ఆయన రాశారు -మనం రాయలేదంతే--నేను చాలా పుస్తకాలు కొన్నాను. కొన్ని పుస్తకాలు కొట్టేశాను. కొన్ని పుస్తకాలు కొందరిచ్చారు. వెరసి నా దగ్గర పుస్తకాలు బాగానే ఉన్నాయి. కానీ నా దగ్గర ఇప్పుడు మిగిలినవి కొన్ని పుస్తకాలే. వాటిలో అన్నీ చదివినవే. చదవనివంటూ లేదు. కానీ ఫలానా పుస్తకంలో ఏముందని అడిగితే చెప్పలేను. నాకు జ్ఞాపకశక్తి తక్కువ అనేకన్నా అసలు లేదనేదే వాస్తవం. కానీ కంటపడి మళ్ళీ చదవడం మొదలుపెడితే ఆ పుస్తకంతోపాటు అదెలా నా అల్మరాలో చోటు చేసుకుందో చెప్పగలను. అలా ఇప్పుడో పుస్తకాన్ని తీశాను. అది ఎనభై పేజీల చిన్న పుస్తకం. నాకత్యంత ప్రియమైనది. ధర మూడు రూపాయలే కానీ నేనీ పుస్తకం కొన్నది కాదు, సీనియర్ పాత్రికేయులు జి. కృష్ణగారి నుంచి సంగ్రహించాను. పుస్తకం పేరు "తేజోరేఖలు" రచయిత సంజీవ దేవ్ గారు (తుమ్మపూడి). నాకెంతో ఇష్టమైన రచయితలలో ఈయనొకరు. ప్రతి పుస్తకం పురుడు పోసుకోవడానికి ఏదో కారణం ఉండి తీరుతుంది. అలాగే తేజోరేఖలుకూడా ఎలా పుట్టిందో సంజీవ దేవ్ గారి మాటల్లోనే చూద్దాం..."ఈ రేఖల ఆవిర్భావానికి ఒక చిన్న నేపధ్య గాథ వున్నది. ఆంధ్ర విశ్వవిద్యాలయపు ఇంజనీరింగ్ కాలేజీలో రీడర్ గా వుంటూన్న బావ వేణుగోపాలరావు (అక్క కృష్ణాబాయి భర్త) అమెరికాలో వుండి నాకో మంచి బొమ్మల డైరీ పంపటం జరిగింది. దానిలో నేను ఇంగ్లీషులో కొన్ని భావాలు అప్పుడప్పుడు వ్రాసుకొంటూ వచ్చాను. ఈ తేజోరేఖలు నా స్వంత ఇంగ్లీషు నుంచి నేను చేసుకొన్న ఛాయారూపాలు. అందుకే ఇందులోని వాక్యనిర్మాణంలో తెలుగు నుడికారం పూర్ణానుస్వారమే" అని.ఈ తేజోరేఖలు భారతి మాసపత్రికలో ధారావాహికంగా వెలువడ్డాయి. దేశీ బుక్ సంస్థ వారు 1965 లో అచ్చొత్తించి పాఠకలోకంపై తేజోమయమైన రేఖలు ప్రసరింపచేశారు. స్థలంలో మనం వెనక్కుపోగలం కాని కాలంలో వెనక్కు పోజాలం. మన స్మృతులలో మాత్రమే మనం కాలంలో వెనక్కు పోగలమన్న సంజీవ దేవ్ "తెలుసుకోటానికంటే అనుభూతి చెందటం జీవితంతో ఎక్కువ సన్నిహితమై ఉంటుంది" అని అనేదానితో మనం ఏకీభవించక తప్పదు. తెలుసుకోవడం కన్నా అనుభూతికే దగ్గరవగలం. తెలుసుకోవటమనేది ఒట్టి సమాచారమే. ప్రేరణ కల్గించడం అనుభూతికే సాధ్యం. నిరీక్షణ గురించి చెప్తూ 1962 నవంబర్ 17 వ తేదీన ఆయన నిరీక్షణ వాస్తవరూపం దాల్చటాన్ని గుర్తు చేసుకున్నారు. అదేంటంటే, ఆరోజు ఆయన ఆల్డస్ హక్స్ లీ నుంచి తప్పకుండా ఉత్తరం వస్తుందని గట్టిగానే నిరీక్షించారు. అందుకని ఆయనకు తన ఉత్తరంతోపాటు పంపేందుకుగాను సూక్ష్మ రూపాలలో కొన్ని ప్రకృతి దృశ్యాలను నీటి రంగుతో చిత్రించారు. ఆశ్చర్యం. ఆయన వాటిని ముగించారో లేదో హక్స్ లీ నుంచి ఆయన అనుకున్నట్టే నిరీక్షించినట్టే ఉత్తరం అందింది. ఇలాంటి నిరీక్షణనకు ఆయన దివ్య నిరీక్షణ అని పేరుపెట్టారు. చాలా మంది జీవితాలలో ఇలాంటి నిరీక్షణలు తక్కువగానే ఉంటాయని, తక్కువ మంది జీవితాలలో ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఇంతకూ ఈ ఆల్డస్ హక్స్ లీ ఎవరంటే పరిచయం అవసరంలేనంత విఖ్యాతుడు. మంచి నవలాకారుడు. కవి. నాటకకారుడు సమీక్షకుడు.దార్శనికుడు. ఇలా ఒకటేంటీ ఎన్నింటిగానో జీవించిన మహనీయుడే హక్స్ లీ. కొంతకాలం చిత్రాలు కూడా గీసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే హక్స్ లీ విశ్వ సంస్కృతికి సజీవమూర్తి. పుట్టింది ఇంగ్లండ్ లో అయినా నివసించింది మాత్రం అమెరికాలో. లేఖల్లో సంజీవ దేవ్ పుస్తకం 1962 నవంబర్ 19వ తేదీన హక్బ్ లీకి రాసిన ఉత్తరంతోనే మొదలైంది. మేఘాలు, తుఫాను, ఉరుములు, వర్షం, ఇంద్రధనువు, మెరుపులు ఎంతటి భయాన్ని కలిగిస్తాయో అంతటి ఆనందాన్నీ ఇస్తాయంటారు సంజీవ దేవ్. మనిషి ముఖాకృతిని మార్చగల శక్తి మానసిక భావ తీవ్రతకు ఉందని ఎంత చక్కగా చెప్పారో... వేసవిలో వర్షంచలికాలంలో ఎండాఉదయాన మంచూసాయంత్రం ధూళీ శరత్ లో చంద్రుడూ వసంతంలో చెట్లూచూడటానికి ఆనందమయంగా ఉంటవన్న "తేజోరేఖలు" లో ఆయన భావనలన్నీ మనకూ కలుగుతుంటాయి. కానీ చెప్పడంలోనే తేడా అంతా. ఊహలతోనే కాదు మాటల వాడకంతోనూ ఆయన శైలి ఏ మాత్రం మనసున్న వాడినైనా ఇట్టే ఆకట్టుకుంటుందనడం అతిశయోక్తి కాదు. ఏదెలాగున్నా ఓ మంచిపుస్తకం చదివామన్న ఆనందం కలుగుతుంది మనసుకి. అందుకేసంజీవ దేవ్ గారూ, మీకు జోహార్లు!!- యామిజాల జగదీశ్


కామెంట్‌లు