*పాలైనా కారవే బంగారు కండ్ల ( SUNDAY STORY)-* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212:-- “నమస్తే సార్" ఆ పిలుపుకి దిద్దుతున్న పేపర్లోంచి తలెత్తి చూశాను. ఎదురుగా పాత విద్యార్థి. తెల్లప్యాంట్ లోకి ఇష్టర్ట్ చేసిన తెలంగీ. దానిపై నల్లని బెల్టు. వాని పేరు గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించా. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రింద నా స్టూడెంట్. నల్లగా వున్నా వయసుతో వచ్చిన కళ ముఖంలో కన్పిస్తూ వుంది. చక్కని దేహధారుడ్యం. బహుశా నిత్యం ఎక్సర్ సైజులు చేస్తున్నట్టున్నాడు.చిరునవ్వుతో వాన్ని పలుకరిస్తూ “ఏరా! బాగున్నావా! ఏం చేస్తున్నావిప్పుడు?” అన్నాను ఆప్యాయంగా. వాడు బాగున్నట్టు తలూపుతూ “బీయీడి పూర్తయింది సార్. మనూర్లోనే ఎలిమెంట్రీ స్కూళ్ళో వాలంటరీ టీచర్‌గా పని చేస్తున్నా" అన్నాడు.కుశలప్రశ్నలకి సమాధానాలు రాబట్టాక “ఏమైనా పనుందారా స్కూల్లో" అన్నాను. లేదంటూ తల అడ్డంగా వూపుతూ ఏదో చెప్పడానికి తటపటాయించాడు. అర్ధంగాక “మరి ఎందుకొచ్చావురా" అన్నా. వాడు నాకు మాత్రమే వినబడేంత నెమ్మదిగా వణుకుతున్న గొంతుతో “మీతో కొంచెం మాట్లాడాల" అన్నాడు. చెప్పమన్నట్లుగా చూశాను. స్టాఫ్ రూంలో మిగతా టీచర్ల వంక ఇబ్బందిగా చూస్తూ “బయటికొస్తే” అన్నాడు అర్థింపుగా. వాని పరిస్థితి అర్థం చేసుకొని తోటలోనికి బయలుదేరాను. మధ్యలో చిన్న అరుగు. చుట్టూ పిల్లలే నాటుకొని పెంచుకుంటున్న పూలమొక్కలు, గన్నేరు, మందారం, మల్లె, నిత్యకళ్యాణం... ఎన్నెన్నో. ఏవీ పూర్తిగా పెరగవు. స్కూల్ కి కాంపౌండ్ వాల్ లేదు. పశువులు వస్తాయి. తోట చుట్టూరా కంప వేపిచ్చినా అప్పుడప్పుడు దాడి చేస్తూనే వుంటాయి. అంతకన్నా పెద్ద ప్రమాదం స్కూలు పిల్లలే. పక్కవాని చెట్టు పూలు పూస్తే అసూయ. ఎవరూ చూడకుండా ఎప్పుడోసారి కొమ్మలు విరిచి పాడేస్తారు. పేరుకి పూల చెట్లే. పూలు మాత్రం కాయనివ్వరు. పిల్లల్లాగే ఎప్పటికీ అవి చిన్నగానే వుంటాయి.అరుగు మీద కూర్చుంటూ పక్కన కూర్చోమన్నాను. వాడు “వద్దులే సార్" అంటూ నిలబడ్డాడు. ఏం కావాలో చెప్పమన్నాను.కొద్ది క్షణాలు వాని ముఖంలో రంగులు మారాయి. నాకొక్కనికే వినబడేంత నెమ్మదిగా, దగ్గరగా వచ్చి తడబడుతూ “పేరెట్లా మార్చుకోవాల” అన్నాడు. నాకర్ధంగాక అయోమయంగా “ఏం పేర్రా” అన్నాను. “అదే సార్ నేను పేరు మార్చుకోవాలనుకుంటున్నా” అన్నాడు స్పష్టంగా.నేను పెద్దగా నవ్వేస్తూ “అంత అవసరమేమొచ్చిందిరా” అన్నాను. వాడు చివుక్కున తలెత్తి చూశాడు. నా నవ్వులో అవహేళన ఏమన్నా వుందా అని వాని కళ్ళు వెదికాయి. సూటిగా నన్నే చూస్తున్న ఆ కళ్ళల్లో ఎన్నో అనుభవాల భావాలు. అంతలోనే వాని పేరు జ్ఞాపకమొచ్చింది. చిన్నప్పుడు వాన్ని ఎగతాళి చేసిన పిల్లలూ, టీచర్లూ గుర్తుకొచ్చారు. వెంటనే నా తప్పు అర్థమై సర్దుకొని “ఏం పేరు పెట్టుకోవాల" అనడిగాను.“ఏదో వొగటి. యిది మాత్రం వద్దు. మీరుండేది కర్నూలే గదా. ఆ రూల్సేవో మీకు తెల్సేమోనని” నసిగాడు. ఆలోచించాను. ఆ మధ్య మా బావ శ్రీనివాసులు పేరు మొరటుగా వుందని “శ్రీనివాస్" గా మార్చుకున్నాడు. అది గుర్తొచ్చి “రేపు తెలుసుకొని చెబుతాలేరా" అన్నాను భుజం తట్టి.ఆ మాటకే వాడు సంతోషపడిపోతూ “ఆ వొక్క సాయం చేయండ్సార్. మీ మేలు జన్మకు మర్చిపోను" అన్నాడు చేతులు పట్టుకొని అర్థింపుగా. వాని మాటల్లో బాధ నన్ను కదిలించి వేసింది. సరేనన్నట్లుగా తలూపి పంపించివేశాను.వాడు వెళ్ళిపోయినా ఆలోచనలు వాని చుట్టే తిరగసాగాయి. నేను సర్వీసులో చేరిన రెండు సంవత్సరాలకు ఆరో తరగతిలో చేరాడు. మొదటి రోజు క్లాసులో పిల్లలను పేర్లడుగుతూవుంటే అందరూ టకటకా చెప్పసాగారు. వీడు లేచి నిలబడగానే పిల్లలందరూ గొల్లుమన్నారు. వాడు తలొంచుకొని వినీ వినబడనట్టు ఏదో గొణిగాడు. సరిగా వినబడక “ఏం పేర్రా" అన్నాను గద్దిస్తూ. పక్క పిల్లలందరూ గట్టిగా నవ్వుతూ “కర్రెన్న సార్" అని అరిచారు. నల్లగా కందెనలా వున్నాడు. జారిపోతున్న నిక్కరు. గుండీల్లేని చొక్కా. నవ్వుతే నల్లని ముఖంలో మెరిసే తెల్లని పళ్లు. నాకూ నవ్వొచ్చింది.“ఎవరు పెట్టార్రా ఆపేరు” అన్నాను నవ్వుతూ. వాడు సమాధానం చెప్పలేదు. తనలోకి తాను ముడుచుకుపోయాడు. పక్కనోడెవడో “వానికెవరూ పేరు పెట్లేదు సార్. కర్రెగున్నాడని పుట్టిన దగ్గరనించీ అందరూ కర్రిగాడనే పిలుస్తున్నారు. స్కూళ్ళో కూడా అదే పేరు రాపిచ్చేసినారు" అన్నాడు అల్లరిగా నవ్వుతూ. వాని వంక చూశాను. వాని కళ్ళలో తడి. ముఖంలో ఏ భావమూ కనబడలేదు. పిడికిళ్ళు బిగుసుకొని వున్నాయి. ఏడుపుని అతి కష్టం మీద బిగబట్టుకొని వున్నాడు. ఆరోజు నుంచీ వాన్ని గమనిస్తూనే వచ్చాను.స్కూళ్ళో ఎవరితోనూ, ఎపుడూ సరిగా మాట్లాడడు. చివరి వరుసలో గోడకానుకొని కూర్చుంటాడు. ఏదో పోగొట్టుకున్న వానిలా పరధ్యానం. సరిగా చదవడు. వినడు. సార్ల చేతిలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో.“కర్రె నా కొడకా! ఎందుకొస్తావ్రా బడికి... పశువులు గాసుకోక”. “దున్నపోతులాగున్నావ్. దాన్లతో పాటే తిరగ్గూడదూ” “హలో బ్లాక్ బ్రదర్! పాఠం నేర్చుకొచ్చావా"“రేయ్! బ్లాక్ బోర్డు ముందు నిన్ను నిలబెట్టి ఫోటో తీస్తే పళ్ళు తప్ప ఏమీ పడవురా"... సరదాగా పిల్లల్ని నవ్వించడానికి టీచర్లు వాన్ని గేలి చేస్తుంటే తోటి పిల్లల నవ్వులు, అవహేళనలు, చురకలు, ఎత్తిపొడుపులు. మూతిముడుచుకొంటున్న కొద్దీ మరింతెక్కువయ్యేవి.గూనిరెడ్డి, కుంటి సుంకన్న, చెవిటి రవి... వాళ్ళ లోని లోపాలు వాళ్ళకు విశేషణాలుగా మారితే, వీనికి విశేషణమే నామవాచకమైంది.ఓసారి పదో తరగతి చదువుతున్నప్పుడనుకుంటా గ్రౌండ్ లో ఎవడో “బాబూమోహన్" అని వెక్కిరించాడని, వాడు కొట్టిన దెబ్బకి ఒకని ముక్కు దూలం విరిగిపోయింది. సార్ల చేతిలో ఆ రోజు ఎన్ని దెబ్బలో, ఎంత గొడవో.బెల్ కొట్టిన శబ్దం ఆలోచనలకు అంతరాయం కలిగించింది. సంచీ తీసుకొని బస్టాండ్కు బయలుదేరాను.బస్సులో కూర్చున్నా. ఎదురుగా ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టయిజ్ మెంట్ బోర్డు పెద్దగా కనబడుతోంది. దాన్ని చూస్తుంటే ఎవేవో ఆలోచనలు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కలగాపులగంగా. కదిలిన బస్సుతో పాటు వెంబడిస్తున్న ఆలోచనలు...“ఆరు వారాల్లో మరింత ఛాయ. మిమ్మల్ని మీరే నమ్మలేరు... పిల్ల ఎలాగుంది? నల్లగుందా, తెల్లగుందా... మనసు లోతుల్లోకి చూడలేని అందాల పోటీలు నడిపే ప్రపంచం... అభినయమంటే ఎరుగని సౌందర్యరాసుల సోయగాలకు ప్రేక్షకుల నీరాజనాలు... ఆనాటి రాయంచ నడకల వరూధిని నుంచీ, నేటి బంగరు బొమ్మ పూర్ణమ్మ వరకు నెత్తిన కిరీటాలూ, బిరుదులూ... బాబూమోహన్ నల్లగా, వికృతంగా, మొరటు చేష్టలతో ప్రేక్షకులను నవ్విస్తూ...బానిసత్వానికి, అజ్ఞానానికి, అగౌరవానికి, మొరటుతనానికి, రాక్షసత్వానికి, అసహ్యానికి, హాస్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన నలుపు...ఏడుకొండలపై ధగధగలాడే బంగారు ఆభరణాలతో కప్పివేయబడుతున్న నల్లని శిల... అందమైన సమ్మోహన పరిచే చిరునవ్వులతో పాలరాతి ఆలయాల్లో దర్శనమిస్తున్న తెల్లనైన దేవుళ్ళు..." బస్సు ఆగడంతో వులిక్కిపడ్డాను. రాజ్ విహార్ వచ్చేసింది.బస్సు దిగి యింటికెళుతూనే ముందర బావకు ఫోన్ చేసి పేరు మార్చుకోడానికి సంబంధించిన వివరాలన్నీ కనుక్కొన్నాను.తర్వాత రోజు నేను స్కూల్కు వెళ్ళేసరికి కర్రెన్న నా కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కనబడ్డాడు. దగ్గరకు పిల్చి వివరాలన్నీ చెప్పాను. వాని అభ్యర్థన మేరకు, వానికి ఖచ్చితంగా చాతనైన సహాయం చేయాలని ముందే తీసుకున్న నిర్ణయం వల్ల స్కూలుకి సెలవు పెట్టి వానితో బాటు కర్నూలుకి బయలుదేరాను. దగ్గరుండి డీడ్ ఫార్మ్ పూర్తి చేయించాను. అందులో మార్చుకున్న కొత్త పేరు రాసి ఎలాగుందన్నట్లుగా చూశాడు. చిరునవ్వుతో బాగుందన్నట్లు తలూపుతూ భుజం తట్టాను. నాకు బాగా పరిచయస్థుడైన డిస్ట్రిక్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ చేత దానిపై ఇండియన్ సిటిజన్ అని సర్టిఫై చేయించి, ఆఫీసులో సమర్పించి, తొందరగా గెజిట్లో వచ్చేలా చూడమని అభ్యర్థించి బయటపడ్డాను.వాని కళ్ళనిండా ఆనందంతో నీళ్ళు. పేరు చెప్పుకోడానికే అవమానంగా ఫీలవుతూ, ఆత్మ న్యూనతాభావంతో, పదిమందిలో తిరగలేక, ఎవరికీ పేరుకూడా చెప్పుకోలేక, చెప్పవలసివస్తే, చెబుతే, అవతలివాని ముఖంలో తళుక్కున మెరిసే నవ్వు, గుండె లోపలి గాయాన్ని మరింత పెద్దది చేసి, గెలికి బాధిస్తుంటే, ఎన్ని రోజుల నుంచీ ఆ లేత గుండె కన్నీరు కారుస్తుందో!కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేతులు పట్టుకున్నాడు. వద్దన్నా వినకుండా ఎలైట్ హోటల్ కి తీసుకుపోయి చికెన్ పటాకా తెప్పించాడు. ఆనంద దరహాసాలు వీస్తూ వున్నాయి. ఆ సమయంలో నేను వానికి ఉపాధ్యాయునిలా గాక స్నేహితునిలా కన్పిస్తున్నట్టున్నాను. గెజిట్ లో నోటి ఫై కాగానే యూనివర్శిటీకెళ్ళి సర్టిఫికెట్లన్నింటి మీదా పేరు మార్చేసుకుంటానన్నాడు. భోజనం పూర్తి కాగానే బయట పడ్డాం. మళ్ళా అన్నిట్లో పేరు మార్చుకున్నాక కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.కర్రెన్న మళ్ళా కనబడలేదు. నెమ్మదిగా ఆలోచనల్లోంచి మాయమయ్యాడు. ఓ సంవత్సరం తర్వాత ఓ రోజు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ముఖంలో మునుపటి కళ లేదు. కళ్ళలో నిరాశ, బాగా అలసి పోయినట్టున్నాడు.“ఏరా కర్రెన్నా! ఎలా వున్నావ్. ఏమైంది. సర్టిఫికెట్లలో పేరు మార్చారా? ఆరోజు నుంచీ అస్సలు కనబడలేదే? ఏమైపోయావ్?" ప్రశ్నల వర్షం కురిపించాను. వాడు సమాధానంగా “మార్చారు సార్" అన్నాడు హీన స్వరంతో. “మరింకేం" అంటూ వాని ముఖంలోకి చూశాను. ఏదో దిగులు కనబడుతా వుంది. కొద్ది నిముషాలు యిద్దరి మధ్యా భరించలేని నిశబ్దం. ఆ నిశబ్దాన్ని భంగం చేస్తూ “వూరొదిలి పోతున్నా సార్. చివరిసారిగా మిమ్మల్ని ఒకసారి చూసి పోదామని" అన్నాడు.ఒక్క క్షణం వాడేమన్నాడో అర్థం కాలేదు. అర్థమయ్యాక “ఏరా ఏదైనా వుద్యోగమా” అన్నాను కుతూహలంగా.“ప్రయివేటు స్కూలే సార్. ఐదు వేలిస్తారు" నిరాసక్తంగా చెప్పాడు.వాని భుజంపై చేయేసి ప్రేమగా నొక్కుతూ “రేయ్! వున్న వూర్లో రెండు వేలొచ్చినా మేలే గదా. టౌన్లో చాలా కష్టపడతావ్. బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నావా" అన్నాను. వాడు వెంటనే “అన్నీ ఆలోచించుకున్నా సార్. ఎన్ని కష్టాలెదురైనా పర్వాలేదు. ఈ వూర్లో మాత్రం వుండను. ఇక ఎప్పటికీ రానుకూడా" అన్నాడు స్థిరంగా. వాని మాటల్లో బలమైన పట్టుదల కన్పించింది. ఆ నిర్ణయం వెనుక గల కారణాన్ని వూహించడానికి ప్రయత్నిస్తూ “నిజం చెప్పరా... ఎందుకీ నిర్ణయం తీసుకున్నావ్" అన్నాను అనునయంగా చేయి పట్టుకోని.వాడు తలొంచుకొని గొణుగుతున్నట్లుగా, ఒకొక్కమాటే కూడగట్టుకుంటూ “పేరైతే మారింది గానీ, ఈ ఊర్లో పిలుపు మారలేదు సార్. అందుకే నా పేరేమో తెలీని కొత్త చోటుకి, కొత్త మనుషుల్లోకి, కొత్త జీవితంలోకి పోవాలనుకుంటున్నా, ఈ వూరూ, ఈ మనుషులూ, ఈ పిలుపులు వినిపించనంత దూరానికి" చెబుతూ వుంటే వాని గొంతు బొంగురుపోయింది. కళ్ళ నుండి నీళ్ళు బొటబొటా రాలాయి.ఏం మాట్లాడాలో అర్ధంగాక “బెస్ట్ ఆఫ్ లక్" అంటూ షేక్ హాండిచ్చి చిన్నగా భుజం తట్టాను. వాడు నమస్కారం చేసి గిరుక్కున వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. కనుచూపు మేర దాటి పోయేంత వరకూ అలాగే చూస్తుండిపోయాను. వాడు కనబడగానే అలవాటుగా “ఏరా కర్రెన్నా" అని పలకరించడం గుర్తుకొచ్చింది. వాని నిర్ణయానికి నేనూ ఒక కారణమేనా?క్లాస్ రూంలోకొచ్చి కూర్చున్నా. పుల్లన్న, తిక్కన్న, సుబ్బమ్మ, మద్దమ్మ... అందరూ ఎదురుగా కనబడసాగారు. అందరి కళ్ళలోనూ కర్రెన్న కన్నీటి ఛాయలే...


కామెంట్‌లు