, “it is not the destination that is important but the people we meet and the lessons we learn”,
జ్యోతిష్యం మీద ఎవ్వరికి ఎంత వరకు నమ్మకం ఉందో కాని కొన్ని దృష్టాంతాలు
చూస్తే కాదని మొండిగా వాదించలేము.
అలాంటి ఒకటి రెండు సంఘటనలు చెప్పి ఆతరువాత నా బియ్యెడ్ విశేషాలు చెబుతాను. దీనిని నేను ఎవరినీ ప్రభావ పరచాలనే ఉద్దేశంతో చెప్పటం లేదు.
భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉండటం సహజం.కాని నేను నా అంతట నేనుగా నా జ్యోతిష్యం చూయించుకోవాలనో ఇంకేదో ప్రయత్నం చేయలేదు కాని గమ్మత్తుగా నా జాతకం గురించి తెలుసుకునే అవకాశం మొదటి సారి డిగ్రీ చదివేప్పుడు కలిగింది. కరీంనగరులో డిగ్రీ చదివేటప్పుడు మాకు హర్తాళం నరసింహ శాస్త్రి గారు తెలుగు లెక్చరరుగా వచ్చారు.కొన్ని రోజులకే మేం ఒకరిద్దరం వారికి కాస్తా
దగ్గరయ్యాం.ఓ రోజు ఆయన నా జన్మ తేదీ వగైరా లన్నీ అడిగారు.ఎందుకు సార్ అంటే నీ జాతకం రాసిస్తానురా అన్నారు.సరే ఇచ్చాను.అందులో 25 ఏళ్లకు పెళ్లవుతుంది.భార్యామూలం ధనప్రాప్తి అని రాశారు.నేనది చూసి నవ్వుకున్నాను.ఈయనేమిటి ఇలా రాశారు.నేనసలు వరకట్నం తీసుకోవాలనుకోవటం లేదు కదా !సరే ఎప్పుడో జరిగేదాని గురించి ఇప్పుడు ఆలోచన ఎందుకని ఆయన రాసిచ్చిన కాయితం దాచిపెట్టాను.అప్పుడు నాకు 18 ఏళ్లు మాత్రమే.నేను ఆసంగతి కొన్ని రోజులకే మరచి పొయ్యాను.
కాగజ్ నగర్ రావడం ఉద్యోగంలో చేరడం మూడు నాలుగేళ్ల తరువాత నేను నయపైసా వరకట్నం తీసుకోకుండా ఉషను పెళ్లి చేసికోవడం జరిగింది.మా గురువు గారు సగం మాత్రమే కరెక్టు అనుకున్నాను. ఎందుకంటే ఆయనన్నట్లు 25 సంవత్సరాలకు మాత్రం పెళ్లి జరిగింది.
భార్యామూలం ధనప్రాప్తి అంటే వరకట్నం మాత్రమే అని చిన్న బుర్రలో ఆలోచన.కాని గురువు గారి మాట తప్పు కాలేదని తరువాత అర్థమయింది. ఎందు కంటే పెళ్లయిన నెల రోజులకే ఉద్యోగంలో చేరింది.అలా చేరిన మనిషి 36 సంవత్సరాలు ఉద్యోగం చేసి తన జీతం నా ఇంటికి ఇవ్వటం కాదు ఆమె చనిపోయిన తరువాత కూడా నాకు తన పెన్షన్ వస్తుందంటే ఇది ఏమనుకోవాలి.
అసలు ఈ విషయం వేరే దానికోసం చెప్పాల్సి వచ్చింది.అదేమిటంటే ఓ రోజు తెలుగు సాహితీ సదస్సు నెలనెలా కవి సమ్మేళనం జరుగుతుంది ఎవరింట్లోనో. అప్పటికి సర్సిల్కు సజావుగా నడుస్తుంది.అది బందయ్యే సూచనలు గానీ నేను నిరుద్యోగి నవుతానని గానీ నేను కలలో కూడా ఊహించేటఅవకాశం లేదు.పై చదువులు చదువుకోవాలనే ఆలోచన గానీ,అవసరం గానీ లేవు.అటువంటి సమయంలో నా ప్రక్కనే కూచున్న జ్యోతిష్యం తెలిసిన మిత్రులు కొమ్మెర రాజేశ్వర రావుగారు యాదాలాపంగా నా అరచేయి చూడటం జరిగింది.చూస్తూనే మీరింకా పై చదువులు చదువుతారు అన్నారు.నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఏంటండీ మీరు నాకు చదుకోవాలనే ఆలోచనే లేదు.అన్నాను.ఏమో ఆ రేఖలు అలా చెబుతున్నాయి అన్నారు.
నేను చాలా తేలికగా తీసుకున్నాను.కానీ
ఇదిగో కంపెనీ బందవటం,నేను నిరుద్యోగిని కావటం,బియ్సెడ్ చెయ్యాలనుకోవడం,సీటు రావడం జాయిన్ కావడం అన్నీ ఐపోయాయి. అప్పుడు నిజంగానే రాజేశ్వర్రావుగారి మాట గుర్తుకు వచ్చింది.ఆ తరువాత రిటైరవటానికి రెండేళ్ల ముందు ఎం.ఏ తెలుగు చేసినప్పుడు కూడా అనుకున్నాను.జరిగిన విషయాలను పంచుకోవటమే నా ఉద్దేశమని మరోసారి చెబుతూ ఎట్లాగైతేనేం వరంగల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో చేరాను.హనుమకొండలో నా తరువాతి తమ్ముడు ఉండటంతో అక్కడే ఉండి బి.ఎడ్ చేయటం జరిగింది.
ఆ బ్యాచ్ లో విచిత్రంగా కాగజ్ నగర్ నుండే ఎనమండుగురం ఉన్నాం.శంకరయ్య,డి.శ్రీనివాస్,యం.రాధాకిషన్,అనూరాధ,వామనమూర్తి,రాజేంద్ర ప్రసాద్,క్రిష్ణపాద నేనూ అందరం కాలేజీలో చేరిన తరువాత తెలిసింది.వాళ్లందరూ అటు డిగ్రీ కాగానే ఇటు బియ్యెడ్ లో చేరిన వాళ్లు20 నుండి 22 ఏళ్ల మధ్యలో ఉన్న బ్యాచిలర్స్.వాళ్లే కాదు మా బ్యాచ్ లో దాదాపు అందరూ అదే వయసు వాళ్లే,ఎవరో ఒకాయన ఇన్ సర్వీసు క్యాండిడేట్ తప్ప. నాకప్పటికి 33 దాటి 34 నడుస్తున్నది.అసలే డిగ్రీ జై తెలంగాణా బ్యాచ్.ఆ చదివిన చదువు కూడా ఎన్నడో అడుగంటింది.మళ్లీ మ్యాథ్స్,మళ్లీ ఫిజిక్స్,మళ్లీ కెమిస్ట్రీ.
కాని ఎక్కడి నుండి వచ్చిందో ఉత్సాహం
మిగతా వాళ్లతో పోటీ పడి చదివాను. కష్టపడ్డాను. మిత్రులందరూ ఎంతో సహకరించారు.మా లెక్కల మాస్టారి సమ్మారెడ్డి కి అత్యంత ప్రియ విద్యార్థిని కావటం ,నా ప్రాక్టికల్ లెస్సన్ చూసి సంబర పడి పోవటం,అన్నీ తలచుకుంటే చాలా జాయ్ ఫుల్ మూమెంట్స్ అనిపిస్తుంది.(సశేషం)
మా బియ్యెడ్ మిత్రులతో మధ్యలో ఇరువురి మీద చేతుల వేసి కూచున్నది
నేను
ఉపాధ్యాయపర్వం-18 : రామ్మోహన్ రావు తుమ్మూరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి