"మేడి పండు చూడ మేలిమై ఉండు
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ"
'అమ్మా నేను పార్క్ నించి వస్తుంటే మన సందు చివర పెద్ద గొడవ అవుతోంది. ఏంటో అని వెళ్ళి చూస్తే మన పక్కింటి ఆంటీ పెద్దగా అరుస్తూ నానా గొడవ చేస్తోంది' అని నాని రొప్పుతూ తల్లి విజయ కి చెప్పాడు.
ఏం జరిగిందో అని విజయ అక్కడికెళ్ళి అడిగితే తెలిసిందేమిటంటే, పక్కింటి నళిని ఆఫీస్ నించి వస్తుంటే పక్క బస్తీ పిల్లవాడొకడు చూసుకోకుండా పరుగెత్తుకుంటూ ఈవిడ కారుకి అడ్డం వచ్చాడుట. అంతే ఆవిడ కార్ ఆపి వాడికి నాలుగు వడ్డించి ఇహ తిట్లకి తగులుకుందిట.
ఇంతలో జరిగింది తెలిసి బస్తీలో వాళ్ళంతా వచ్చి ఆవిడని అడ్డగించి గొడవకి దిగారుట.
పిల్లాడ్ని కొట్టటమైతే కొట్టింది కానీ, బస్తీ వాళ్ళంతా వచ్చి అలా చుట్టుముట్టి గొడవ చేసి కదలకుండా చేస్తారని ఊహించలేదు. దానితో బిక్క మొహం వేసి కళ్ళ నిండా నీళ్ళతో ఎవరైనా వచ్చి తనని కాపాడకపోతారా అని దిక్కులు చూస్తున్నది.
విజయ చొరవ చేసి వాళ్ళకి సర్ది చెప్పి ఓ వంద రూపాయలు ఆ పిల్లాడి తండ్రికిచ్చి నళిని ని విడిపించుకొచ్చింది.
ఇంట్లోకొస్తుంటే భర్త రాజు 'ఏంటోయి ఏదో మళ్ళీ కొత్త గొడవని చక్కదిద్ది వస్తున్నావా? ' అని అడిగాడు.
విజయ జరిగిన విషయం చెబుతుంటే, మధ్యలో కలగ చేసుకుని 'అదేంటి, ఆవిడ మీ ఎవరితోను మాట్లాడకుండా ఏదో తనే ఉద్యోగం చేస్తున్నట్టు పెద్ద పోజ్ కొడుతుంది కదా! రోడ్డులో వాళ్ళ మీద తన ప్రతాపం చూపిస్తే ఎవరూరుకుంటారు?' అన్నాడు.
'అంతే కాదండీ కార్లో వెళుతూ డాబుగా డ్రెస్ చేసుకుని తన స్థాయికి తగని చెత్త భాష మాట్లాడే సరికి వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. అప్పుడు బిక్కమొహం వేసి, కాపాడటానికి ఎవరొస్తారా అని చూస్తున్న టైంలో నేను వెళ్ళాను' అన్నది విజయ.
రాజు వెంటనే, అందుకే
మేడి పండు చూడ మేలిమై ఉండు
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
.............................
అన్నారు. ఈ మాత్రం దానికి అంత పోజులెందుకో! నలుగురిలోను పరువు పోగొట్టుకుంటే చివరికి వాళ్ళే గతి అయ్యారు కదా అన్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి