కన్నెమరా గ్రంథాలయం: --మన భారత దేశంలోని నాలుగు పురాతన గ్రంథాలయాలలో ఒకటి మద్రాసులోని ఎగ్మూరులో ఉంది. దాని పేరు కన్నెమరా లైబ్రరీ. మద్రాసుకు గవర్నరుగా ఉండిన లార్డ్ కన్నెమరా 1890 మార్చి 22వ తేదీన ఈ గ్రంథాలయానికి పునాదిరాయి వేసారు. 1896 డిసెంబరు అయిదో తేదీన ఈ గ్రంథాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ గ్రంథాలయానికి ఆయన పేరే పెట్టారు. 1930 వరకూ ఈ గ్రంథాలయం ఆంగ్లేయుల ఆధీనంలో ఉండేది. అనంతరం భారత గ్రంథాలయ అధికారి పర్యవేక్షణలోకొచ్చిందీ గ్రంథాలయం. అప్పుడే ఈ గ్రంథాలయంలోపలికి వచ్చి పుస్తకాలు చదివేందుకూ, ఇంటికి తీసుకెళ్ళి తిరిగిచ్చేందుకు వీలుకల్పించారు. 1950 తర్వాత ఇండియన్ జనరల్ లైబ్రరీ విభాగం పరిధిలోకొచ్చింది.ఈ గ్రంథాలయ తొలి రోజుల్లో ఇంగ్లీషు పుస్తకాలే అధికంగా ఉండేవి. ప్రపంచ దేశాలలో కొన్నింటికి సంబంధించిన చరిత్ర పుస్తకాలు, ఆంగ్లేయుల పరిపాలనా విధానానికి సంబంధించిన పుస్తకాలు, చిత్రాలు, బైబిల్ పుస్తకాలు ఉండేవి. ఈ గ్రంథాలయంలో 1553 నుంచి ఈనాటి వరకూ దేశ విదేశాలలో ముద్రితమైన అరుదైన పుస్తకాలు అనేకం ఉండటం విశేషం.ఇంంగ్లీషు, తమిళం, హిందీ, మళయాలం, కన్నడం, తెలుగు, సంస్కృతం, ఉర్దు, మరాఠీ, గుజరాతీ, ఒడియా, బెంగాలీ తదితర.ఇరవైరెండు భాషలకు చెందిన పుస్తకాలు ఏడు లక్షలకుపైగా ఉన్న ఈ గ్రంథాలయంలో లక్షన్నరమందికిపైగా సభ్యులున్నారు. ఏడాదికేడాది సభ్యత్వ సంఖ్య పెరుగుతూ వస్తోంది.సాహిత్యం, చరిత్ర, కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, వైద్యం, ఇంజనీరింగ్, విజ్ఞానశాస్త్రం, గణితం, రాజకీయం తదితర అంశాలకు చెందిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.ఇక్కడి ప్రతీ పుస్తకమూ శీర్షికతోసహా కంప్యూటరులో నమోదై ఉంటాయి. కనుక ఇంట్లో నుంచే వాటి వివరాలు అంతర్జాలంలో సభ్యులు తెలుసుకునే వీలుంది. కంటిచూపులేనివారు, చెవిటివారు చదవడానికి కూడా ఇక్కడ వారికి అవసరమైన రీతిలో బ్రెయిలీ, ఆడియో పద్ధతిలో పుస్తకాలు అందుబాటులో ఉంచారు.కన్నెమరా గ్రంథాలయంలో పాఠకులు కూర్చుని చదువుకోవడానికి వీలుగా మూడంతస్తులవి రెండు భవనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 1973 లోనూ, మరొకటి 1999 లోనూ నిర్మించారు. ఒక్కొక్క భవన విస్తీర్ణం 93 వేల 523 చదరపు అడుగులు. ఈ గ్రంథాలయానికి దాదాపు రెండు వేల మంది పాఠకులు వచ్చి వెళ్తుంటారు. 1500 మంది చందాదారులు పుస్తకాలను ఇళ్ళకు తీసుకువెళ్ళి చదువుతారు. దేశంలో ఏ రాష్ట్రంలో అచ్చయినా ఆ పుస్తకాలను ఈ గ్రంథాలయానికి పంపుతారు. కన్నెమరా గ్రంథాలయానికి రోజూ రెండు వందల పత్రికలు వస్తాయి.1553 లో లాటిన్ భాషలో అచ్చయిన అతి పురాతన పుస్తకమూ, 1578లో గ్రీకు భాషలో అచ్చయిన ప్లాటో తత్వ గ్రంథం, 1678 లో లాటిన్ భాషలో అచ్చయిన ఓ పుస్తకం, తమిళనాడులో తరగంబాడిలో ఏర్పాటు చేసిన ముద్రణాలయంలో అచ్చయిన జ్ఞాన పద్ధతులలో వివరాలు పుస.తకం తాలూకు జిరాక్స్ ప్రతి, వీరమా అనే ముని 1822 లో రాసిన ప్రాచీన తమిళ భాష వ్యాకరణ పుస్తకం వంటి ఎన్నో అరుదైన పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. పరిశోధనలు చేసే వారికి ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగకరం. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు