223.పర్యావరణ గేయాలు:బెలగాం భీమేశ్వరరావు,9989537835.


 ప్రకృతి వ్యవసాయ వాచకాలు రాయడం వల్ల

పర్యావరణం మీద కొన్ని బాలగేయాలు తయారు చెయ్యాలన్న శ్రద్ధ కలిగింది.ఆ బాలగేయాలలో

కొన్ని మీ ముందుంచుతాను.గేయం పేరు

'వరదలు'!//ఆనాటి నేలలో/క్రిమి కీటకాదులు/

దండిగా మెండుగా/విలసిల్లి ఉండేవి//నేలగుల్లను

చేసి/నీరునింకించేవి/పంటలకు తేమను/నిత్యమందించేవి//ఈనాటి నేలలో/క్రిమికీటకాలేవి?/పురుగుమందులు వాడి/హతమార్చివేశాము//గుల్లైన నేలలకు/గోరీలు

కట్టాము/బీభత్స వరదలను/సృష్టించుతున్నాము//చేసిన తప్పులను/సరిదిద్దు

కొందాము/ప్రకృతి వ్యవసాయమును/ప్రోత్సాహ

పరచుదాం//క్రిమి కీటకాలపుడు/మరల మనగలుగును/నీటినింకించుతూ/వరదలను ఆపును//ఈ గేయం 2018 ఆగస్టు 25 వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది. మరొక

పర్యావరణ గేయం'కుశలం'!//పచ్చదనం పసరుతనం/భూమాతకు జీవగుణం/ధరణిపైన

ఆ హరితం/జీవులకు ప్రాణసమం//నీటికదే ఆధారం/బువ్వకదే ఆధారం/నీడకదే ఆధారం/

గాలికదే ఆధారం//చెట్లు, పొదలు,లతలుగాను/

ఏ రూపంలో ఉన్నను/పల్లవించు హరితదళం/

అభయ హస్తమిచ్చు వరం//చూడగానె పచ్చదనం/మనసు దోచ గలది నిజం/ప్రశాంతతను,ప్రమోదమును/ప్రసాదించు దివ్య

ధనం//పచ్చదనం ఉంటేనే/భూమాతకు చల్లదనం/చల్లదనం ఉంటేనే/మన మనుగడ కడు

కుశలం//ఈ గేయం 2018 ఆగస్టు 21 వార్త దినపత్రికలో వచ్చింది.ఇంకో గేయం"రసాయనలతో నేల"!//రసాయనాలతో నేల/రోగిష్టిగ మారుతోంది/పండుతున్న ప్రతి పంట/గరళంతో నిండుతోంది//రకరకాల రోగాలను/ తినే తిండి పిలుస్తోంది/మన జీవన

ప్రక్రియలకు/తూట్లు తూట్లు పొడుస్తోంది//ప్రాణమునే నిలుపు కూడు/ప్రాణమునే తీస్తోంది/

ప్రాణమున్న వాణ్ణి కూడ/పీల్చి పిప్పి చేస్తోంది//

రైతులార కాపులార/ప్రాణభిక్ష పెట్టండి/కొంపముంచు కంపెనీల/పురుగుమందులాపండి//

భావితరం క్షేమానికి/సహజసాగు చేయండి/ఆరోగ్య భద్రతకు/పెద్ద దిక్కు మీరండి//ఈ గేయం

2018 సెప్టెంబరు 18 వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.ఇంకో గేయం"జాగ్రత్త"!బాలలు తమ

సమస్యను పెద్దలకు విన్నవించుకున్ప వైనాన్ని

ఈ గేయంలో తెలిపాను.//పెద్దలార విజ్ఞులార/

ప్రముఖులార ప్రాజ్ఞులార/మా మాటను వింటారా/

మా క్షేమం కంటారా//క్రిమి సంహారక మందులు/

అతిగ వాడుతున్నారట/దాని వల్ల బాలలకు/

కీడు జరుగుతున్నాదట//బాలల్లో మెదడు వృద్ధి/ఆగిపోవుచున్నాదట/అమ్మ కడుపు లోన శిశువు/హాని పొందుతున్నాదట//ఈ ఘోరం ఆపలేర/

పెద్దలార ప్రముఖులార/ఈ పాపం అడ్డలేర/విజ్ఞులార నేతలార//బలహీనత భావితరం/మీరు

కోరుకుంటారా/చురుకుతనపు బాలతనం/కాలదన్నుకుంటారా//బాలలైన మా మీదను/

అశ్రద్ధను చూపతగదు/భావికాల వారసులను/

నగుబాటును చేయవలదు//ఈ గేయం బాల్యానికి

పొంచి ఉన్న ఆపదను తెలియపరచడానికి రాశాను.ఈ గేయ ప్రచురణ 2018 నవంబర్ 5 

వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.(సశేషం)