అబ్బో!! ఎన్ని ఆటలో!!!-- జ్యోతి వలబోజు --ఆటలు మనిషికి ఉత్తేజాన్ని ఇస్తాయి. మానసికంగానూ, శారీరకంగానూ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కాని ఈ రోజుల్లో పిల్లలకు ఆటలకు అస్సలు టైం ఉంటుందా? పుట్టగానే స్కూల్లో రిజిస్టర్ చేయించాలి. రెండేళ్లు నిండగానే స్కూల్లో వేయాలి. ఇక చదువుల పరుగు మొదలు. మాటలు కూడా రాని పసివారు మార్కుల కోసం కష్టపడుతున్నారు. అన్ని స్కూళ్లలో ఆటలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, సదుపాయాలు ఉంటున్నాయో లేదో. ఈ రోజుల్లో ఎక్కువగా వినిపించేది,కనిపించేది క్రికెట్టు, ఆనంద్ గెలిస్తే చదరంగం, లేదా బ్యాడ్మింటన్. పిల్లలకైతే చిన్ని చిన్ని వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, లేదా మొబైల్ గేమ్స్. ఇవేనా ఆటలంటే. ఆఫీసు నుండి అలసి వచ్చిన మా అమ్మాయి అలసట తీరడానికి తన మొబైల్ లో ఏదో గేమ్ ఆడుతుంటే చూసి నాకు కలిగిన ఆలొచనలే ఈ టపా.1. చిన్నగా ఉన్నప్పుడు తన పనిలో అడ్డం పడకుండా ఉండటానికి అమ్మ కాగితంతో బాల్ చేసి దానికి దారం చుట్టి ఇచ్చేది. నిజం బాల్ ఐతే దెబ్బలు తగులుతాయి. లేదా ఇంట్లో వస్తువులు పగలొచ్చు కదా. అప్పట్లో ఈ క్యారీబ్యాగులు గట్రా లేవు. దుకాణంలో ఏది కొన్నా పేపర్లో పొట్లం కట్టి దారం చుట్టి ఇచ్చేవారు. ఎక్కువ బరువు ఉంటే సంచీలు ఉండేవి లెండి. ఆ కాగితాలు, దారాలు ఇలా పనికొచ్చేవన్నమాట.2. మా తమ్ముళ్లయితే బయట ఆడుకోవడానికి వెళ్లేవారు, నాకు అమ్మాయిలు ఎక్కువగా స్నేహితులు ఉండేవారు కాదు మొదటినుండీ. అంతలా ఐతే మా తమ్ముళ్లు, వాళ్ల స్నేహితులతోనే ఆడుకునేదాన్ని. ఒక్కదాన్ని ఉంటే ఎక్కువగా ఆడుకునేది గచ్చకాయలు. ఎక్కడ నున్నటి రాళ్లు కనపడినా ఎత్తుకొచ్చేయడమే నా పని. వాటిని నునుపు చేసి ఒకే సైజులో తయారు చేసుకుని గచ్చకాయలు ఆడుకునేదాన్ని. అప్పుడప్పుడు మా అమ్మ కూడా నాతో కలిసేది. లేదా ఎవరైనా చుట్టాల అమ్మాయిలు. అసలైతే గచ్చకాయలు చెట్టు మీది కాయలు. కాని అవి సిటీలో ఎక్కువగా దొరికేవి కాదు. అందుకే రాళ్లతో ఆడుకోవడం. ఈ గచ్చకాయలతో ఎన్నో రకాల ఆటలు మా అమ్మమ్మ నేర్పించింది.3. ఇక స్కూళ్లో బోర్ కొడితేనో, టీచర్ రాకుంటేనో ఇద్దరు ముగ్గురు ... ఇంకా ఎక్కువమంది కూడా ఒక చోత చేరి ఆడుకునే ఆట Name, Place, Animal and Thing ఒకే అక్షరంతో అందరూ ఇవన్నీ రాయాలి. ఆటకు ఆట, చదువుకు చదువు అయ్యేది. కొత్త పదాలు కూడా తెలిసేవి. ఎవ్వరితో కలవని పదం రాస్తే ఐదు మార్కులు. ఇలా చివర్లో గెలిస్తే ఎంత ఆనందమో. కాని నోట్‌బుక్ లోని పేపర్లు చింపాల్సి వచ్చేది. తర్వాత ఎవ్వరికీ కనపడకూడదు కదా.4. ఇది అందరికి తెలిసిన ఆటే మూడు నిలువు, అడ్డం గళ్లు గీసి చుక్కలు, నక్షత్రాలు పెట్టి ఆడుకునే ఆట. త్వరగా అవుతుంది. కాని తెలివి ఉపయోగించే ఆట. ఇలా పేజీ నిండా గీతలే.. 5. ఇప్పుడు పిల్లలకు స్కూలు ఉన్నా లేకున్నా ఒకటే. ఆదివారాలు కూడా ఖాళీగ ఉండనివ్వకుండా చేస్తున్నాయి ఈనాటి చదువులు. శనివారం సగంపూట బడులు అయ్యాక పిల్లలకు ఆటవిడుపుగా ఉండేది. కాని ఆదివారం త్వరగా గడిచేది కాదు. స్కూలు వర్క్ అంతా శనివారం సాయంత్రమే ఐపోయేది. అప్పుడు టీవీలు లేవు, రేడియో వినడం అంత అలవాటు లేదు. చందమామ , కథల పుస్తకాలు గంటలో చదవడం ఐపోయేది. ఏం చేయాలో తోచక ఇంట్లో ఏదో ఒక ఖాళీ పూల కుండీ తీసుకుని మట్టి అంతా పెళ్లగించి అమ్మనడిగి త్వరగా మొలిచేది మెంతులు అని తెలుసుకుని అవి అందులో వేసి నీళ్లు పోసి మరుసటిరోజు నుండే చెట్లు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూడడం. కాని రెండోరోజు పొద్దున్న లేచి మొహం కూడా కడుక్కోకుండా వెళ్లి చూస్తే చిన్ని చిన్ని మొలకలు కనిపించేవి. అప్పుడెంత సంతోషమో. అవి చాలా త్వరగా పెద్దవవుతుంటే చూసి మురిసిపోవడం. అమ్మ కొనే ఆకుకూర మేము పెంచాము అని. చిన్ని కుండీలోని ఆ మెంతి చెట్లను చూస్తుంటే ఏదో పదెకరాలా వరితోట ఆసాముల్లా ఫీల్ అయ్యేవాళ్లం నేను, నా తమ్ముళ్లు. నాలుగో రోజు అవి పప్పులోకో, కూరలోకో వెళ్లిపోయేవి, కొత్తిమిర ఎలా వస్తుంది అని తెలుసుకుని ధనియాలు వేసేవాళ్లము అప్పుడప్పుడు. అవేమో తీరిగ్గా నిక్కుతూ నీలుగుతూ ఐదురోజుల తర్వాత కాని కనపడేవి కావి. విసుగొచ్చేది ఎదురుచూడలేక. అమ్మ చెప్పేది ధనియాలు చెప్పుతో రాసి మట్టిలో పాతితే కాని మొలకెత్తవు అని. నిజమే కామోసు అని నమ్మి అలాగే చేసేవాళ్లము..6. కిరాణా దుకాణాల్లొ తూకం వేసే తక్కెడ అంటే మహా క్రేజ్ గా ఉండేది. అది కొనాలంటే బోలెడు ధర. కొనమందామంటే ఇంట్లో పనికొచ్చే వస్తువు కాదు. ఏం చేద్దామా అని ఆలోచించి. మా పిన్ని సలహాతో ఆమె దగ్గరున్న అమూల్ పాలడబ్బాల సత్తు మూతలు తీసుకుని వాటికి మూడు వైపులా రంధ్రాలు చేసి దారం కట్టి, ఆ రెండు మూతలను ఒక లావాటి చీపురు పుల్లకు కట్టి , మధ్యలో పట్టుకోవడానికి లావాటి దారం కట్టి తక్కెడ తయారు చేసుకునేవాళ్లం, ఇక మాకంటూ ఒక దుకాణం పెట్టుకునేవాళ్లం. వంటింట్లోంచి పప్పులు, శనగలు లాంటివి తెచ్చుకుని చిన్న చిన్న వెడల్పాటి రాళ్లను తూకం రాళ్లుగ వాడుకుని దుకాణం ఆట ఆడుకునేవాళ్లం . ఇక డబ్బులు అంటే కాగితం ముక్కలపై నంబర్లు వేసుకుని అవే రూపాయలు, పైసలు. భలే ఉండేది ఈ వ్యాపారం.7. ఇక అమ్మమ్మ, నాన్నమ్మ వస్తే అష్టాచేమ్మా, పచ్చీస్ ఆడడం. అష్టాచెమ్మా అంటే ఒక బలపం తీసుకుని నేలపై గళ్లు గీసి , చింతగింజలను రెండు ముక్కలుగా చేసుకుని పావులుగా వాడుకునేవాళ్లం. పచ్చీస్ ఐతే ఎక్కువ గళ్లు ఉండేవి కాబట్టి నేలమీద గీసే చాన్స్ లేదు. దానికోసం ప్రత్యేకంగా బట్టపై కుట్టేవాళ్లు, లేదా పూసలతో అల్లేవాళ్లు, దానికోసం చెక్కపావులు, గవ్వలు ఉండేవి. వాటినన్నింటిని ఒక సంచీలో కాని , డిబ్బీలో కాని వేసి దాచేది అమ్మ. ఒక్క పావు పోయినా ఆట వీలు కాదుగా.8. ఇంట్లోనే హాయిగా ఆడుకునే మరో ఆట కైలాసం. అంటే పరమపదసోపనం అని కూడా అంటారు. snakes and ladders అనేది అదే. కాని అందులో ఒక పెద్ద కాగితం ఉంటుంది. దానిపై నిచ్చెనలు, పాములు, మధ్య మధ్యలో ఏవో గ్రహాల పేర్లు అవి ఉండేవి. ఈ ఆటలో మోసం చేయ్యవద్దు అనేవారు. నిజాయితీగా ఆడకుంటే పాము మింగేస్తుంది అనే భయం పెట్టేవాళ్లు పెద్దవాళ్లు. ఆ కాగితాన్ని కూడా మామూలు కాగితంలా కాకుండా ఒక పవిత్రమైన వస్తువుగా జాగ్రత్తగా ఉంచేవాళ్లు. ఇందులో ఎంతమందైనా అడే వీలుండేది. తిరుపతి, కాలహస్తి, లేదా శ్రీశైలం వెళ్లినప్పుడల్లా ఈ ఆట కాగితాన్ని తప్పకుండా కొనేది అమ్మ.9. ఇక ఆడపిల్లలకు చిన్నప్పటినుండే వంటపై మక్కువ ఉండేదేమో. తిరుపతి , అలమేలు మంగాపురం వెళ్లినప్పుడల్లా అమ్మ నా కోసం చెక్కతో చేసిన వంట సామాన్లు కొనేది. అవి ఒక అందమైన వెదురు బుట్టలో ఉండేవి. ఆడుకున్న తర్వాత అందులోనే దాచుకోవడం. అన్ని గిన్నెలు వరుసగా పెట్టుకుని అమ్మ చేసినట్టే పొయ్యి పై గిన్నెలు పెట్టి అన్నం పప్పు చేయడం. బాణలి పెట్టి పూరీలు, పెనం పెట్టి చపాతీలు చేయడం. ఇలా సాగేవి మా ఆటలు. మా తమ్ముళ్లేమో త్వరగా పెట్టు ఆకలవుతుంది అని సతాయించేవాళ్లు. ఇప్పటికీ యాత్రాస్థలాల్లో అరుదుగా కనిపించే ఈ బొమ్మలను చూస్తే అదో త్మధురమైన అనుభూతి కలుగుతుంది. మా అమ్మాయికి చిన్నప్పుడు కొనేదాన్ని. కాని అప్పటికే స్తీల్ వంట సామాన్లు వచ్చాయి.11. ఆడుకోవడానికి పనికిరాని వస్తువేదాఇనా ఉందా ? ఇసుక కనిపిస్తే చాలు దానితో గూళ్లు కట్టడం, కాగితాలు , చెట్టుకొమ్మలు పట్టుకొచ్చి పెట్టడం, లేదా ఆ ఇసుకలో అగ్గిపుల్లలు పెట్టి వెతుక్కునే ఆట అందరికి తెలిసిందే కదా. మంచి టైంపాస్ అవుతుంది ఈ ఆటతో.12. ఇక పెద్దా చిన్న అని తేడా లేకుండా వరుసగా కాళ్లు చాపుకుని కాళ్లాగజ్జె కంకాళమ్మా ఆడడం కూడా ఒక సరదా. ఈ పాటలో కూడా ఆరోగ్య రహస్యం ఉందంటారు పెద్దలు.13. ఇంట్లోనే ఉండి ఆడుకునే మరో ఆట . గుజ్జనగుళ్లు. తెలంగాణాలో ఒనగండ్ల ఆట అంటారు. దీనికి ప్రత్యేకంగా తయారు చేసిన పీట ఉంటుంది. చెక్కతో కాని, స్టీలుతో కాని చేసి ఉంటుంది. రెండువైపులా ఎదురెదురుగా పదేసి గుండ్రటి గళ్లు ఉంటాయి. ఆటగాళ్లు ఎదురెదురుగా కూర్చోని చింతగింజలు, లేదా సీతాఫల గింజలు ఆ గళ్లలో వేసి గవ్వలు లేదా పావులతో ఆడతారు. ఇది తెలివిగా ఆడితే ఎదుటివారి గింజలన్నీ సంపాదించుకోవాలి. ఇందులో కూడా రెండు మూడు రకాల ఆటలు ఉన్నాయి. ఆడుతుంటె సమయమే తెలీదు. వేసవి సెలవుల్లో మంచి కాలక్షేపం.14. ఇక అప్పట్లో పిల్లలు ఎక్కడికెళ్లినా ఏది కనపడినా ఆటాడుకోవడానికి పనికొచ్చేలా చేసుకునేవాళ్లు. అలాంటిదే స్తంభాలట. ఎక్కువగా గుడిలోనే కదా స్తంబాలు కనపడేది. ఒక్కోరు ఒక్కో స్తంభం ఎంచుకుని దొంగకు దొరకకుండా స్తంభాలు మారడం. మధ్యలొ దొరికిపోతే వాళ్లే దొంగలు మళ్లీ. స్తంభాలు పట్టుకుని అలా ఊగుతూ తిరగడం భలేగుండేది.15. నాకు ఎక్కువగా ఇష్టమైన ఆటలు స్కూలులో ఐనా, బయట ఐనా. రింగ్, త్రోబాల్. రింగ్ ఐతే ఇంట్లో అమ్మతో ఎక్కువగా ఆడేదాన్ని. ఈ ఆటల వళ్ల మంచి వ్యాయామం అయ్యేది. ఆకలయ్యేది కూడా.16. ఇక ఇద్దరమ్మాయిలు కలుసుకుంటె తప్పక ఆడేది ఒప్పుల కుప్ప ఆట. రెండుచేతులు పట్టుకుని గుండ్రంగా తిరగడం. ఈ ఆటలు చేతులు వదిళేస్తే దెబ్బలు తగలడం ఖాయం. అందుకే కాళ్లు నేలకు గట్టిగా పట్టి ఉంచే చేతులు విడిపోకుండా పట్టుకుని ఎంత స్పీడుగా తిరిగితే అంత మజా. అప్పుడప్పుడు ఒక చేయి వదిలేసి తిరగడం, లేదా కూర్చుని లేస్తూ తిరగడం. దీనికి ఎంతో చాకచక్యం, నేర్పు ఉండాల్సిందే.18. మరో ముఖ్యమైన ఆట తాడాట. స్కిప్పింగ్. నా చిన్నప్పుడు రెండువైపులా రంగు రంగుల చెక్క హ్యాండిల్లతో చేసిన తాళ్లు దొరికేవి . ఇప్పటిసంగతి తెలీదు మరి. వయసు బట్టి తాడు సైజు వేరువేరుగా ఉండేది. దానితో కూడా ఎన్నో ఆటలు. ఒక్కరు , ఇద్దరు, లేదా గుంపులుగా రకరకాల ఆటలు . ఇప్పుడేమో బరువు తగ్గడానికే వాడుతున్నారు . చిన్నపిల్లలకు ఐతే చాలా మాందికి దీనిగురించి తెలుసో లేదో. తెలిసినా ఆడే టైం లేదు చదువుకోవాలి అంటారు.19. ఇక చెమ్మచెక్క ఆట తెలియనిదెవ్వరికి. నిజంగా అప్పట్లో ఎటువంటి ఉపకరణాలు లేకుండా చేతులతో, దొరికిన వస్తువులతో ఎన్నో ఆటలు ఆడేవాళ్లు పిల్లలు. 20. ఈ ఆట గుర్తుందా ఎవరికైనా. రెండుచేతులను నేలపై బోర్లా పెట్టి , చిటికెన వేలునుండి abcd అని లెక్కపెట్టుకుంటూ ఆడేవాళ్లు. డి తర్వాతి వేలు లోపలికి మడిచేయాలి. చివరిదాకా ఎవరుంటారో వాల్లే విజేతలు. ఎటువంటి చప్పుడు లేకుండా ఆడుకోవచ్చు. 21. కాస్త పెద్దయ్యాక చదరంగం ఆడేవాళ్లం. దీనికోసం ఐతే చాలా సమయం పట్టేది. ఏదైనా ఆలోచించి ఎత్తు వేయాలి కదా. నేను మా చిన్నతమ్ముడు బానే ఆడేవాళ్లం . పెద్దతమ్ముడే , .. ఓడిపోతున్నానుకున్నప్పుడు బోర్డ్ ఎత్తేసేవాడు. ఇక ఇద్దరు తమ్ముళ్లు కొట్టుకోవడం. కంప్యూటర్లో కూడా చదరంగం ఆడొచ్చు కాని నాకు నచ్చదు.22. నక్షత్ర ఆకారంలో ఉండే చైనీస్ చెక్కర్, పచ్చీస్ లాంటిదే లూడో ఆట, బ్యాంకులు, ఉత్తుత్తి నోట్లు, కొనుగోళ్లు , అమ్మకాలు నేర్పే బిజినెస్ ఆట. అలా ఎన్నో ఆటలు.23. అమ్మ ఆడుకోవడానికి, చదువుకోవడానికి అన్నీ కొనిచ్చేది కాని పేకాట కార్డులు మాత్రం ముట్టుకోనిచ్చేది కాదు. కాని ఎప్పుడైనా ఆడేవాళ్లం . అదేంటో తెలుసా. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని, సగం సగం కార్డులు పంచుకుని , ఒక్కొక్కటి వేస్తు రెండింటి గుర్తులు కలిస్తే వాళ్లు ఆ కార్డులన్నీ తీసుకోవడం. ఇలా మొత్తం కార్డులన్నీ ఒకరి దగ్గర చేరేవరకు ఆట కొనసాగేది. అమ్మ చూసినా ఏమనేదికాదు. సో హ్యాపీ.ఇలా అందమైన ప్రకృతిలో చిన్ని చిన్ని వస్తువులతోనే ఎన్నో ఆటలు ఆడేవాళ్లం. నిజంగా అదో మరపురాని కాలం. మళ్లీ ఆ రోజులు వస్తాయో లేవో. ఆటలు కూడా యాంత్రికమైపోయాయి. కొన్నైతే మరీ దారుణం. యుద్ధాలు, దయ్యాలు.. పిల్లల చదువులు చెడిపోతాయి. కంటి చూపు పాడవుతుంది. ఆలోచనాశక్తి కూడా మారుతుంది. ప్చ్.. ఏంటో మరి !!!!


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం