బాలసాహిత్య వికాసం-విలువలు: ---జాని తక్కెడశిల --ప్రతిలిపి తెలుగు వెబ్సైట్ మేనేజర్ 7259511956
 బాల సాహిత్యం నాడు ఉంది. నేడూ ఉంది. అయితే… నాటి బాల సాహిత్యం అప్పటి పిల్లలకు ఉపయోగపడింది. నేటి బాల సాహిత్యంలో నేటి పిల్లలకు ఎంతవరకు ఉపయోగపడుతోందో తెలుసుకోవాల్సిన బాధ్యత బాల సాహిత్యం రాసే బాల సాహిత్యవేత్తలు గమనించుకోవాలి. బాల సాహిత్యాన్ని ఒకే మూస ధోరణిలో రాసుకుంటూ పోతే నిష్ప్రయోజనమే అవుతుంది.
“పాటల ద్వారా ఆటలు- ఆటల ద్వారా పాటలు” అన్నారు ఎల్లోరా గారు. వారి ఉద్దేశం రెండింటి కలయికతో పిల్లలకు శారీరక బలం, విజ్ఞానం కూడా వస్తుందని. మరి నేటి బాల సాహిత్యం… ఆ వాక్యాన్ని సంపూర్ణం చేస్తోందా అనేదే ప్రశ్న? పిల్లలకు బుద్ధిబలంతో పాటు శారీరక బలం కూడా అవసరం… ఆ రకమైన బాల సాహిత్య గేయాలు, ఆటలు, పాటలు రావాల్సిన అవసరం ఉన్నది. పిల్లలను ఎల్లప్పుడూ చదువు, చదువు అని మాత్రమే కాకుండా ఆడుకోడానికి కూడా సమయం కేటాయించాలి. ఆటల ద్వారా విజ్ఞానాన్ని అందించే మహత్తర సాధనం బాల సాహిత్యమే.
కథలను రెండు విధాలుగా విభజించుకొంటే :
1.      కథా సహిత
2.      కథా రహిత
కథాసహితలో వీరుల కథలు, అద్భుత కథలు, పురాణ కథలు, కల్పిత కథలు, కల్పిత గాథలు, నీతి కథలు ఉంటాయి. కథారహితలో పొడుపు కథలు, సామెతల కథలు, వాస్తవిక కథలు లాంటివి ఉంటాయి. నేటి పిల్లలకు ఎక్కువ ఉపయోగపడే కథలు రెండో రకం కథలే. మొదటి రకానికి సంబంధించిన కథా సాహిత్యం బోలెడంత ఉన్నది. దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి రాయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కాలంలో, ప్రస్తుత సమస్యలపై, ప్రస్తుత కాలానికి అనుగుణంగా బాలసాహిత్యం రావాలి. అలా రావాలంటే బాలసాహిత్యకారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి, కొత్తగా ఆలోచించాలి, నేటి కాలంలో నిలబడి సాహిత్య సృష్టి చేయాలి.
బాలసాహిత్య వికాసాన్ని ఎనిమిది ప్రధాన భాగాలుగా విభజించుకొంటే :
1.      జానపద బాల సాహిత్యం
2.      గేయ సాహిత్యం
3.      కథా సాహిత్యం
4.      శాస్త్రీయ సాహిత్యం
5.      దృశ్య సాహిత్యం
6.      పత్రికా సాహిత్యం
7.      ఆడియో సాహిత్యం
8.      ఆధునిక బాల సాహిత్యం
జానపద సాహిత్యం ఒక వర్గం అనుకుంటే అందులో బాలలకు ప్రత్యేకంగా రాసినదే జానపద బాలసాహిత్యం అవుతుంది. చాలా మంది అనుకున్నట్లు జానపద సాహిత్యం అంటే బాల సాహిత్యం అని కాదు. జానపద సాహిత్యాన్ని రాసి బాల సాహిత్యం అని చెప్పుకోవడం పొరపాటు, తప్పు.
బాల సాహిత్యంలో కథా సాహిత్యం వస్తున్నా… గేయ సాహిత్యం రావడం లేదు. వచ్చిన  కాస్త గేయ సాహిత్యంలో నాణ్యత కొరవడటం జీర్ణించుకోలేని అంశం. శాస్త్రీయ సాహిత్యం కూడా చాలా అరుదుగానే వస్తోంది. మారుతున్న కాలానికి తగినట్టుగా బాల సాహిత్యవేత్తలు కూడా మారాలి. కథలను దృశ్యాలుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. నాడు నాటకాల ద్వారా బాల సాహిత్యాన్ని దృశ్యంగా మార్చే అవకాశం ఉండేది. నేడు నాటకాల ప్రదర్శన తగ్గిపోయింది. కావున ప్రస్తుతం వస్తున్న సాహిత్యం, గతంలో వచ్చిన సాహిత్యాన్ని దృశ్య రూపకంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది. అప్పట్లో సెల్ ఫోన్ లేదా సామాజిక మాధ్యమాలు లేవు… దాని కారణంగా నాటి బాల సాహిత్యవేత్తలు వారు రాసిన సాహిత్యాన్ని వారే నేరుగా చదివి వినిపించలేకపోయారు. నేడు ఆ సదుపాయం ఉన్నది. అనేక సామాజిక మాధ్యమాల ద్వారా రచయితలు తాము రాసిన సాహిత్యాన్ని ఆడియోలో మార్చి భవిష్యత్ తరాలకు అందించవచ్చు.
పత్రికా సాహిత్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. నేడు పత్రికల్లో ముద్రణ అవుతున్న బాల సాహిత్యం అంతా బాల సాహిత్యమేనని ముమ్మాటికి అంగీకరించడానికి వీలు లేదు. వాస్తవానికి నేటి బాలలు ఎప్పుడో పత్రికలకు దూరం అయ్యారు. వందల కథలు, వేల గేయాలు పత్రికల్లో ముద్రణ అయినంత మాత్రాన ప్రయోజనం లేదు. బాల సాహిత్యం పేరుతో… పెద్దల సాహిత్యం రాస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఆ రకంగా పత్రికలు కూడా ప్రోత్సహించడం బాల సాహిత్య విలువలను నాశనం చేయడం, బాల సాహిత్య రూపురేఖలను కనుమరుగు అయ్యేలా చేయడమే. బాలసాహిత్య పేజిలకు సంపాదకత్వం వహిస్తున్న సంపాదకులు ఈ విషయం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బాల సాహిత్య కథ అని పేరు పెట్టి… మెయిల్ లో పంపే కథలు యధాతధంగా ముద్రణ చేస్తే… బాల సాహిత్యానికి మేలు కంటే కీడు చేసినవారు అవుతారు. 
ఆధునిక బాల సాహిత్యం అనుకున్నంత ఎదగడం లేదు. అసలు ఆధునిక బాల సాహిత్యం అంటే ఆధునిక ఆలోచనలు ఉండాలి. ఆధునికంగా రచయితలు ఆలోచిస్తే తప్పా… ఆ రకమైన సాహిత్యం ఎప్పటికీ రాదు. నేటి పిల్లలు ఎలా చెడు అలవాట్లకు గురి అవుతున్నారు, నేటి పిల్లల మానసిక ఒత్తిడి ఏమిటి? , నేటి పిల్లల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులపై, నేటి పిల్లల శారీరక సమస్యలు, సందేహాలు, అనుమానాలు, అసమానతలు, పూర్వం చెప్పిన ఆలోచనా రహిత సాహిత్యాన్ని ఖండిస్తూ తప్పు, ఒప్పులను వివరిస్తూ రాయడం, పురోగమన భావాలూ, జాతీయ భావాలూ, జాతీయత, దేశం, ప్రపంచం, ఎక్కడ… ఏం జరుగుతోంది అలాంటి అంశాలపై చర్చిస్తూ బాల సాహిత్యం రావాలి.
ఏ సాహిత్యంలో అయినా వ్యక్తిత్వ వికాసం ప్రధానంగా ఉండాలి. కాబట్టి బాల వికాసమే జాతి వికాసం అవుతుంది. పిల్లలు చైతన్యవంతులు అయితేనే… సమాజం చైతన్యవంతం అవుతుంది. పిల్లలను చైతన్యవంతులను చేయకుండా… పాత చిత్తకాయ పచ్చడి ఆలోచనలను నూరి పోసే సాహిత్యం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా… పిల్లలను వెనక్కి తీసుకెళ్లిన వారు అవుతారు. బాలలు సరైన మార్గంలో వికసించడానికి బాల సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది. బాల వికాసానికి బాల సాహిత్యంలో విలువల అవసరం ఉన్నది. పిల్లలకు చిన్నప్పటి నుండి విలువలు నేర్పించాలి. అలాగే వచ్చే బాలసాహిత్యం కూడా విలువలతో ఉండాలి. బాల సాహిత్యం పిల్లలకు ఎలాంటి విలువలను నేర్పించాలంటే…
1.      సామాజిక విలువలు
2.      వైజ్ఞానిక విలువలు
3.      నైతిక విలువలు
4.      చారిత్రాత్మక విలువలు
5.      వినోదాత్మక విలువలు
6.      భాషా సాహిత్య విలువలు
సాధారణంగా మానవుడు ఒంటిరిగా జీవించలేడు. ఎందుకంటే మానవుడు సంఘజీవి కనుక. అదే సంఘంలో బాలలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు బాలలకు సామాజిక విలువలపై చైతన్యం కలిగించాల్సిన బాధ్యత బాలసాహిత్యకారులపై ఉన్నది. సమాజంలో ఉన్న వింత సంప్రదాయాలు, సంస్కృతి, విశ్వాసాలు గురించి చెప్తూనే అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపాలి. ఆచారం మనిషి పురోగమనానికి ఉపయోగపడాలి కాని… వివక్షకు గురి చేసే ఆచారాలు, తిరోగమనం వైపు మళ్లించే ఆచారాలను… నేటి పిల్లలకు చెప్తున్నప్పుడు అందులోని తప్పులను సరి చేయాలి. తప్పును తప్పు అని చెప్పకుండా ముందుకు సాగడం వల్ల పిల్లలు అయోమయానికి గురి అవుతారు . మొదట రచయితకు ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడే అలాంటి బాలసాహిత్యం రాయాలి.
నేటి పిల్లలు తమ చుట్టూ ఏం జరుగుతోందో గమనిస్తున్నారు. పరిణామ క్రమం విజ్ఞాన పరంగా ఎలా ముందుకు సాగుతోందో చూస్తున్నారు. అలాంటి పిల్లలకు వైజ్ఞానిక విషయాలపై శాస్త్రీయ అవగాహన కల్పించాలే తప్ప… అశాస్త్రీయమైన, నమ్మశక్యం కాని విషయాలను చెప్పి తప్పుదోవ పట్టించడం సరైన చర్య కాదు. మారుతున్న సమాజంలో విజ్ఞాన శాస్త్ర అవగాహన లేకపోతే పిల్లలు వెనుకబడి పోతారు. నైతిక విలువలు నేర్పుతూ చాలా సాహిత్యం వచ్చింది కాని ఇంకా ఇంకా రావాలి. నైతికత అనేది ఒక్కో కాలంలో ఒక్కో రకంగా ఉంటుంది. దానికి కారణం మానవుల ఆలోచనా ధోరణే. కాబట్టి నైతిక కథలు కాలానికి అనుగుణంగా వస్తూనే ఉండాలి. నిరంతర ప్రవాహంలా సాగాలి. అయితే నీతి కథలు, నైతిక కథలు అంటే జంతు లోకాన్నే సృష్టించి చెప్పాల్సిన అవసరం నేటి పిల్లలకు లేదు. తమ చుట్టూ ఉన్న పాత్రల ద్వారా, మనుషుల ద్వారా చెప్పిన కూడా బాగుంటుంది.
ఆధ్యాత్మిక సాహిత్యం పిల్లలకు ఎక్కువగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు. ఏదో చేస్తాడు. దేవుడే సర్వస్వం. దేవుడి వల్లే సమాజం సాగుతోంది లాంటి విషయాలు తెలుసుకోడానికి పిల్లలకు కాస్త సమయం ఇవ్వాలి. చరిత్ర గురించి, చరిత్రకారుల గురించి, చారిత్రక విషయాల గురించి, ప్రాంతాల గురించి తగినంత సాహిత్యం రావడం లేదు. చరిత్రకు సంబంధించిన సాహిత్యం రాస్తున్నప్పుడు ఊహలను జోడించకుండా… జరిగింది రాయాలి. చరిత్రలో జరిగిన తప్పులను వివరించాలి. వినోదం తన హద్దును దాటి వెళ్ళకూడదు. వినోదం అంటే ఒకరిని అవమాన పరిచి, గేలి చేసి పొందేది కాదు. వినోదం స్వచ్ఛంగా ఉండాలి. మన భాష పట్ల ప్రేమ ఉంటూనే ఇతర భాషలను గౌరవించేలా భాషా సాహిత్య విలువలు ఉండాలి.
పెద్దల పట్ల గౌరవం, సర్వమత గౌరవం, శ్రమ విలువ, సమైక్యత, దేశభక్తి, పరిశుభ్రత, నిర్భయం, అహింస, సత్యం, సామాజిక సేవ, సహాయ సహకారాలు, సాహసం, సత్యం, ధైర్యం, స్నేహశీలత , జాలి, దయ, కరుణ, కృతజ్ఞత, విధేయత, నిస్వార్థం, సమానత్వం, నిజాయితీ, క్రమశిక్షణ, మానవత్వం, శాంతి, స్వీయ గౌరవం, సమయపాలన, మానసిక వికాసం, శారీరక కృషి, నేటి సమస్యల పరిష్కారాలు లాంటివి పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత బాలసాహిత్యవేత్తల మీద ఉన్నాయి. ఆ రకమైన కృషి చేసేవారే అసలైన బాల సాహిత్యవేత్తలు అవుతారు.