37. ప్రకృతితో బంధం-- 1981 నా సాహిత్య ప్రయాణం లోను నా జీవిత ప్రయాణం లోను మార్గాన్ని సుగమం చేసిన సంవత్సరం! ఇంటి పరిస్థితులు కుదుట పడ్డాయి.కేశవరావు తమ్ముడికి టీచర్ ఉద్యోగం వచ్చింది. పెద్ద తమ్ముడు వేణుగోపాలరావు ప్రైవేటు గా తెలుగు బి.ఏ. సిద్ధమవుతున్నాడు.ఇంకో తమ్ముడు బి.వి.పట్నాయక్ ఇంటర్మీడియట్ లో ఉన్నాడు.ఆఖరి తమ్ముడు ధనంజయ పట్నాయక్ 7వ తరగతి చదువుతున్నాడు. తమ్ముళ్లు బుద్ధిమంతులు.నాన్న గారు నేర్పే క్రమశిక్షణ కొనసాగిస్తున్నారు. అక్క గారి పిల్లలు అనంత్,శ్రీధర్ ఇంటర్ చదవడానికి వచ్చారు. ఇంట్లో చదువుల యజ్ఞం జరుగుతోంది.దశాబ్దాల నుంచి అది కొనసాగుతోంది. మా ఇల్లు మా అన్నదమ్ములనందరినీ ప్రయోజకులను చేసింది.ఆరుగురం టీచర్లమయ్యాం.ఆఖరి తమ్ముడు గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీలో ఫార్మాసిస్ట్!మా ఇల్లు సరస్వతీ దేవాలయం మాకు!! నాన్నగారి సంవత్సరీకం జరిగాక అన్నయ్యలు నా వివాహ ప్రయత్నాలు ఆరంభించారు. నాగావళి నదీ తీరంలో ఉండే మాదలంగి ఊరులో సంబంధమున్నట్టు తెలిసింది.పిల్లను చూడడానికి నేను, పెద్దన్నయ్య,కేశవరావు తమ్ముడు వెళ్ళాం.పార్వతీపురం కి 15 కి.మీ.దూరంలో ఉన్న గుమడ గ్రామం వద్ద బస్సు దిగాం.గుమడ గ్రామం పక్కనే నాగావళి యేరు! ఆ నది దాటి 2 కి.మీ.నడిచి వెళ్తే మాదలంగి ఊరు వస్తుందట! గుమడ ఊరు పక్క నుంచి వెళ్ళి నాగావళి లో దిగాం.మేము వెళ్ళేది మే నెల. అంత మండు వేసవిలో చల్లని వాతావరణం! కింద నీరు చల్లగ ప్రవహిస్తోంది. పైన గాలి ఋతుధర్మం మరిపిస్తోంది.యేరు దాటి మాదలంగి చేరడానికి నడకదారి పట్టాం.ఎండ గట్టిగా ఉన్నా మాకేమీ అనిపించలేదు. ఏటిగాలి కొండగాలి కలిసి మాకు ఆహ్వానం పలికాయి.వెళ్తున్న దారికి రెండు వైపుల అక్కడక్కడ మామిడి తోటలు! మనసుకు హాయి హాయి అనిపించింది. నేను చూడబోయే ఆమె ఎలా ఉంటుందో అనుకున్నాను! ఊళ్ళో వారినడిగి ఆ ఇల్లు చేరాం!అన్నయ్య గారు పిల్ల తండ్రి గారు మాట్లాడారు. అతను కూడా టీచరే.పేరు కంబవలస సుదర్శనరావు గారు. పిల్ల తల్లి గారి పేరు విజయరత్నం గారు. వారికి ఐదుగురు కొడుకులు.ఒక కుమార్తె.ముగ్గురు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు రైల్వే ఒకరు మైనింగ్ డిపార్ట్మెంట్! మిగిలిన ఇద్దరు పార్వతీపురం లోనే చదువుకుంటున్నారు.మా కుటుంబానికి సరిపోయే కుటుంబమే!పిల్లను చూపించారు.ప్రకృతి నాకెంత నచ్చిందో పిల్లా అంతేలా నచ్చింది. కుటుంబం కూడా నచ్చింది.వారం రోజులు తర్వాత అమ్మా వదినలు చెల్లీ వెళ్ళారు.వాళ్ళూ నచ్చారు.ఆగస్టు 16న వివాహం తోటపల్లి దేవాలయం కళ్యాణ మండపంలో జరిగింది.వివాహమయ్యాక బాలచంద్రిక పత్రికలో వచ్చిన నా కథలు చదివినట్టు నా శ్రీమతి చెప్పడం ఒకింత ఆనందాన్ని నాకు కలిగించింది. నా శ్రీమతి పేరు సుశీల. ఆమెకు కూడా పుస్తక పఠనమంటే ఇష్టమే.కొన్ని రోజుల లోనే రచనలలోని మంచి చెడ్డలు విశ్లేషించే శక్తి ఉందని గుర్తించాను.కథ తయారయ్యేటప్పుడు ఆమె సూచనలుపయోగ పడుతుండేవి.నా రచనలకు తొలి పాఠకురాలు ఆమే! 1980 - 82 సం.లలో నా బిఇడి కరెస్పాండెన్స్ కోర్స్ చదువు నా రచనావ్యాసాంగం రెండూ బాగానే సాగాయి.1980 డిశంబరు నెలబాలజ్యోతి లో ఇద్ధరు దొంగలు అనే కథ వచ్చింది. ఆ కథ చదివి బాగుందని చెప్పడానికి పంతులు జోగారావు గారు ఇంటికి వచ్చారు.నాకెంత ఆనందం!!మరికొంతమంది ప్రశంసలు కూడా అందుకున్నాను!ఇటువంటివి నన్ను ముందుకు నడిపించాయి.1981లో బాలచంద్రిక, బాలజ్యోతి, ఆంధ్రభూమి వీక్లీ పత్రికలలో 10 వరకు కథలు వచ్చాయి.ఆంధ్ర భూమి, చంపక్, ఆదివారం వీక్లీ పత్రికలలో అరడజను వరకు బాలగేయాలు వచ్చాయి.ఆ సమయంలో సాంఘిక కథలు కూడాబాగానే వచ్చాయి.(సశేషం)--- బెలగాం భీమేశ్వరరావు- 998953783


కామెంట్‌లు