ఉపాధ్యాయపర్వము-21: - రామ్మోహన్ రావు తుమ్మూరి

అలా మొత్తానికి నా పేరు చివర B.Sc.తో పాటు B.Ed.చేరింది.రిజల్టు వచ్చింది గనుక ఇక ఉద్యోగాన్వేషణ చెయ్యాలి.కాగజ్ నగర్ లోనే అనుకోండి.ఎందుకంటే కాగజ్ నగర్ పట్టణంలో ఉన్నన్ని స్కూళ్లు అంతే జనాభాగల ఇతర పట్టణాల్లో సగము కూడా ఉండకపోవచ్చు.చూడండి అప్పటికి జెడ్పీ హైస్కూల్,సర్ సిల్క్,
జెడ్పీ హైస్కూల్,పెట్రోలుపంపు,
గవర్నమెంటు హైస్కూల్,ఓల్డ్,
గవర్నమెంటు హైస్కూల్,న్యూ, గవర్నమెంటు హైస్కూల్,ఈజ్గాం,
జెడ్పీ హైస్కూలు,చింతగూడ
ఇవి ప్రభుత్వ పాఠశాలలు ఐతే ఇక ప్రైవేటు పాఠశాలల సంగతి సరస్వతీ శిశుమందిర్  హైస్కూలు(తె.మీ.), బాలభారతి హైస్కూలు(తె.మీ),
విద్యాధరి హైస్కూలు (తె.మీ.)
బాలవిద్యామందిర్ హైస్కూలు ( హిం.మీ),శిశుమందిర్ హైస్కూలు
(హిం.మీ & ఇం.మీ),ఫాతిమా కాన్వెంటు హైస్కూలు(ఇం.మీ),నెహ్రూ కాన్వెంట్ హైస్కూలు (ఇం.మీ)
పదమూడు హైస్కూళ్లు.అప్పర్ ప్రైమరీ,ప్రైమరీ పాఠశాలలకు లెక్కే లేదు.
సరే గవర్నమెంట్ బళ్లను వదిలేస్తే ప్రైవేటు బళ్లల్లో బాలభారతి చాలా పెద్ద స్కూలు.దాదాపు రెండువేలకు పైగా విద్యార్థులున్న స్కూలు,పేపరుమిల్లు ఆధ్వర్యంలో నడపబడే పాఠశాల.దానికి
కరస్పాండెంట్ రాజారెడ్డి గారు.ఆయన పేపరుమిల్లులో చాలా పెద్దపొజిషన్ లో ఉన్నవ్యక్తి.ప్రధానోపాధ్యాయిని పంకజ వల్లి గారు. 
       నేను అప్లికేషన్ తీసుకుని రాజారెడ్జి గారి దగ్గరికి వెళ్లాను.నన్ను చూడగానే ఆయన గుర్తు పట్టారు.సాధారణంగా ఆయన దగ్గరికి వెళ్లాలంటే చాలా మంది జంకుతారు.ఒకటి పొజిషన్ పెద్దది.రెండవది ఆయన బాగా బిజీ కనుక  ముక్తసరిగా మాట్లాడే అలవాటు.అయితే నన్ను గుర్తు పట్టడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఆయన లలితకళా సమితి గౌరవాధ్యక్షులు గనుక అప్పుడప్పుడు ఆయన దగ్గరికి పని మీద వెళ్లటం,కార్యక్రమాలు జరిగినపుడు ఆయన అతిథిగా వస్తే కార్యకర్తగా నేను చురుకుగా పాల్గొనటం ఇవన్నీ ఉన్నాయి.ఇక రెండవ కారణం అంత ముఖ్యం కాకపోయిన ఎంతో కొంత ఆ ప్రభావం ఉండదని అనుకోను. అదేమిటంటే, ఒకసారి ఉషవాళ్ల తాతయ్య ఒకాయన వచ్చారు.మాటల సందర్భంలో రాజారెడ్డిగారు ఆయనకు 
బాలియమిత్రుడు,సహాధ్యాయి అనీ ఆయనది మా ఊరే అనీ,ఒకసారి కలిసి వద్దామంటే ఆయన్ని తీసుకు వెళ్లాను.
అదీ కూడా గుర్తు ఉండి ఉండవచ్చు.
మొత్తానికి ఆయనకు అప్లికేషన్ ఇచ్చి 
విషయం చెప్పగానే వెంటనే అయితే ఇంకేమిటి రెండుమూడు రోజుల్లో లెటర్ పంపిస్తాను వచ్చి జాయిన్ కా.నీకు ఇంటర్వ్యూ అవసరం ఏముంది?అన్నారు.అమ్మయ్య అనుకున్నా. అన్నట్టుగానే రెండురేజులకు ఓ పోస్ట్ కార్డ్ మీద నెలకు నాలుగు వందల జీతం వచ్చి చేరమని రాసి పంపించారు.భలే ఎకానమీ అనుకున్నా.ఆ కార్డు పట్టుకుని
మరునాడు బాలభారతి స్కూల్ కు వెళ్లాను.అక్కడ ప్రధానోపాధ్యాయినిగా ఉన్న పంకజవల్లి మేడం గారిని కలిసాను.ఆమె కూడా బాగా పరిచయ మున్న వ్యక్తే. అయినా ఇప్పడు నేను ఉద్యోగిగా వెళ్లాను గనుక yours obediently లాగే లెటర్ చూపించాను.
ఆమె దానికి తగిన విధంగా స్పందించి మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి రిజిస్టర్ లో సంతకం చేయించారు.అలా అఫీషియల్ గా ఉపాధ్యాయుడిని అయ్యాను.రెండు రోజుల్లో టైంటేబుల్ ఇచ్చారు.ఏడు,ఎనిమిది తరగతులకు వేశారు.బాలభారతిలో పని చేసింది చాలా కొద్ది కాలమే అయినా అక్కడి అనుభవాలు కూడా భలేగా ఉంటాయి(సశేషం)


కామెంట్‌లు