చీర కట్టుకు ఫిదా అయిపోయా!--ప రికిణీ ఓణీలో కనిపించే అమ్మాయిలంటే ఎంతిష్టమో అంతకు రెట్టింపిష్టం చీరకట్టులో ముస్తాబైన మగువను చూడాలంటే. చీర మాట స్ఫురణకు వచ్చినప్పుడల్లా ఎప్పుడో ఎక్కడో నేను రాసుకున్న కవితొకటి గుర్తుకొస్తోంటుంది.... "నువ్వు చీరలో వస్తుంటే దారిపొడవునా నిన్ను చూసిన వారందరూ శిలలై నిల్చుండిపోయారు! చీరను కట్టుకున్న సంతోషం నీ ముఖంలో చూసాను! నిన్ను కట్టుకున్న సంతోషం చీరంతటా చూసాను! ఇంకా ఎందరి హృదయాలను లేలేత దూదిపిందలల్లే మార్చబోతున్నావో కదూ నీ చీరకట్టులోని అందమైన నవ్వుతో!! చాలమ్మాయి, చాలిక, ఇక లేదు నా దగ్గర కోల్పోయేందుకు మరొక హృదయం....!! నీ చూపులు చీరందంతో పోటీ పడి జరిపే నాటకానికి కిందా మీదా అయిపోయేది నా హృదయమేగా!! అర క్షణంలో పడిపోతాను చీరకట్టులో నిన్ను చూసినప్పుడల్లా!! ఎందుకిలా అనుకుంటున్నానో తెలుసా నీకు నన్ను నేను మరచి...? నేను నాదేనని అనుకున్న మనసుని నీ చీరకట్టుతో నీ వెంటే తీసుకుపోతున్నావు అప్రమేయంగా!! అంతెందుకు ఓమారడిగావు గుర్తుందా "ఈ చీర నాకు బాగుందాని?" అప్పుడు నేనిలా అన్నాను... "బాగుండటమేంటీ, చీర కట్టులో మాత్రమే నీ అందమంతా అందిస్తున్నావు నాకు" అని! అవును, చీరకున్న శక్తి,.ఆకర్షణ అలాంటిది! శ్రీమతి జ్యోతి వలబోజు గారి ప్రేరణతో "సరదా శతకం"గా బ్నింగారు పాఠక లోకానికి అందించిన "చీర పజ్యాలు" మళ్ళీ చదివానిప్పుడు. పరికిణీ మీద కవితలు రాసిన "పరికిణీ వాలా" తణికెళ్ళ భరణిగారు "చీరని ఉతికి ఆరేయకుండా, చీరని చిరాకు పడే వాళ్ళని ఉతికి, చీరకి కుచ్చిల్లు పెట్టిన బ్నింగారికి "త్రీ ఛీర్స్" అనడం పట్టుచీరకున్నంత అందంగా ఉంది.బ్నింగారు మాటలతో మురిపిస్తారు. మరిపిస్తారు. ఓసారి ఆయనతో పరిచయమైతే మళ్ళీ మళ్ళీ ఆయన మాటలు వినడానికి మనసు ఉవ్విళ్ళూరుతుంంటుందనడం అతిశయోక్తి కాదు. తల్లావజ్ఝల లలితాప్రసాద్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్న మరుక్షణమే బ్నింగారికి ఫోన్ చేసి అడ్రస్ అడిగి వారింటికి కలియడంతో మా మధ్య పరిచయం శ్రీకారం చుట్టుకుంది. అదిప్పటికీ హాయిగా ఆనందంగా కొనసాగుతోంది."చీరపజ్యాల" రచనా శతకానికి శతక లక్షణమైన "మకుటం" లేనందువల్ల దీనిని శతకమనలేమని, కనుకే "సరదా శతకం"గా బ్నింగారు పద్యాల నడకను చదివి తరించవచ్చన్న డా. అక్కిరాజు సుందర రామకృష్ణగారి మాట అక్షరసత్యం."ఫెమినిస్టుని కాదుగానీ ఫెమిన్ ఇష్టున్ని అని చెప్పుకున్న బ్నింగారికి స్త్రీత్వం మీద విపరీతమైన ఇష్టమూ! గౌరవమూ!! చీరలంటే ఇష్టమున్న బ్నింగారు తమ ముందుకు అమ్మాయిలు మోడ్రన్ డ్రస్సులు వేసుకుని రావడానికి భయపడేలా మాత్రం నిక్కచ్చిగా చెప్పేస్తారు. తన సరదా శతకంలో కొన్ని పద్యాలు పేలాయని, కొన్ని పెట్రేగాయని చెప్పినప్పటికీ చీరందంలోని సొగసుని చాటి చెప్పడానికి బ్నింగారి శైలితో, భావంతో ఏకీభవించని వారుండరు. "బాపూ రమణల సినిమాల్ చూపెట్టును తెలుగుతనము జూమ్ షాట్లలోఆ పిక్చర్లో తరచుగ ఓ పాటనొ సీనులోనొ ఒదుగున్ చీరే!" అంటూ మొదలుపెట్టిన చీరపజ్యాల శతకాన్ని "చీరలపై శతకాన్ని వెరెవ్వరు రాయలేదు వింతే కాదా వారెవ్వా! నా బ్రైన్ లో ఊరించే చీర మడతలున్నా యింకాన్" తో ముగించారు.. ఇందులోని ప్రతి పద్యమూ చదివి ఆర్థం చేసుకోవడానికి శబ్దరత్నాకరమో శబ్దార్ద చంద్రికో లేక మరే నిఘంటువో అవసరం లేదు. అన్ని మాటలూ మన చుట్టూ మనతో మనలో ఉన్నవే. కనుక వాటిని చదువుతున్న కొద్దీ చీరకట్టుకున్న ప్రాధాన్యం విదితమవుతుంది. వారంరోజుల్లో ఈ చీర శతకాన్ని బ్నింగారు నేసిన సమయంలో రెండు సార్లు బ్నింగారిని కలిశాను. ఈ పుస్తకం ఇన్ సైడ్ కవర్లలో ఆయన వేసిన రెండు కార్టూన్లను వేస్తున్నప్పుడు ఎదుటే ఉన్నాను.వాటిలో ఒకటి - "అరుస్తారెందుకు? నా కన్నా చీరలే మీకిష్టం కదా....కులకండి! అంటూ చీరల ట్రంకుపెట్టెలో ఉన్న భర్తతో భార్య చెప్తున్నటువంటి ఈ మాటలు బలే పేలాయి. ఇక రెండో కార్టూనుకి "చీరలు కొనమని భార్యలు / ఊరకనే కోరబోరు - ఉందురు ఓర్పున్ / వారల అవసర మెరిగియు / మీరే తెచ్చివ్వ వలయు మేలగు నేస్తం" అంటూ అందించిన పద్యం మజాగా ఉంది.ప్రతి పద్యంలోనూ బ్నింగారు పలికించిన భావం "చీరకట్టులో ముచ్చటగా, ముద్దుగా కనిపించే సొగసైన కన్యలా" ఉంది.చీరలపై పుట్టిన సాహిత్యంలో, ముఖ్యంగా జానపద సాహిత్యంలో చీరందాలను ఎంతలా అభివర్ణించారో అందరికీ విదితమే."చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా" అని ఒకరంటే "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి...." అని మరొక కవి మాట. అయితే ఇంకొక కవి "జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గొచ్చింది...." అనడం ఎంత బాగుందో కదండీ. చీరంటే మాటలా! కనుక చీర పజ్యాలనొక్కసారైనా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా స్త్రీలు చదివితే బాగుంటుందని నా మాట.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం
భళిరే నైరా
చిత్రం