మానేరు ముచ్చట్లు--మూడు నాలుగు రోజులుగా ఎనిమిదవ శతాబ్దం నుంఢి తొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధం దాకా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వేములవాడ చాళుక్యుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం.ఇక రెండవ బద్దెగుని కుమారుడు బద్దెగుని తరువాత క్రీ.శ. 966 లో గద్దెనెక్కాడు.ఇతడు క్రీ.శ.973 వరకు పరిపాలించాడు.మూడవ అరికేసరి ఒక జినాలయము నిర్మించినట్లు రేపాక శాసనములో నున్నది.ఇతని కాలమునకే మరియొక తామ్ర శాసనములో రేపాక ద్వాదశాం తర్గత వనికటుపల గ్రామముదానమి చ్చినట్లు ఉన్నది.అది బహుశః రేపాక సమీపమున గల వంతడుపుల అని ఇప్పుడు పిలువబడుతున్న గ్రామము కావచ్చును.అచ్చట ఒక ప్రాచీన దేవా లయమున్నదని తెలిసినది.దీనిని భావి పరిశోధకులు తెలుసుకోవలసి యు న్నది. అంతవరకు రాష్ట్రకూటుల అధీనములో నున్న వేములవాడ చాళుక్యులు క్రీ .శ. 973లో రాష్ట్ర కూటులనోడించి అధికార ములోనికి వచ్చిన కళ్యాణీ చాళుక్యవంశ స్థాపకుడురెండవతైలపుని అధీనంలోకి వచ్చారు.తైలపుడు ఆహవమల్లుడనే బిరుదు వహించి మాన్యఖేటము రాజధానిగా పరిపాలన సాగించాడు. మూడవ అరికేసరి తరువాత కూడా ఆవంశము వారుసామంతులుగా ఉండియుండవచ్చునని బి.ఎన్.శాస్త్రి గారు తమ వేములవాడ శాసనములు అనే పుస్తకములో తెలిపినారు.కాజీపేట దర్గా శాసనములో కాకతీయ మొదటి ప్రోలరాజు భద్రగుడిని పారద్రోలి నట్లు న్నదని అతడు ఈ అరికేసరి వంశవార సుడై యుండవచ్చు నని అంటే మూడవ బద్దెగుడై యుండవ చ్చునని అన్నారు. కాకతీయ మొదటి ప్రోలరాజు అంటే క్రీస్తుశకము 1052 నుండి 1076 వరకు గల ఆయన పరిపాలన కాలములో సబ్బిసాయిర ములో కొంత మేర కాకతీయుల అధీన ములోనికి వచ్చి యుండవచ్చును.అదే శాసనములో కల్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలలోక్యమల్ల మొదటి సోమేశ్వరుడు (1042-1048)ప్రోలుని సైనికసామ ర్థ్యము, రాజభక్తి, విశ్వాసములకు సంతసించి అనుమ కొండ విషయము ను (అప్పట్లో రాజ్యభాగ మును విషయ మని వ్యవహరించేవారు)ఏలుకొమ్మని ఇచ్చినట్లుగా పేర్కొన బడిం ది.అప్పటికి ఎలగందులకు ఏ ప్రాధా న్యత లేకపోవడమో లేదా సరియైన శాసనాధారాలు లేకపోవడమో గాని ఎక్కడా ప్రస్తావించబడలేదు.మంచి ధాన్యము పండించే గ్రామం అయి ఉండటం వల్లకావచ్చు బహుధాన్యపు రంగానే మిగిలిపోయింది.దీనినిలా ఉంచితే ఎలగందులకు అతి దగ్గరలో ఉన్న మరో చారిత్రక ప్రదేశం నగునూరు.ఎలగందులకుఇటువేముల వాడ ఎంతదూరమో అటు కరీంనగరు వైపు ఉన్న నగరూరు కూడా అంతే దూరంలో ఉన్నది.అప్పటికి నగరూరు కూడా ఒక పరిపాలనా కేంద్రము. నిన్న అరిపిరాల గురించి ప్రస్తావించిన శాసనములో నగరూరు అని ఉన్నది.ఆ నగరూరే ఈ నగరూరు అని జైశెట్టి రమణయ్య గారు తేల్చి చెప్పినారు కాని అరిపనపల్లిని అరిపిరాలగా చెప్పలే దెందుకనో. అప్పట్లో అరిపిరాల అంటే మానేరు ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లె.అరి శబ్దానికి శబ్దార్థ నిఘంటువులో మొదటి అర్థం కప్పము లేదా సుంకము అని ఉన్నది. రెండవ అర్థం శత్రువు అని. మానేరు ఒడ్డున ఉన్న ఈ పల్లె సబ్బిసాయిరానికి ఒక ప్రవేశమార్గ ము. కనుక బహుశః అక్కడ ‘అరి’అంటే సుంకము వసూలు చేసే ఏర్పాటు ఏదైనా ఉండియుండ వచ్చు. అలా అరిపనపల్లె లేదా అరిపి రాల అయి ఉండవచ్చు. కావాలన్న నియమేమీ లేదు.నగరూరు పేరు కాకతీయుల కాలంనా టి శాసనాలలో కూడా చెప్పబడింది.ఈ ప్రదేశం ప్రస్తుతం నగనూరు లేదా నగు నూరు అని పిలువబడుతున్న చిన్న గ్రామం. ఇది కరీంనగర్ నుండి లక్సెట్టి పేటకు పొయ్యే దారిలో కరీంనగర్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోఉంది. ఎల్గందల్ లాగా ఇది కూడా వైభవహీ నమై ఒకనాటి రాచరికానికి మిగిలిన ఆనవాలు లాగా ఉంది.అయితే ఇటీవల కరీంనగర్ పట్టణం అభివృద్ధి చెందు తున్న దశలో దాదాపు అక్కడి దాకా విస్తరిం చింది.ఇటీవల అక్కడే ప్రతిమా వైద్య కళాశాలతో పాటు పెద్దవైద్యశాల ఏర్పడడంతో ఆ ప్రాంత మంతా కళకళలాడుతూ ఉన్నది. కళ్యాణి చాళు క్యుల అధీనంలో సామంతులుగా ఉన్నవారిలో క్రీ.శ.1112లో ఒక శాసనము పండరాజు రవ్వీశ్వరాలయం కట్టించిన ట్లుగా తెలుపుతున్నది.నగునూరు లో అనేక దేవాలయాల శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి.ఇటీవల రోడ్డు ప్రక్కన ఉన్న శిథిలాలయాన్ని ఊరివైపుకు మార్చడం జరిగింది. ఇక్కడ కొంత కాకతీయుల చరిత్ర గురించి తెలుసుకుంటే గాని ముందుకు పోలేము. నా ముఖ్యోద్దేశం ఎలగందుల చరిత్ర తో ఎలగందులకు ముడిపడియున్న కొన్ని ముచ్చట్లు అవి ఇటు గ్రామానికి సంబంధించిన వైతే మరి కొన్ని ఎలగందుల జిల్లాకు సంబంధించినవి చెప్పాలని. ప్రస్తుతం చెప్పే ఈ ముచ్చట్లను తరువాత వీలైన చేట సవరించుకుంటాను. ఆదరిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు.- రామ్మోహన్ రావు తుమ్మూరి .


కామెంట్‌లు