మూడు వరాలు (బాలల సరదా కథ)* పునఃకథనం:డా.ఎం.హరికిషన్

 చాగలమర్రిలో గోవిందు అనే ఒక రైతు వుండేవాడు. ఒకసారి వాళ్ళింటికి శ్రీశైలం నుంచి ఒక సాధువు వచ్చాడు. గోవిందు ఆ సాధువుకు సకల మర్యాదలు చేశాడు. సాధువుకు చానా సంతోషం కలిగింది.


గోవిందుతో “మూడు వరాలిస్తాను కోరుకో" అన్నాడు. గోవిందు మంచి మంచి వరాలు కోరుకోవాలని తెగ ఆలోచించాడు. కానీ అప్పటికేమీ తోచలేదు. దాంతో ఆ సాధువు "సరే! బాగా ఆలోచించుకో. కానీ నువ్వు మాట్లాడే మొదటి మూడు వాక్యాలే నెరవేరుతాయి" అన్నాడు. గోవిందు ఇంటి ముందున్న మర్రి చెట్టు కింద అరుగు పైన కూర్చోని “ఏం వరాలు కోరుకోవాలా!" అని బుర్రబద్దలు కొట్టుకోసాగాడు.. ఇంతలో పైనుంచి ఒక కాకి వాని తలమీద రెట్ట వేసింది. గోవిందుకు కోపం వచ్చి “ఛీ! పాడు కాకి చస్తే బాగుండు" అన్నాడు. అంతే వెంటనే కాకి కిందపడి గిలగిలా కొట్టుకొని చచ్చిపోయింది. ఒక వరం పోయినందుకు బాధపడి మిగిలిన రెండు వరాల కోసం ఆలోచించడం మొదలు పెట్టాడు. అంతలో అన్నం తినడానికి రమ్మని వాని భార్య లోపల్నుంచి ఒకటే పిలువసాగింది. వరాల గురించి ఆలోచిస్తూంటే మధ్యలో దీని గోలేంది' అనుకొని “నేను రాను. ఈన్నే వుంటా" అన్నాడు. అంతే రెండో వరం నెరవేరి అరుగుకు అలాగే అతుక్కుపోయాడు. ఎంత లాక్కున్నా, పీక్కున్నా అరుగు మీదనుంచి కొంచెం గూడా కదల్లేక పోయాడు. ఇంక గతిలేక 'అరుగుమీది నుంచి బైటబడాల' అన్నాడు. అంతే మూడో వరం కూడా అయిపోయింది. మూడు వరాలు వృధాగా పోగొట్టుకొన్నందుకు బాధ పడ్డాడు.


కామెంట్‌లు