నిజాయితీ: --డా.. కందేపి రాణీప్రసాద్.

రామపురంలో వెంకటచారి అనే ఒక స్వర్ణకారుడు ఉన్నాడు. చేతినిండా పనిలేక చాలీచాలని సంపాదనతో బతుకు వెళ్ళదీస్తున్నాడు.ఎంత తినటానికి లేకపోయిన నిజాయితినే నమ్ముకున్నవాడు. ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించడం అన్నది అతనికేమాత్రం ఇష్టం లేని పని. భార్య ఈశ్వరమ్మ కూడా అతనికి తగిన ఇల్లాలే. కానీ ఇద్దరు ఆడపిల్లలకి ఎలా పెళ్లిళ్లు చేస్తామో అని దిగులు పడుతూ ఉంటుంది.
 ఇదిలా ఉండగా ఒకనాడు వెంకటాచారి పని చేయటానికి బొగ్గులు లేకపోవటంతో కొనుక్కురావటానికి వెళ్ళాడు. బొగ్గులు తెచ్చుకొని కుంపట్లో వేసి నిప్పు రాజేయ్యబోయాడు. అంతలో అతని దృష్టి బొగ్గులపై పడింది. అందులో ఒక బొగ్గు ఏదో వింతగా అనిపించి బయటికి తీసి చూశాడు. కొత్త తటపటాయింపుతో రకరకాల పరీక్షలు చేసి చూశాడు. అనుమానం లేదు. అది వజ్రమే. ఆశ్చర్యంగా దాని వంకే చూస్తుండిపోయాడు.
 యధాలాపంగా అటువైపు వచ్చిన అతని భార్య “ఏంటి! పని చేయకుండా ఏం చూస్తున్నారూ?” అంటూ దగ్గరకొచ్చింది. “ఈ బొగ్గును చూశావా! ఇది వజ్రం తెలుసా?” అంటూ ఆ బొగ్గును భార్యకు చూపించాడు. ఆమె దాన్ని చూసి ఆశ్చర్యపోతు “ఎంత పెద్ద వజ్రం! దీన్ని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి కదూ! మన కష్టాలు తీరిపోవడమే గాక మన పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేయవచ్చు” అన్నది.
 “ఇది మన కష్టార్జితం కాదు. మనకు దొరికిన వస్తువును రాజుగారికి అందజేయడం మన వీధి” అన్నాడు వెంకటచారి నిశ్చలంగా. “అదేంటండి! ఆలాగంటారు. మనం కొనుక్కున్న బొగ్గుల్లోంచే కదా ఇది దొరికింది. మామూలు వారికి దీనిని గుర్తించే శక్తి లేదు కాబట్టి గుర్తించలేకపోయారు. మీకా ప్రజ్ఞ ఉన్నది కాబట్టే గుర్తించారు. ఇంకా దీనికి ఎంతో సానపట్టి, బహుముఖాలుగా చెక్కితేనే గాని తళతళ మెరిసే వజ్రంగా మారదు. ఇదంతా మన కష్టమే గదా!” అన్నది అతని భార్య ఈశ్వరమ్మ. “నువ్వు చెప్పింది నిజమే గాని, ఈ వజ్రాన్ని మనం ధరించనూలేము. అమ్ముకుందామంటే కొనగలిగే ధనవంతులు మన గ్రామంలో ఉండరు. పైగా దొంగ సొమ్మనుకునే ప్రమాదం ఉన్నది. అందువల్ల దీనిని రాజుగారికివ్వటమే ఉత్తమం” అని అన్నాడు వెంకటచారి.
 అంతలో వీధిలో రక్షకభటులు “మన మహారాజుగారికి బుల్లి యువరాణిగారు జన్మించారు” అంటూ చెప్పటం కనిపించింది. అది విన్న వెంటనే ఈశ్వరమ్మ “మనం ఈ వజ్రాన్ని యువరాణి గారికి బహుమతిగా ఇద్దాం” అన్నది. దానికి వెంకటాచారి కూడా సంతోషపడిపోయి “ఒక హారం లా చేస్తే బాగుంటుంది కానీ మన దగ్గర బంగారమే లేదుగా” అన్నాడు. అప్పుడు ఈశ్వరమ్మ తన దగ్గరున్న పూసల దండను తీసి ఇస్తూ “ఈ పూసల దండకు వజ్రాన్ని లాకెట్ లా అమర్చి ఇస్తే ఎంతో బాగుంటుందని సూచించింది. ‘అలాగే’ అని ఎంతో నైపుణ్యంతో చక్కని హారాన్ని తయారు చేసి రాజమందిరానికి వెళ్ళాడు.
 బుల్లి యువరాణి గారికి బహుమతిగా హారాన్ని సమర్పించాడు. రాజు ఆహారాన్ని చూసి అతని పనితనాన్నిఎంతగానో మెచ్చుకున్నాడు. అతని నిజాయితీని, కష్టపడేతత్వాన్ని ఇంతకు ముందే విని ఉన్నాడు. ఈరోజు ప్రత్యక్షంగా చూశాడు. అతడి ఇబ్బందుల గురించి తెలుసుకున్న మహారాజు వెంకటాచారికి ఇక్కడి ముబ్బడిగా కానుకలు ముట్టజెప్పాడు. అంతకాకుండా “ఇక నుంచి అంతపురానికి సంబందించిన బంగారు నగలన్నీ నీవే తయారు చెయ్యాలి” అంటూ ఆజ్ఞాపించాడు.
 చేతినిండా పని దొరికినందుకు వెంకటాచారి మహదానంద పడిపోయాడు. మహారాజు ఇచ్చిన కానుకలను చూసిన ఈశ్వరమ్మ ‘ఇక నా పిల్లల పెళ్లిళ్లకు దిగులు లేదు’ అనుకోని సంతోషపడింది. అప్పటి నుంచి ఆ కుటుంబం తిండికి లోటు లేకుండా ఆనందంగా జీవితం గడుపుతోంది నిజాయితీగా.


కామెంట్‌లు