గురజాడవారు వ్రాసిన ఆరు కథలలో అతి పెద్దది'సంస్కర్త హృదయం'. దాని తరువాత ' దేవుడు చేసిన మనుషుల్లారా ! మనుషులు చేసిన దేవుళ్ళారా ! మీపేరేమిటి ? ' అన్నది మరో పెద్ద కథ. దీనికి గురజాడ కథల్లోరెండవ స్థానం వస్తుంది. అయితే ఇంత పెద్ద పేరుగల కథకు' మీ రపేరేమిటి ? ' అనే కథగా చెప్పుకుంటున్నాం. గురజాడఈ కథలో విజయనగరం, ఆ పరిసర ప్రాంతాల్లోనున్న పువ్వుల తోట, దేవీ విగ్రహం, బుద్ధవిగ్రహం, శివాలయం, రామగిరి (రామతీర్థం)బౌద్ధ కట్టడాలు,పాండవుల పంచలు, రామాలయం సందర్భాన్నిబట్టి మనకు పరిచయం చేసారు. కథ ప్రారంభంలోనే శిష్యుల చదువులపై గురువుగారైన శాస్త్రులవారు ఆగ్రహిస్తారు. శిష్యులకు బౌద్ధ మతానికి సంబంధించిన విషయాలను నేర్చుకుందామని ఆశక్తి ఉంటుంది కానీ పురాణాలు గురించి తెలుసుకోవాలని పెద్దగా ఆశక్తి ఉండేదికాదు. దానికి కారణం పురాణాలంటే వారికి గల భయమే ! వారి చదువులను చూసిన గురువు గారు శిష్యులనుద్దేశించి " వెధవ చదువు! మీ మతులు పోతున్నాయి. మీరు ఒట్టి బౌద్ధులు "అనేవారు. శాస్ర్తులు గారు కాశీలోనే చాలా కాలం ఉండి తర్కశాస్త్రం చదువుకు న్నాడు. మన దేశంలో అంత తార్కికుడు లేడని ప్రసిద్ది. కావ్యాల్లో మంచి రసగ్రాహి. సుగుణ సంపత్తితో కూడుకున్న వాడు కూడాను. సత్యకాలపు మనిషి. అతని పాండిత్యం అలవిగానిది. ఇవన్నీ అతని ఒక్క బుర్రలో ఎలా ఉన్నాయో అని విద్యార్థులంతా ఆశ్చర్యపోయేవారు. విద్యార్థులు పురాణములకు బదులు బౌద్ధమత గ్రంథాలను చదవటం అతనికి ఇష్టముండేదికాదు. అది గ్రహించిన రామ్మూర్తి అనే శతపెంకి విద్యార్థి బౌద్దులు ఎటువంటివారో చెప్పండి అంటాడు శాస్త్రిగారిని. ఒకనాడు శాస్త్రులవారు పువ్వుల తోటలో పాతికమంది శిష్యులను కూర్చోబెట్టి బౌద్ధమతం మీద ఉపన్యసిస్తున్నారు. పది నిమిషాలు అయ్యేసరికి తన చేతిలోనున్న పుస్తకాన్ని విప్పి చూసాడు రామ్మూర్తి. శాస్త్రులు గారు చెప్పిన విషయం తన చేతిలో నున్న ' సర్వదర్శన సంగ్రహము' లోనిది కదండీ మాష్టారూ అంటాడు. అందుకు శాస్త్రులుగారు ఆశ్చర్యపడి " నీకెలా తెలిసెనురా ? " అని రామ్మూర్తినడుగుతారు. అందుకు తన చేతిలోనున్నది తర్జుమా పుస్తకం అని అంగీకరిస్తాడు రామమూర్తి. అందుకు శాస్త్రులవారు అలా తర్జుమా చేసిన ఆంగ్లేయుడిని మెచ్చుకుంటూ నారాయణరావు చేతిలో నున్న రెండో పుస్తకం 'బుద్ధచరిత్ర' ను అడిగి తీసుకుంటాడు. శాస్త్రుల వారు పుస్తకం అందుకొని తన మధురమైన కంఠంతో
చదివి, అర్థం చెప్పడం ప్రారంభిస్తాడు. 'బుద్ధ చరిత్ర' పుస్తకాన్ని తన దగ్గర నాలుగు రోజులు ఉంచుకుని బుద్ధుని మహిమ తెలుసుకుని ఈ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అవతారమే అంటారు శాస్త్రులవారు. ఆనాటి నుండీ బౌద్దులను దూషించడం మానేసి కిరస్తానులమని అంటూ వచ్చారు. క్రీస్తును శ్రీ మహావిష్ణు యొక్క పదకొండవ అవతారంగా చెయ్యడానికి సాధ్యంకాక ఒడంబడి విద్యార్థులు ఊరుకున్నారు. ఇదంతా పది సంవత్సరాల క్రిందటిమాట. శాస్త్రులవారు పింఛను పుచ్చుకుని ఇంటివద్ద శిష్యుల శుశ్రూష పొందుతూ, సంస్కృత గ్రంథాలలో విషయాన్ని బోధపరచుతూ సంతోషిస్తూ, సంతోషపెడుతూ కాలం వెళ్లబుచ్చుతుంటారు. రామ్మూర్తికి భూములు చాలా ఉన్నాయి.కొత్త కొత్త పద్ధతులలో వ్యవసాయం చేస్తుంటాడు. వూటగెడ్డ దగ్గర బ్రహ్మాండమైన తోట వేసాడు. అందులో పూసే పువ్వులు, కాసే పళ్లే కావు. తొలిఫలాలు గురువుగారు ఆరగించనిదే రామమూర్తిచెట్టు ముట్టడు. ఆ తోటలో విహరించడం గురువుగారికి ( శాస్త్రిగారికి ) అమితానందం. ఆ తోటలోనే తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. గురువుగారు, మరి ఆరేడుగురు అభిమానవంతులైన శిష్యులు కలిసినప్పుడల్లా స్వర్గ భాగం దిగి వచ్చినట్లుం టుందని అందరూ భావిస్తారు. గురు-- శిష్యుల అనుబంధం ఎటువంటిదో మనకు తెలుస్తుంది. ( సశేషం )
గురజాడ రచనశివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి