అష్టవిధ నాయికలు: రామ్మోహన్ రావు తుమ్మూరి

1. స్వాధీనపతిక


తనయడుగులకును మడుగులు


తనమగడెపుడొత్తునంచు తానతిశయమున్


తనవారిముందు జూపును


కనగా స్వాధీనపతిక కందర్పసతే


 


2. వాసకసజ్జిక


ముదితదె వాసక సజ్జిక


ముదమారగ పతిని దలచి ముద్దులమూటై


పొదరింటివోలె ఇంటిని


పదపడి సవరించి తీర్చె పలు సుమములతో


 


3. విరహోత్కంఠిత


ఇటునటు తిరుగుచు పతిపై


మెటికలు విరుచుచును అలవి మీరిన ప్రేమన్


ఎటులోర్తు నితని  దూరము 


కట కట యను విరహభరిత కామిని గనమే


 


4.విప్రలబ్ధ


కన్నులు కాయలు కాచెను


నన్నిట రమ్మన్న వాడు నమ్మించెననున్


హన్నా!రాతిరి గడిచే


నెన్నగ నగలేల నాకు నికపై ఏడ్వన్


 


5. ఖండిత


రుసరుసలాడును ఖండిత


బుసకొట్టెడు నాగువోలె పొగులుచు మదిలో


అసమశరుండగు తనపతి


ఇసి మోసము చేసెనెవ్వతితొనితడుండెన్


 


6.కలహాంతరిత


కలహించి కోపమున నే


తులనాడితి నేల యతడు త్రోవన్ బట్టెన్


విలపించనేమి ఫలమిక


కలహాంతరితన్ గదోయి కడు చపలమతిన్


 


7.ప్రోషితభర్తృక


పరదేశమేగి ఇంకను


అరుదెంచవదేమిటోయి అబలను నేనీ


విరహమ్ము నెట్టులోర్చుట


పొరలెడు దుఃఖమ్ము గనవె ప్రోషితపతికన్


 


8.అభిసారిక


అభములు శుభములనెంచక


అభిసారము జేసికొన్న అనువగు చోటున్


అభిసారికనై జేరితి


అభిలషితను నిన్ను గూడ హా నా ప్రియుడా!



కామెంట్‌లు