ఉపాధ్యాయుని చేతిలో విద్యార్థుల భవిష్యత్తు ఆధార పడి ఉంటుంది. ఆ కారణంగా ఉపాధ్యాయుడు అనేక పుస్త కాలు చదవడం, పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా తెలియని విషయాలను ఎదుటివారి నుండి నేర్చుకోవడం ఉపాధ్యాయునిగా మనం చేయవలసిన పని. నా సర్వీసులో నేనువిన్న స్టాఫ్ రూం కబుర్లు గురించి చెప్పుకోవాలంటే విద్యార్థు లకు గానీ, ఉపాధ్యాయులకు గానీ పనికి వచ్చే కబుర్లు ఏదో ఒక ఇరవై అయిదు శాతం మాత్రమే ఉండవచ్చు. అవీకూడా కొన్ని చోట్ల ఉండవనే చెప్పుకోవాలి. ఎందుకలా చెబుతున్నానంటే మనలో చాలామందికి పనికిమాలిన గాలి కబుర్లు చెప్పుకోవడం, వినడంలో ఉన్న ఆనందం, ఆహ్లాదం,ఆశక్తి ఇంకా దేనిలోనూ పొందలేరేమో ననిపిస్తుంది. ఇదో వ్యసనం లాంటిది. ఈరకమైన దినచర్య వలన మనకు వచ్చే మంచిఏమీలేదు. ఇది మంచిని చేకూర్చదు. దీనినే good for nothing అంటారు. అది కొందరు మనుషులకు పట్టే జాడ్యం. ఇది మనిషికి పట్టిన కేన్సర్ లాంటిది. కొన్ని సమయాల్లో కేన్సర్ ను రూపుమాపొచ్చు.కానీ ఈ మనుషుల మనస్థత్వాన్ని మార్చలేం. కాలం వృధా చేయడమే అవుతుం ది. మనం ఏ వృత్తినైతే చేపట్టామో ఆ వృత్తిలో అభివృద్ధికి మెలకువలను నేర్చుకుంటే బాగుంటుంది. కానీ గాలి కబుర్లకు అలవాటు పడినవారు అదే తమ వృత్తిగా భావించి ఆ వృత్తికి జీవంపోయడానికి నిరంతరం కృషిచేస్తారు.వాళ్ళు బాగుపడరు. సమాజాన్ని బాగుపరచరు. ఇలా పనికిరాని కబుర్లాడడం రోణంకి మాష్టారుగారికి ఇష్టంఉండేది కాదు. గంటలకొద్దీ మాట్లాడేవారు. కానీ ఏదైనా సబ్జెక్ట్ గురించే ! నేను వాళ్ళ ఇంటికి నా ఫేమిలీతో అప్పుడప్పుడు వెళ్ళగలిగే వాడిని. దానికి కారణం వాళ్ళ అమ్మాయి మా స్కూల్ లో నేచురల్ సైన్స్ టీచర్ గా ఉండే వారు. ఆమె వలన మాష్టా రితో మొదటిలో పరిచయం ఏర్పడింది. మాష్టారు ఇంటికి వెళ్ళానంటే ఏదైనా సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడేవారు. నేను మొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళ్లిన కొత్తలో క్లియోపాత్ర గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకో రామాయణం అందులో సీత గురించి మాట్లాడటం ప్రారంభిం చారు మాష్టారు. అప్పటికి తెలుగు సాహిత్యంలో నేను చదివిన పుస్త కాలు ఏమైనా ఉన్నాయంటే చలం సాహిత్యం లో ఆనందం, విషాదం,సీత లాంటి కొన్ని పుస్తకాలు జంథ్యాల పాపయ్యశాస్త్రి, ఆరుద్ర, దాశరథి, విశ్వనాథ గారిలాంటి రచన లు శతక పద్యాలు ఏవో చదివానంటే చదివాను. అలానే రామాయణ, భారత,భాగవతాలలో నాన్నగారు చెప్పిన చిన్న చిన్న సంఘటనలు సినిమాలు చూసిన చౌ...చౌ... నాలెడ్జి తప్పిస్తే మాష్టారితో మాట్లాడేటంతటి స్థాయి నాలో లేదు. అది నాకు తెలుసు. రామాయణంలో సీత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో మాట కలపాలి కాబట్టి "మాష్టారూ ! ఎన్టీఆర్ నటించిన లవకుశ చూసారా? " అని అడిగాను. అలా అనేసరికి " సినిమాలు నేను ఎప్పుడూ చూడను. వాటిగురించి మాట్లాడను" అన్నారు. ఏం మాట్లాడాలో నాకు అర్థంకాలేదు. అప్పటి నుండీ నేను మాష్టారి ముందు సినిమాల గురించి ఏనాడూ మాట్లాడలేదు. పోనీ ఏదైనా పుస్తకం చదువుకు వెళ్లి దానిగురించి అతనితో మాట్లాడదామా అంటే తిరిగి అతనేం ప్రశ్నలు వేస్తారో తెలి యదు. అతను వేసే ప్రశ్నలకు నేను సమాధానంచెప్పగల నోలేదో అంతకన్నా తెలియదు. అప్పటి నుండీ అతను చెప్పేది ఆలకించడం, డౌట్ వస్తే అడగడం ఒక్కటే నేర్చుకున్నాను. "టీచర్ అన్నవాడు నిరంతర పాఠకుడవ్వాలయ్యా" అనేవారు. మాష్టారు ఎం.ఆర్.కాలేజీలో ఆంగ్లభాష అధ్యాప కునిగా పనిచేసి రిటైర్ అయ్యారు. అతని మేథశక్తిని మెచ్చి ఆంధ్రా యూనివర్సిటీవారు ఎమిరిటస్ ప్రొఫెసర్ గా పోష్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల బోధనకునియమించిగౌరవించారు. మాష్టారి వేషభాషలు బ్రిటిష్ దొరలను పోలిన హ్యాట్, టక్, నిరంతరం (నిద్రలో , కాలకృత్యములందు మినహా ) చేతిలో పుస్తకం ఉండేది. న్యూస్ పేపర్ కొంటే డబ్బులు అయిపోతాయనుకున్న శాల్తీలు ఉన్న ఈరోజుల్లో 16,17 ఖరీదైన ఐరన్-గ్లాసు బీరువాలలో పుస్తకాలు తన ఇంట్లో కలిగి ఉండటంసామాన్య విషయంకాదు. పుస్తకాలు సేకరించడం,నిరంతర పాఠకుడుగా మారడం తనను చూసి నేర్చుకున్నవే అయినా నేను చేసే ప్రయత్నం మాష్టారు చేసిన కృషిలో అణువంతకూడా కాదేమో ! నేను చేసుకున్న అదృష్టమేమిటంటే ఉద్యోగంలోచేరిన మొదటి రోజుల్లోనే మాష్టారి సాహచర్యం లభించడం వలన అనేక పుస్తకాల సేకరణ చేయగలిగాను, చాలావరకూ చదువగలిగాను. చదివింది నాకు, నా విద్యార్థు లకు, తోటి ఉపాధ్యాయులకు సహాయ పడింది. ప్రజలలో ఉపాధ్యాయునిగా గౌరవాన్ని తెచ్చిపెట్టి విద్యాసంబంధమైన అనేక కార్యక్రమాల విజయవంతం అయ్యేటందుకు తోడ్ప డింది. (సశేషం) శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి, ఫోన్: 7013660252.


కామెంట్‌లు