బాలసాహిత్యం---59(2)-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252

ప్రముఖ బాలసాహితీవేత్త , సాహితీ శిల్పి , బాల సాహిత్య నిర్మాత,  డి.కే చదువులు బాబుగారు బాలసాహిత్య సాంస్కృతిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గా ఉంటున్నారు. ఈ సంస్థ ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థిని విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహణ, మొక్కలు నాటడం, పరిరక్షణ చేయడం చేస్తారు. పుస్తక ఆవిష్కరణలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. కవులు, రచయితలు, జయంతి వర్ధంతి సభల నిర్వహణ, పిల్లల్లో మాతృభాష పట్ల, తెలుగు సాహిత్యం, సంస్కృతి, సేవాభావం పట్ల అవగాహన కల్పించుట, శతక నీతి పద్యాలు పోటీలు, గేయాలు, కవితలు, కథలు, చిత్రలేఖనంపోటీలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపడతారు. సైన్ ఫ్లూ, ఎయిడ్స్ పై అవగాహన, స్వచ్ఛభారత్ మొదలగు అంశాలపై ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చదువులు బాబు గారు తన రెండు నేత్రాలను మరణానంతరం ఇవ్వడానికి నేత్ర దానం చేస్తూ ప్రమాణపత్రం నేత్ర నిధికి ప్రకటించి ఉన్నారు. నేత్రదానం, రక్తదానం, అన్నదానం, ఉచిత పుస్తకాల పంపిణి చేస్తూ పదిమందికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. వివిధ రంగాలలో వీరి సేవలను గుర్తించిన నాటి ముఖ్యమంత్రులు  డా.వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి,
చంద్రబాబు నాయుడు గారలచే  సత్కరింపబడ్డారు.
డాక్టర్. కొలకలూరి ఇనాక్ గారి నుండి సాహిత్య పురస్కారం, ఒంగోలు లిటిల్ చాంప్స్ టాలెంట్ అకాడమీ బాల కథా భాస్కర పురస్కారం, తెలుగు రక్షణ వేదిక  వారి నుండి 
" భాషా శ్రీ '' పురస్కారం,ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి చక్రధరరావు గారి నుండి గురు బ్రహ్మ పురస్కారం, యోగి వేమన ఉపకులపతి శ్రీ రామచంద్ర రెడ్డి గారి నుండి సాహిత్య పురస్కారం, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో పురస్కారం,  గిడుగు రామమూర్తి పంతులు సాహిత్య సేవ పురస్కారం, గురజాడ తెలుగు కవిత విశిష్ట సాహిత్య సేవా పురస్కారం, ప్రకాశం జిల్లా ఎల్ సి ఇ  కళారత్న పురస్కారం , కవయిత్రి మొల్ల సాహితీ పీఠం బాల సాహిత్య సేవ పురస్కారం, గండికోట మహోత్సవం సాహిత్య సత్కారం, సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ సత్కారం, కళా స్రవంతి సాహిత్య పురస్కారం, ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ , తెలుగు కళా వేదిక సంవత్సరం, తెలుగు రక్షణ వేదిక గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కవి సమ్మేళన సత్కారం, నారంశెట్టి సాహితీ  పీఠం బాలసాహిత్య జాతీయ
పురస్కారం,  ఆకెళ్ళ.వెంకట సుబ్బలక్ష్మి గారి సత్కారం, ఇంకా అనేక ఉపాధ్యాయ సంఘాల పురస్కారాలు---
ఇలా వివిధ సంస్థల నుండి శతాధిక సత్కారాలు పొందారు.
  "మాతృ భాషను మరువకు మన సంస్కృతి సాహిత్యాలను విడువకు, సేవ భావాన్ని వీడకు అనేది చదువుల బాబు గారి జీవితాశయం.  ఆ దిశగా కృషి చేస్తున్నారు కూడాను. చదువులు బాబు గారి కథలలో నుండి  ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన రావూరి భరద్వాజ గారు ఒక వాక్యం  తన ముందు మాటలో ఇలా వ్రాస్తారు. 
“ దేవుడు కష్టపడే వారికే సాయం చేస్తాడు. సోమరిగా కూర్చుని కష్టపడకుండా తనను వేడుకొనే వారికి సాయపడడు “ అని.  కడప జిల్లా సాహితీ మూర్తులు” అను పుస్తక ప్రచురణలో సందేశం తెలిపిన ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు " ఆరోగ్యకరమైన వాతావరణా నికి స్వచ్ఛమైన గాలి, ధారాళమైన వెలుతురు అవసర మైనట్లే , మనసుకు, మంచి జీవితానికి చక్కటి విలువలతో కూడిన సాహిత్యం చాలా అవసరం.” అంటారు. చదువులు బాబు గారి కవితా సంపుటి “  ఆకాశం అందుతోంది" అనే కవితా సంకలనంలో “ కాలం పండు” అనే కవితలో  “ గోడ పై వాలిన/ గడియారం చిలుక/కాలం పండును కొడుతోంది// అనే నాలుగు లైన్లను తీసి సి. నారాయణరెడ్డిగారు గడియారం చిలుక అనడంలో నవ్యత  ఉందంటారు. చదువుల బాబు గారు రాసిన మరో కవిత " ఓసారి" అనేక కవితలో  " దోసెడు నీళ్ళు పోస్తే/సర్వస్వం ఇచ్చేది చెట్టు/ సర్వస్వం ధారపోస్తే/బయటికి యీడ్చేది కొడుకు// నాలుగు లైన్లను సి.నా.రే గారు పేర్కొన్నారు.చివరన ఉన్న మరో రెండు లైన్లు హృదయావేదనను కలిగిస్తాయి. అవేమిటంటే----" వారానికొకసారైనా పలకరించరా కన్నా/ఆ పలుకే మాకు పన్నీరని మరవకురా చిన్నా//ఈ కవితా సంపుటిని రూపొందించిన చదువుల బాబు ఎందరెందరో చదువుల బాబుల అభినందనలు నాతో సహా ( సి.నా.రే తో సహా  ) అందుకుంటున్నాడని సి.నా.రే గారంటారు. అలానే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జీ వి సుబ్రహ్మణ్యంగారు, ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్. ఏబీకే ప్రసాద్ గారు, వెలగా వెంకటప్పయ్య గారు, డాక్టర్. ద్వా. నా శాస్త్రిగారు, రెడ్డి రాఘవయ్యగారు, వసుంధర గారు, బి ఆర్ 
వరదరాజులు గారు, వివిధ పత్రికలవాళ్ళు చదువుల బాబుగారి సాహితీ ప్రయాణం గురించి వారి వారి అమూల్య అభిప్రాయాలను వ్యక్తపరిచి ప్రశంసలు అందజేశారు. ఎందరో ప్రముఖుల మన్ననలను పొందిన  చదువుల బాబుగారు జీవితంలో మరిన్ని సాహితీ సేవలు చేయాలని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని మరెంతోమంది మన్ననలను పొందాలని  మనమంతా ఆశిద్దాం ! ( సశేషం )