ఉపాధ్యాయపర్వం-35: రామ్మోహన్ రావు తుమ్మూరి

 నాకెంతో స్ఫూర్తి కలిగించిన సంగర్సు శ్రీనివాసరావు గారు నేను ఆ స్కూలునుండి బదిలీపై వెళ్లినపుడు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయించారు. ఇక్కడ బాలికోన్నత పాఠశాల సంబంధించిన చిన్న విషయం ప్రస్తావించాలి.
      ప్రేమలత మేడం స్కూల్ అసిస్టెంటు పోస్ట్ లో ప్రమోషన్ మీద వచ్చారు గనుక ఆమె H.M. అయ్యారు.అదే క్యాడర్ లో ఉన్న తెలుగు ,హిందీ పండిత్ లు సీనియర్లయినా బియ్యెడ్ కానందు కనుకుంటాను ఆ పదవి వారికి ఈయబడలేదో ఏమో అంతగా నాకు గుర్తు లేదు కాని కొన్ని చిక్కులు ఏర్పడ్డా యి. చిన్న చిన్న ఘర్షణలు జరిగినా అవి సారు లౌక్యం తోనే కుదుట పడ్డాయని చెప్ప వచ్చు.చూస్తుండగానే పాఠశాలకు  మంచి గుర్తింపు వచ్చింది.ఎనిమిది సంవత్సరాలు ఎలా గడిచాయో తెలీదు
ఇంతలో ప్రేమలత మేడంగారికి  లెక్చరరుగ ప్రమోషన్ రావటం , అదే సమయం లో నాకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కు ఎలిజిబిలిటీ (సీనియారిటీ  పరంగా) రావడం ఒకే సారి జరిగాయి. మేడం గారి స్థానం లో నాకు అవకాశం దొరుకుతుందని ఆశ పడటం లో తప్పు లేక పోవచ్చు గాని ,కొన్ని టెక్నికల్ కారణాల వల్ల నాకు పౌనూరు అని గోదావరి తీరం లో పోస్టింగ్ ఇచ్చారు.అది చాలా రిమోట్ ప్లేస్ అని రావడం పోవడం కష్టమని భయపెట్టారు.అయినా తప్పదనుకొని జాయిన్ కావడానికి సిద్ధం అయిన సమయంలో వేరెవరికో  రాస్పల్లి పోస్టింగ్ ఇస్తే అది వారికి అనుకూలంగా లేదని క్యాన్సల్ చేసుకుంటే, పౌనూరు బదులు నేను ఆ ప్లేస్ కోరుకున్నాను.నా అదృష్టం కొద్దీ తెలిసిన వాళ్ల ప్రమేయంతో రాస్పల్లి పోస్టింగ్ ఆర్డరు తెచ్చుకుని జాయిన య్యాను.జాయిన్ కాకముందు గుడ్డి కంటే మెల్ల నయం .దూరంగా ఉన్న పౌనూరు కంటే దగ్గరలో ఉన్న రాస్పల్లి నయం కదా అనుకున్నాను.కాని జాయినయిన తరువాత నేను మళ్లీ స్వంత ఊరు ఎలగందుల లాగా అనుభూతి చెందాను.రాస్పల్లి లో నా ఉద్యోగ పర్వం గుప్త రాజుల స్వర్ణయుగం లాంటిది.
      అయితే మళ్లీ మొదటికి వస్తాను. H.M.మేడం గారికి ,నాకూ కలిపి తాత్కాలికంగా ప్రధానోపాధ్యాయ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు సారు మరియు మిగతా టీచర్లు, విద్యార్థులందరూ కూడి చాలా ఆత్మీయంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.నాకోసం అయన స్వహస్తాలతో రాసిచ్చిన సన్మాన పత్రం ఇప్పటికీ పదిలంగా నా వద్ద ఉంది.
 కాని నేను రాస్పల్లి లో జాయినయిన కొంత కాలానికి ఆయన మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. అకస్మాత్తుగా పదవీ కాలం ముగియకుండానే ఆయన జీవితం ముగిసి పోవడం చాలా బాధాకరం.ఎన్నో సార్లు ఆయన ఇంటికి వెళ్లి గంటల తరబడి ముచ్చట్లు పెట్టు కోవటం,వాళ్ల అమ్మాయి (నా శిష్యురాలు కూడా) పెళ్లికి వెళ్లి పెళ్లి పనుల్లో పాలు పంచుకోవడం,అనేక సమస్య ల గురించి చర్చించుకోవడం అన్నీ గుర్తుకు వచ్చి ఒక మంచి మిత్రులు శ్రేయోభిలాషిని కోలిపోయినందుకు చాలా బాధ కలిగింది.ఎన్నో సార్లు కొడుకు ఉద్యోగం గురించి ఆలోచించేవారు.ఆయన భగవంతుణ్ని అదే కోరిక కోరుకున్నారేమో ననిపిస్తుంది.ఆయన మరణానంతరం ఆయన కుమారుడికి ఉద్యోగం దొరికిందని తెలిసింది.ఒక మంచి మిత్రుడు ముఖ్యంగ నేను కృతజ్ఞత గా కలిగి ఉండవలసిన వ్యక్తులలో ఆయన కూడా ఒకరు.ఇక రాస్పల్లి కబుర్ల లోకి మళ్లుదాం.(సశేషం)