165.అదృష్టవంతుడిని చెరిపేవారుండరు:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.

కొందరిని చూసి నోట్లో బంగారు చెంచాతో పుట్టాడని అంటారు. ఏది జరిగినా అది వారికి
మంచే చేసి పోతుంది. ఆ సంఘటనలు కాకతాళీయంగానే జరుగుతాయి.ఆ వ్యక్తులు
అవి జరగాలని కోరరు.అలాంటి ఒక వ్యక్తి కథే
"బంగారు జాతకం"!2012 ఏప్రిల్ చందమామ లో
వచ్చింది. కథలోకి వెళ్తే .... బిడ్డ పుట్టగానే జాతకం
చూసిన శాస్త్రి గారు "ఈ అబ్బాయిది బంగారు
జాతకం!పట్టిందల్లా బంగారమవుతుంది.పేరు
బంగారయ్య అని పెట్టండి"అని సలహా ఇచ్చారు.
తల్లిదండ్రులు చాలా సంతోషించి బిడ్డకు బంగారయ్య అని నామకరణం చేశారు. బంగారయ్య పెరిగి పెద్దవాడయ్యాడు.పెద్ద చదువులకు రాగానే చదివిన చదువు చాలని
తండ్రి అతడిని వ్యాపారంలో ఉంచాడు.వ్యాపారంలో బంగారయ్య తెలివితేటలతో రాణించాడు.తల్లిదండ్రులు 
ఆనందించారు.యుక్త వయస్సు రాగా దూరపు
బంధువులమ్మాయి మాణిక్యంతో పెళ్ళి చేశారు.
ఒక మనవడిని ఒక మనవరాలిని చూశాక కొన్నాళ్ళకు వాళ్లు చనిపోయారు.వ్యాపార భారమంతా బంగారయ్య మీద పడింది. అతడి
కష్టానికి అదృష్టం తోడయింది.వ్యాపారంలో
అగ్రశ్రేణిలో నిలబడగలిగాడు.తోటి వ్యాపారస్తులు
అసూయపడసాగారు.ఒకసారి బంగారయ్య
భార్యాబిడ్డలతో తీర్థయాత్రలు చెయ్యాలనుకున్నాడు.నమ్మకమైన పనికుర్రాడిని
ఇంట్లో కాపలా పెట్టి తీర్థయాత్రలకు బయలుదేరారు.ఒకరోజు బంగారయ్య ఇంటి మీద
దొంగలు పడ్డారు. కాపలా కుర్రాడిని చితక్కొట్టి
డబ్బూ బంగారం కోసం ఇల్లంతా వెతికారు.బీరువాను బద్దలు కొట్టి అందులోని
ఆభరణాలు తీశారు. అప్పటికే రెండిళ్ళలో దొంగ
తనం చేశారు. సమయం మించిపోతుంది,ఇరుగు
పొరుగు వారు లేచారంటే ప్రమాదమని దొరికిన
ఆభరణాలు మూటగట్టుకొని పెరడుగోడ దూకి
చీకట్లో కలిసిపోయారు. పనికుర్రాడు దెబ్బల నుంచి తేరుకున్నాక దొంగలు పడ్డారని లబోదిబో
అని ఏడ్వసాగాడు.బంగారయ్య ఇంట్లో దొంగలు
పడ్డారన్న వార్త ఊరంతా వ్యాపించింది.వ్యాపారస్తులు ఆ వార్త విని 'బంగారయ్య అదృష్టానికి తెర పడింది. ఇల్లంతా 
దోపిడీకి గురయిందట' అని సంబరపడ్డారు.మరు
నాడే బంగారయ్య కుటుంబం ఇంటికి చేరింది.
పనికుర్రాడు ఏడ్చుకుంటూ దొంగలు పడ్డ తీరు
చెప్పాడు. బంగారయ్య అంతా విని పెరట్లోకి
పరుగెత్తాడు.అక్కడ గోలెంలో పాతిన గులాబీ మొక్క భద్రంగా ఉంది.అమ్మయ్య అనుకున్నాడు.
బంగారయ్య ఇంట్లోకి వచ్చి పనివాడిని బయటకు
పంపి భార్యతో పెరడికి మళ్ళీ వచ్చాడు.గోలెంలో
గులాబీ మొక్కను పీకి మట్టి కింద ఉంచిన రేకు
పెట్టె తీశాడు. అందులో తానుంచిన డబ్బూ బంగారం భద్రంగా ఉన్నాయి. భార్య అయోమయంగా చూసింది."ఎందుకయినా మంచి
దని ఇలా దాచాను"అని భార్యతో అన్నాడు. అంతలో పిల్లలు వచ్చి గోడ పక్క పొదలలో ఈ మూట దొరికిందని ఒక మూట తెచ్చి తండ్రికి 
అందించారు. అందులో రకరకాల బంగారు
ఆభరణాలతో పాటు తాను బీరువాలో పెట్టిన
నకిలీ ఆభరణాలు కూడా ఉన్నాయి. బంగారయ్య
కళ్ళు జిగేల్ మని మెరిశాయి."గత జన్మలో దొంగలు
మనకు బాకీపడి ఉంటారు.అందుకే ఈ మూట
జారవిడిచి వెళ్ళారు"అని ఆశ్చర్యంలో మునిగి ఉన్న భార్యతో అన్నాడు. అంతలో తోటి వ్యాపారస్తులు దొంగలు పడినందుకు పరామర్శ
చేయడానికి ఇంటికి వచ్చారు.వారు లోలోపల 
సంబరపడుతున్నారని గ్రహించి బంగారయ్య 
"దేవుడెప్పుడూ నా మేలునే కోరతాడు. నా గురించి చింతించకండి.మన ప్రాప్తి మేరకు సంపద
దక్కుతుంది"అన్నాడు. వ్యాపారస్తులు బంగారయ్య నిబ్బరం చూసి ఖంగుతిన్నారు.
పైకి బంగారయ్య బాధపడనట్టు నటించినా 
అతని పతనం ఆరంభ మయిందనుకొన్నారు.
రోజులు గడుస్తున్నాయి. బంగారయ్య తన వ్యాపారానికి అనుబంధ వ్యాపారాలు కొత్తగా
ప్రారంభించాడు.దొంగలు పడిన ఇల్లు వృద్ధి
చెందడం వారికి ఆశ్చర్యం కలిగించింది."బంగారయ్య పేరుకు తగిన వాడు.
దొంగలు పడినా చెక్కు చెదర లేదు.ఆ దొంగలే
ఏదో మూట వదిలి వెళ్ళారేమో!అదృష్ట జాతకుడిని ఎవరూ చెరపలేరు"అని చెవులు కొరుక్కొన్నారు. వాళ్ళనుకున్నదే నిజమని మాత్రం
ఎప్పుడూ అనుకోలేదు.(సశేషం)