఇక నీకు చదువు అనవసరం. నీలాంటి వాళ్ళు మరి కొందరు తయారైతే ప్రపంచ యుద్దాలే వస్తాయి." అన్నారు. మాలిని సిగ్గుతో తలవంచుకుంది .


కామెంట్‌లు