భాస్కర శతకము* - పద్యం (౩౫ - 35)

ఉత్పలమాల :
 *క్రూరమనస్కులౌ పతులఁ | గొల్చి వసించిన మంచివారికిన్*
*వారి గుణంబెపట్టి, చెడు | వర్తన వాటిలు; మాధురీ జలో*
*దారలు గౌతమీ ముఖ మ | హానదులంబుధిఁ గూడినంతనే*
*క్షారముఁజెందవే మొదలి | కట్టడలన్నియుఁ దప్పి భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
గౌతమీ, గంగ, కృష్ణా, గోదావరి, మరియు ఇతర నదుల జలాలు తయ్యగా వుండి, మంచినీరు లాగా మనిషి దాహం తీర్చుకోవడానికి పనికి వస్తాయి.  అవే నదీజలాలు సముద్రంలో కలిసినప్పుడు వాటి సహజమైన తీపి గుణం పోగొట్టకొని, సముద్ర జలాలకు సహజమైన ఉప్ప గుణాన్ని పొందుతాయి. అలాగే, చెడ్డవి క్రూరమైనవి అయిన లక్షణాలు కలిగిన రాజు/అధికారి వద్ద పనిచేస్తే వారి లక్షణాలు మనకు వస్తాయి.... అని భాస్కర శతకకారుని వాక్కు.
*క్రూరులు, చెడ్డవారు ఐన వారి స్నేహం చేయడం వలన వారి క్రూరత్వం మనకు అలవడే అవకాశం ఎక్కువగా వుంటుంది.  దాని వల్ల మనం చెడ్డవారిగా మారే ప్రమాదం వుంది.  అందుకని, చెడు అలవాట్లు, చెడు లక్షణాలు కలిగిన వ్యక్తులకు దూరంగా వుండాలి* అని భావం......ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss


కామెంట్‌లు