కోపం నష్టం--- యామిజాల జగదీశ్

కోపం ఎప్పటికీ నష్టమే.
కోపం మాటలను యథేచ్ఛగా వాడేస్తూ
తర్వాత నొప్పిస్తుంది.
చేతిలో ఉన్నది విసిరేస్తాం. దానివల్ల నష్టం తప్ప వస్తువుకో అవతలి వ్యక్తికో కాదు.
అప్పటిదాకా ప్రేమించిన వ్యక్తినీ 
చీదరించుకుంటాం. అంతా కుదుటపడ్డాక
అయ్యయ్యో అనుకుంటాం.


ఓమారు బుద్ధుడు ఓ ఊళ్ళోకి వెళ్ళాడు.
అక్కడొకడు బుద్ధుడిని నానామాటలన్నాడు.
అతనిపైన ఉమ్మాడు.
కానీ 
బుద్ధుడు తిరిగీ ఒక్క మాటా అనలేదు.
ప్రశాంతతనే పాటించాడు.
అప్పుడా కోపిష్టికి ఏమీ తోచలేదు.
బుద్ధుడ్ని అడిగాడు...
"నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను.
నువ్వు తిరిగీ నన్నేమీ అనలేదు? ఎందుకని"
అని.
అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు...


"నువ్వు నీకిష్టమైన ఒకరికి
ఓ కానుక ఇస్తావు. కానీ వారది తీసుకున్నా 
అదేమిటో చూడకుండా నీకు తిరిగిస్తే బాధపడేదెవరు? ఆ కానుక నీదగ్గరే ఉండిపోయింది. అది నీకానందమా? అలాగే నీ కోపావేశాలను నేను స్వీకరిస్తేగా నేను బాధపడాలి. నిన్ను కోపగించుకోవాలి. నేనూ నానామాటలు అనాలి. కానీ నేనసలు నీమాటలనూ నీ చర్యలనూ పట్టించుకోలేదు. అంటే అవన్నీ
నీకే చెందాయి. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది" 


అందుకే ఏదైనా అనే ముందు
ఆలోచించాలంటారు అనుభవజ్ఞులు.