చదువు తోనే వెలుగు --మొహమ్మద్ . అఫ్సర వలీషా ద్వారపూడి (తూ గో జి)

తరగతి గదిలో  పంతులు గారు  పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మధ్యలో రవి "నేను లోపలికి రావచ్చునా పంతులు గారు "అన్నాడు దీనంగా.
పంతులు గారు ఆగ్రహంగా "ఇప్పుడు సమయం చూశావా ఎంతైందో " అన్నారు.
రవి కళ్ళమ్మట వచ్చే నీళ్లు లోలోపలే అదుముకుంటూ 
మాటలు లేక అలా మౌనంగా నిలబడి పోయాడు.
దారిలో రాజు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి నీవు గనుక పంతులు గారితో చెప్పావంటే నీ తల వేయి ముక్కలవుతుందని .మారు మాట్లాడకుండా చేయి ముందుకు చాపాడు .పంతులు గారి బెత్తం దెబ్బలు రవి చేతులను తాకుతుంటే రవి ఆ దెబ్బలను మౌనంగా బాధను రెండు పళ్ళ మధ్య అదిమి పెట్టుకున్నాడు. 
రోజూ రవి ఆలస్యంగా వచ్చి దెబ్బలు ఎందుకు తింటున్నాడో సమాధానం చెప్పకుండా అర్థం కాలేదు పంతులు గారికి . మదిలో భేతాళ ప్రశ్న తొలుస్తున్నది.
ఒక రోజు రవిని అనుసరించారు పంతులు గారు .రవి స్కూల్ కు ఇంటి దగ్గర నుండి సమయానికే బయలు దేరాడు. కొంత దూరం వచ్చాక దారి మారింది. మెల్లగా పంతులు గారు రవి చూడకుండా అనుసరించ సాగారు.
ఒక చోట రవి ఆగాడు.  అక్కడ కొంతమంది టిఫిన్  పొట్లాలు ప్యాక్ చేస్తూ ఉన్నారు. వారితో ఏదో మాట్లాడిన రవి, అక్కడి వారు పొట్లాలన్నీ ఎత్తి ఒక వ్యాను లో వేస్తుంటే రవి కూడా అందిస్తున్నాడు .
పంతులు గారికి అర్థం కాలేదు. ఇక సస్పెన్స్ భరించలేక రవి కెదురుగా వెళ్ళి "ఏం చేస్తున్నావ్ ఇక్కడ అన్నారు" పంతులు గారు గద్దిస్తూ.
పంతులు గారిని చూసి కంగారు పడ్డాడు రవి "ఏం లేదని నసుగుతూ ఇక లాభం లేదని " మా అమ్మ కు ఆరోగ్యం బాగా లేదండి .వైద్యం చేయించాల్సిన నాన్న తాగేస్తూ డబ్బులు ఇవ్వడం లేదు ఇదేంటని అడిగితే ఇంటికి పెద్ద కొడుకుగా నీదే బాధ్యత అని నాన్న చెప్పాడు ఈ విషయం ఎవరితో చెప్పవద్దన్నాడు, అందుకే రోజూ ఇక్కడ పనిచేసి ఒ రెండు గంటలు ఆలస్యంగా స్కూల్ కు  వస్తున్న అమ్మ కోసం" అన్నాడు బాధగా రవి.
"మీ నాన్న సంగతి తర్వాత చెప్తా ముందు నీ లాంటి ఉత్తమ కొడుకును కన్న ఆ తల్లి అదృష్టవంతురాలు. 
నీవు చదువు కుంటేనే మీ అమ్మ కోసం ఏదైనా చేయగలవు అంటూ" హృదయానికి హత్తుకున్నారు పంతులు గారు .....