మిన్ను - బాలల నవల చివరి భాగం--డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  మిన్ను రాము ఇద్దరూ దిగడానికి దారి ఎక్కడుందా అని చుట్టూ చూశారు. ఒక పక్క గోడ సగం పడిపోయి వుంది.


దాని మీద నుంచి ఇద్దరూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా నడవసాగారు. కానీ... అది చానా పాత గోడ. ఇద్దరు అడుగు పెట్టేసరికి ఆ బరువుకి తట్టుకోలేక ఒక్కసారిగా కూలిపోయింది. కింద పెద్ద పెద్ద చెక్కపెట్టెలు ఖాళీవి వున్నాయి. ఇద్దరూ పడడం పడడం దభీమని ఆ పెట్టెల పై పడ్డారు. అంతే అవన్నీ పెద్ద చప్పుడుతో దబదబదబ కింద పడ్డాయి. ఆ చప్పుళ్ళకు వాకిలి దగ్గర వున్న వాళ్ళంతా అదిరిపడ్డారు. “రేయ్... లోపలికి ఎవరో వచ్చినట్టున్నారు. పదండి పట్టుకొందాం" అంటా పరుగెత్తుకోని వచ్చారు. అక్కడ రాము, మిన్ను పెట్టెల నడుమ కిందపడి కనిపించారు.


వారి అంగీలు పట్టుకొని పైకి లేపి " ఎవర్రా మీరు... లోపలికి ఎలా వచ్చారు" అన్నారు. కోపంగా.


మిన్ను భయం భయంగా “అదీ.. అదీ... గాలిపటం తెగిపోయి పైన పడింటే దాని కోసం వచ్చాం" అన్నాడు నసుగుతా.


“అలాగా... మరి గాలిపటం ఎక్కడ" అన్నాడు ఒకడు. "పైన వుంది" అన్నాడు రాము. “మరి గాలిపటం పైనుంటే కిందికెందుకు వచ్చారు" అన్నాడు ఇంకొకడు జుట్టు పట్టుకుంటా. “అదే దానికోసమని ఆ గోడ మీద పోతా వుంటే జారి కింద పడ్డాం" అన్నాడు మిన్ను. 


“ఏరా వీళ్ళని ఏం చేద్దాం" అన్నాడు ఒకడు మిగతా వాళ్ళతో.


*వీళ్ళ వల్ల ఎన్ని చెక్కపెట్టెలు పగిలిపోయాయో చూడండి. వీళ్ళని వదలిపెడితే గంగన్నకి ఏం సమాధానం చెబుతాం. అందుకే ఇద్దరినీ కట్టి పడేద్దాం. ఏం చేయాలో గంగన్నే చూసుకుంటాడు" అన్నాడు ఇంకొకడు.


సరే అని కొన్ని తాళ్ళు తెచ్చి ఇద్దరికీ కాళ్ళూ చేతులూ వెనకకు విరిచి కట్టి ఆ పక్షులున్న గదిలోనే వేసి బైట గొళ్ళెం పెట్టేశారు. 


"నే ముందే చెప్పా గదా... వద్దు వెళ్ళిపోదాం అని. చూడు ఇప్పుడేం జరిగిందో... ఆ గంగన్న అసలే మంచోడు గాదు. వచ్చాడంటే ఏమైతాదో ఏమో" అన్నాడు రాము ఏడుపు ముఖంతో...


“రామూ... ఆపద వచ్చినప్పుడు అంతకు ముందు జరిగినవి తలచుకొంటా అనవసరంగా ఒకరితో ఒకరు గొడవపడడం వల్ల ఎటువంటి లాభం వుండదు. ఎలా తప్పించుకోవాలో ఆలోచించు" అన్నాడు మిన్ను.


రాము మౌనంగా వుండిపోయాడు. భయంతో వళ్ళంతా చెమటలు పడతా కళ్ళలోంచి నీళ్ళు కారిపోతా వున్నాయి.


అంతలో మిన్ను రాము వంక తిరిగి “రామూ... నువ్వు నా దగ్గరికిరా... నీ తాళ్ళు విప్పుతా" అన్నాడు సంబరంగా...


 “ఎలా విప్పుతావు" అన్నాడు రాము అయోమయంగా.


“నువ్వు నెమ్మదిగా జరుగుతా నా దగ్గరికి రా... నా పళ్ళతో నీ చేతికి కట్టిన తాళ్ళు విప్పుతా" అన్నాడు. సరే అని రాము కొంచెం కొంచెం జరుగుతా మిన్ను దగ్గరికి వచ్చాడు.


మిన్ను నెమ్మదిగా రాము చేతులకు కట్టిన తాళ్ళను నోటితో పట్టుకొని గట్టిగా పీకసాగాడు. అది అంత సులభంగా వూడి రావడం లేదు. అయినా సరే పట్టిన పట్టు వదలకుండా కొంచెం కొంచెం కొరకసాగాడు. ఒక్కొక్క దారం తెగిపోతా వుంది. కాసేపటికి తాడు మొత్తం తెగిపోయింది. 


అంతే...


రాము గబగబా లేచి తన కాళ్ళకు కట్టేసిన తాళ్ళు విప్పుకొని, మిన్నుకు కట్టిన తాళ్ళు గూడా విప్పేశాడు.


ఇద్దరూ సంబరంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు.


“ఐనా అప్పుడే ఏమయింది. ఈ గదిలోంచి బైట పడాల. అదెలాగో ఆలోచిద్దాం" అన్నాడు మిన్ను. ఇద్దరూ గట్టిగా తలుపు లాగి చూశారు. అవతలి వైపు గొళ్ళెం వేసి వుండడంతో రాలేదు.


రాము అటూ యిటూ చూసి "మిన్నూ ... ఆ మూల జంతువులను పట్టుకోవడానికి ఉపయోగించే వలలు, ఉచ్చులు, పెద్ద పెద్ద కట్టెలు వున్నాయి చూడు" అంటూ వాటితో ఏం చేయాలో చెప్పాడు.


ఆ ఆలోచన మిన్నుకు గూడా నచ్చింది. వెంటనే ఉచ్చులన్నీ తీసి తలుపు ముందంతా పరిచారు. 
 
ఇద్దరూ చెరో లావు కట్టె తీసుకొని తలుపులకు ఆ పక్క ఒకరు, ఈ పక్క ఒకరు నిలబడి దబదబదబ బాదసాగారు. ఆ చప్పుళ్ళు విని గంగన్న అనుచరులు అదిరిపడ్డారు. 'రేయ్... ఆ పిల్లలు తప్పించుకున్నట్లున్నారు. పదండి పోయి పట్టుకుందాం" అంటా పరుగుపరుగున వచ్చారు. లోపల వున్నది చిన్న పిల్లలే గదా... వాళ్ళు తమనేం చేయలేరులే అనుకుంటా తలుపులు తీసి వేగంగా లోపలికి వచ్చారు. 


అంతే... 


లోపలికి వచ్చే దారిలో ఉచ్చులున్నాయి గదా... వాటిలో వాళ్ళ కాళ్ళు ఇరుక్కుపోయాయి. లాగిన కొద్దీ మరింత బిగుసుకు పోసాగాయి. తలుపుకి ఆ వైపు ఈ వైపు చేతిలో లావు లావు కట్టెలు పట్టుకున్న రాము, మిన్ను వాళ్ళ తలల మీద దబీదభీమని తలా ఒకటి పెరికారు. ఆ దెబ్బలకు వాళ్ళకు చుక్కలు కనిపించాయి. ఎక్కడోళ్ళక్కడ పడిపోయారు. వెంటనే తాళ్ళు తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళూ చేతులు గట్టిగా కట్టి, పెద్ద వల తీసుకువచ్చి అందులో అందరినీ బంధించారు. 


అంతలో గంగన్న చేతిలో పెద్ద కత్తితో అక్కడికి వచ్చేశాడు. ఎదురుగా అనుచరులంతా వలలో బంధించబడి కనబడ్డారు. అనుచరులు అప్పటికే విషయం ఫోనులో చెప్పి వుండడంతో జరిగిందంతా తెలిసిపోయింది. “ఏదో... అమాయకులైన చిన్న పిల్లలు అనుకున్నా గానీ... మీరు మామూలోళ్ళు కాదురా... మీ ఇద్దరినీ ఇక్కడికిక్కడే నరికేసి.. అడవిలోని జంతువులకు ఆహారంగా వేసి వెళతా... చూడండి” అంటా కోపంగా చిందులు తొక్కుతా ముందుకు వచ్చాడు. రాము, మిన్ను ఒకరినొకరు చూసుకున్నారు.


గంగన్న చేతిలో పెద్ద కత్తి వుంది. అదీగాక బలంగా కండలు దీరి వున్నాడు. వాన్ని గెలవడం అంత సులభం కాదు... ఎలా.. ఎలా... అనుకుంటా వుంటే... మిన్నుకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే రాముకు చెప్పాడు. ఇద్దరూ పరుగెత్తుకుంటా పక్షులు, జంతువులు వున్న పంజరాల వద్దకు వచ్చారు. అక్కడొక పెద్ద బోను. అందులో ఒక పెద్ద ఎలుగుబంటి ఉంది గదా... ఇద్దరూ గబగబా బోను పైకెక్కి దాన్ని తెరిచారు.


అంతే ఎలుగుబంటి గట్టిగా కేకలు పెడతా బైటకు వచ్చింది. దాని కళ్ళు కసితో ఎర్రబడ్డాయి. ఎదురుగా తనని బాగా కొట్టి పట్టుకొచ్చిన గంగన్న కనబడ్డాడు.


కోపంతో వురుక్కుంటా పోయి ఎగిరి గంగన్న మీదకు దూకింది. గంగన్న దాన్ని కత్తితో ఎదిరించాడు గానీ దాని వాడి గోళ్ళ దెబ్బకు కత్తి ఎగిరి కిందబడి పోయింది. అంతే... ఇక్కడుంటే చావు తప్పదనుకొని వెనక్కి తిరిగి పరుగెత్తడం మొదలు పెట్టాడు. కానీ ఎలుగుబంటి వాన్ని వదల్లేదు. గంగన్న అక్కడి నుంచి పారిపోయి ఒక గదిలో దూరి లోపల గడియ పెట్టుకున్నాడు. ఎలుగుబంటి కాసేపు అక్కడే అటూ యిటూ తచ్చాడి ఇక లాభం లేదనుకొని అడవిలోకి వెళ్ళిపోయింది.


 వెంటనే మిన్ను, రాము బోను దిగి పరుగుపరుగున అక్కడికి వచ్చారు. గదికి బైట నుంచి తాళం వేశారు. దాంతో గంగన్న లోపలే ఇరుక్కుపోయాడు.


 మిన్ను, రాము ఊరిలోకి వచ్చి అందరికీ జరిగిందంతా చెప్పారు. వెంటనే ఆ ఊరి పెద్దలు, పోలీసులను తీసుకొని బంగళాకు చేరుకున్నారు. బంగళా నిండా ఎక్కడ చూసినా ఎర్రచందనం దుంగలు, జంతువులు, పక్షులు కనిపించాయి. వెంటనే గంగన్నను పట్టుకొని చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించారు. పక్షులనంతా తిరిగి అడవిలో వదలి పెట్టారు. అవి ఆనందంగా కేరింతలు కొడతా సంబరంగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి.


ఊరి పెద్దలంతా రాము, మిన్నూల సాహసాన్ని మెచ్చుకుని “శభాష్... మీలాంటి పిల్లలు ఈ దేశానికి ఎంతో అవసరం” అంటా అభినందించారు.---సమాప్తం